సిద్ధాంతపరంగా వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ వెనిజులా దేశాధినేతలకు సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధం, పుట్టపర్తిపై ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాయకురాలు రోడ్రిగ్జ్ కూడా 2024లో ప్రశాంతి నిలయాన్ని సందర్శించి బాబా పట్ల తనకున్న భక్తిని చాటుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అమెరికా అపహరించిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా సత్యసాయి బాబాకు పరమ భక్తుడు. ఆయన కేవలం సాధారణ భక్తుడు మాత్రమే కాదు, తన కార్యాలయంలో బాబా ఫోటోను కూడా ఉంచుకుంటారు. 2005లో మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి, బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మానవతావాదిగా అభివర్ణించారు. మదురో కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న హ్యూగో చావెజ్ హయాం నుండే వెనిజులా ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో సాయి భక్తి వేళ్లూనుకుంది.
తాజాగా బాధ్యతలు చేపట్టిన మధ్యంతర అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ కూడా రెండేళ్ల కిందట పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నివాళి అర్పిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
కమ్యూనిస్టు భావజాలం కలిగిన దేశాల్లో దైవచింతన తక్కువగా ఉంటుందన్న అంచనాలను వెనిజులా నేతలు పటాపంచలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ దేశ నేతలు పుట్టపర్తిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
