వెంక‌య్య చొర‌వ ఇంత‌కుమించి ఆశించ‌లేమా..?

ఉప‌రాష్ట్రప‌తి, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు కాస్త చొర‌వ చూపించారు. మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, ఎంపీ హ‌రిబాబు, సుజ‌నా చౌద‌రిల‌తో పాటు మంత్రి అనంత్ కుమార్ ల‌తో స‌మావేశమ‌య్యారు. దీన్లో ప్ర‌ధానంగా ఏపీలో సెంట్ర‌ల్, గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యాల‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ బిల్లును వెంట‌నే పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టాల‌ని కూడా సూచించారు. అంతేకాదు, నిధుల్లేవ‌నీ భ‌వ‌నాల్లేవ‌ని ఆల‌స్యం చెయ్యొద్ద‌నీ, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఈ రెండూ అందుబాటులోకి వ‌చ్చేలా చేయాల‌న్నారు. చాలారోజుల త‌రువాత ఏపీకి సంబంధించి అంశాల‌పై వెంక‌య్య చొరవ తీసుకున్నార‌ని చెప్పొచ్చు.

అయితే, ఇదే చొర‌వ‌ను ఇత‌ర హామీల విష‌యంలో ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉందా..? ఆర్థిక‌మంత్రినీ, ఇత‌ర మంత్రుల్ని ఇదే త‌ర‌హాలో త‌న ఛాంబ‌ర్ కి పిలిపించుకుని విభ‌జ‌న హామీల‌పై ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషించే అవ‌కాశం ఉంటుందా..? అంటే, లేద‌నే స‌మాధాన‌మే ఢిల్లీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. నిజానికి, ఈ మ‌ధ్య‌నే ఏపీకి వ‌చ్చిన వెంక‌య్య‌ను, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేస్తానంటూ చంద్ర‌బాబుకి మాట ఇచ్చారు.

కానీ, గ‌తంలో మాదిరిగా ఇత‌ర అంశాల‌పై జోక్యం చేసుకోవ‌ద్ద‌ని వెంక‌య్య‌కు మోడీ సంకేతాలు ఇచ్చార‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆయ‌న పిలిస్తే మంత్రులు ఎందుకు వెళ్లాల‌నే అంశాన్ని అమిత్ షా కూడా ప్ర‌ధానికి ఫిర్యాదు చేశార‌నీ స‌మాచారం. అయినాస‌రే, ఇలాంటి చిన్న‌చిన్న అంశాల్లోనైనా చొర‌వ తీసుకుంటే కొంత ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటుంద‌న్న ఉద్దేశంతో వెంక‌య్య తాజాగా యూనివ‌ర్శిటీల‌పై స్పందించిన‌ట్టు తెలుస్తోంది. అంతేగానీ, విభ‌జ‌న హామీలు, ఏపీ ఆర్థిక లోటు, ప్ర‌త్యేక హోదా లాంటి విష‌యాల్లో ఆయ‌న చొర‌వ చూప‌లేని ప‌రిస్థితే ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల తీరుపై కూడా ఆయ‌న‌ కొంత ఆవేద‌న‌గా ఉన్నార‌ని చూస్తూనే ఉన్నాం. రాజ్య‌స‌భ ఎంపీల‌కు ఇవ్వాల్సిన విందు కార్య‌క్ర‌మాన్ని కూడా వెంక‌య్య‌ ర‌ద్దు చేశారు. స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించ‌ని వారికి విందు ఎందుకు అనే కోపంతోనే ఆయ‌న ర‌ద్దు చేశార‌ని స‌మాచారం. ఒక విష‌య‌మైతే చాలా స్ప‌ష్టం… ఇచ్చిన హామీ ప్ర‌కారం కేంద్ర‌, రాష్ట్రాల మ‌ధ్య వెంక‌య్య జోక్యం అనేది దాదాపు సాధ్యం కాద‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.