వెంక‌య్య మ‌న‌సులో ఆ కోరిక ఉండిపోయిందా?

ఎన్డీయే ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడు పేరును ఖ‌రారు చేశాక‌… క్రియాశీల రాజ‌కీయాల‌కు ఆయ‌న దూరం కావాల్సి వ‌చ్చింది. పార్టీప‌రంగా భాజ‌పాకి కూడా ఇబ్బంది అన్న‌ట్టుగా ఆ పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, వెంక‌య్య క్రియాశీల‌త‌ను త‌గ్గించ‌డం కోస‌మే ప‌ద‌వి పేరుతో ఆయ‌న్ని లూప్ లైన్ లో పెట్టార‌న్న విమ‌ర్శ‌లూ అక్క‌డ‌క్క‌డా వినిపించాయి. ఇంత‌కీ ఉప రాష్ట్రప‌తి కాబోతున్న వేళ.. రాజ‌కీయ జీవితానికి సంబంధించి త‌న ప్లానింగ్ ఏంట‌నే విష‌యాన్ని వెంక‌య్య నాయుడు వివ‌రించారు. త‌న రిటైర్మెంట్ ఏలా ఉండాల‌ని ఆశించారో కూడా చెప్పారు. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశంలో త‌న ఆలోచ‌ల్ని పంచుకున్నారు.

త‌ల్లిలాంటి పార్టీని వ‌దిలి పెట్ట‌డం త‌న‌కు బాధాకరంగా ఉంద‌ని వెంక‌య్య నాయుడు చెప్పారు. ఒక స‌మ‌ర్థుడైన నాయ‌కుడిని వ‌దిలిపెట్టి వెళ్తుండ‌ట‌మూ త‌న‌కు క‌ష్టంగా ఉన్నారు. ఆ నాయ‌కుడికి చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విష‌యాల్లో క‌లిసి ప‌నిచేస్తున్న‌ ఇలాంటి త‌రుణంలో వ‌దిలి వెళ్ల‌డం బాధ అనిపిస్తోంద‌న్నారు. అంతేగానీ, ఇత‌ర‌త్రా కోరిక‌లేవీ త‌న‌కు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. కొన్ని ప‌త్రిక‌లు వాస్త‌వాలు తెలుసుకోకుండా క‌థ‌నాలు రాస్తున్నాయ‌ని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి మోడీ ప్ర‌ధాన‌మంత్రి అవుతార‌నీ, ఇది తన సొంత అభిప్రాయం కాద‌నీ, దేశ‌వ్యాప్తంగా తాను ప‌ర్య‌టించిన‌ప్పుడు ప్ర‌జ‌ల్లో గ‌మ‌నించిన ఆకాంక్ష అన్నారు. ‘అంత‌వ‌ర‌కూ ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకున్నాను. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని మరింత బ‌ల‌ప‌ర‌చిన త‌రువాత‌.. 2020 జ‌న‌వ‌రిలో రాజ‌కీయాల‌ను రాజీనామా చేయాల‌ని అనుకున్నాను. ప‌ద‌విలో ఉండ‌గానే రాజ‌కీయాల‌ను వ‌దిలేశాడ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగేలా చేయాల‌నుకున్నాను. సొంత ఊరికి వెళ్లిపోయి సామాజిక సేవ‌కు ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించుకున్నా’ అని వెంక‌య్య చెప్పారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఒక‌టికి రెండుసార్లు చెప్పాన‌ని వెంక‌య్య అన్నారు.

రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించి త‌న ఆలోచ‌న ఇలా ఉంద‌నీ, మంత్రి ప‌ద‌వి వ‌దిల‌పెట్ట‌డం వంటివి పెద్ద విష‌యాలుగా భావించ‌లేద‌న్నారు. ఇవ‌న్నీ తన ప్ర‌ణాళిక‌ల‌నీ, ఇప్పుడు ఇవ‌న్నీ పోయాయ‌న్న‌ది చిన్న బాధ‌గా ఉంద‌న్నారు. 2020 నాటికి త‌న‌కు 70 ఏళ్లు వ‌స్తాయి కాబ‌ట్టి, అక్క‌డితో రాజ‌కీయాల‌ను వ‌దిలి పెట్టేస్తే ప‌నైపోతుంద‌ని భావించాన‌నీ, కానీ పార్టీ నిర్ణ‌యించిన ఈ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించాల్సిందే అన్నారు. నిజానికి, త‌న‌ను ఈ ప‌ద‌వికి పంప‌డం వ్య‌క్తిగ‌తంగా న‌ష్ట‌మ‌ని ప్ర‌ధాని చెప్పార‌నీ, పార్టీకి కూడా న‌ష్టం, కానీ దేశానికి మేలు జ‌రుగుతుందనీ, ద‌య‌చేసి అంగీక‌రించాల్సింద‌ని మోడీ కోరిన‌ట్టు చెప్పారు. అన్నీ ఆలోచించాక‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నారా అని తాను ప్ర‌ధానిని అడిగితే.. వేరే ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేద‌నీ, ఈ ప‌ద‌వికి ద‌క్షిణాదికి చెందిన నాయ‌కుడు ఉండాల‌నీ, రైతు కుటుంబ నేప‌థ్యం క‌లిగిన‌వారు ఉండాల‌నీ, అంద‌రికీ ఆమోద‌యోగ్యుడై ఉండాల‌నీ, అలాంటి వారు మీరే త‌ప్ప వేరెవ‌రు అని ప్ర‌ధాని కోరిన‌ట్టు వెంక‌య్య వివ‌రించారు.

సో.. 2020 నాటికి రాజ‌కీయ జీవితానికి విశ్రాంతి ఇద్దామ‌ని వెంక‌య్య అనుకున్నారు. కానీ, అనూహ్యంగా పార్టీ పెట్టిన బాధ్య‌త‌ల్ని శిర‌సావ‌హిస్తున్న‌ట్టు వెంక‌య్య నాయుడు చెప్పారు. వెంక‌య్య రిటైర్మెంట్ ను ఇంకాస్త వెన‌క్కి జ‌రుపుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.