స్టార్ హీరోల పుట్టిన రోజులు వస్తున్నాయంటే… అభిమానులకు పండగే పండగ. ఎందుకంటే ఆ హీరోకి సంబంధించిన ఫస్ట్ లుక్కో, టీజరో, ట్రైలరో ఎంచక్కా చూసేయొచ్చు కదా. ఆ సంప్రదాయాన్ని వెంకటేష్ కూడా కొనసాగించాడు. ఈరోజు (డిసెంబరు 13) వెంకీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెంకటేష్ తాజా చిత్రం ‘గురు’కి సంబంధించిన టీజర్ విడుదలైంది. వెంకీ ఫుల్ డాన్సింగ్ మూడ్‌లో ఉన్న టీజర్ ఇది. 40 సెకన్ల టీజర్లో ‘మత్తైన’ స్టెప్పులేశాడు విక్టరీ వెంకటేష్. బాలీవుడ్ సినిమా ‘సాలా ఖదూస్’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘గురు’. సుధా కొంగర దర్శకురాలు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2017 జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వెంకీ బర్త్ డే సందర్భంగా టీజర్ వదిలారు.
టీజర్లో వెంకీ మేకొవర్ హైలెట్‌గా నిలిచింది. ఈసినిమా కోసం వెంకీ బరువు పెరిగాడు. గెటప్ మార్చాడు. సాధారణంగా హీరోల బర్త్ డే టీజర్ అంటే.. పవర్ ఫుల్ డైలాగ్ వినిపించడం పరిపాటి. అది లేకపోవడం… ‘గురు’టీజర్లో కనిపించే మేజర్ మైనస్. `గురు` లొకేషన్లు, నాజర్ గెటప్ చూస్తే.. ‘సాలా ఖదూస్’ ఏమంత మార్చినట్టు కనిపించడం లేదు. అయితే ఈ టీజర్‌కి సిసలైన హీరో వెంకీ అయినా.. అసలైన హీరో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అనిపిస్తోంది. మంచి బీట్ తో హుషారు తెప్పించాఉడ. ఇక పాట ఎలా ఉందో..? అయినా 40 సెకన్ల టీజర్ చూసి సినిమాని జడ్జ్ చేయలేం. వెంకీ ఫ్యాన్స్‌కి.. కొత్త తరహా సినిమాల్ని చూడాలనుకొనేవారికి ‘గురు’ నచ్చితే సరిపోతుంది.