కవిత భర్త కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై గతంలోనూ ప్రచారం జరిగినా ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డాక్యుమెంట్లు చూపించి మరీ ఆరోపణలు చేశారు. ఓవర్ ల్యాప్ భూముల పేరుతో వాటిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూమి విలువ వందల కోట్లు ఉంటుందని కూడా చెప్పారు. అదే సమయంలో కవిత కూడా కూకట్ పల్లి ఎమ్మెల్యే కు షేర్ ఉన్న ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆరోపణలు చేశారు.
ప్రణీత్ కంపెనీ ఆక్రణలపై కవిత చేసిన ఫిర్యాదులను హైడ్రా పరిశీలించింది. కబ్జాలు ఉంటే చర్యలు తీసుకోనుంది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరోపణలపై కవిత భర్త అనిల్ వి సంబంధించినవిగా చెబుతున్న భూములపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమయింది. ఈ భూములను అనిల్ మరో ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. వారిలో ఐవీ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ ల్యాండ్ డీల్స్ భూమి పూర్వపరాలతో విచారణ చేయనున్నారు .
ప్రభుత్వ ఆదేశాలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. విచారణలో ఏం తేలుతుందన్నది కీలకంగా మారనుంది. ఈ విచారణను కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు స్వాగతించారు. అక్రమాలన్నీ బయటకు వస్తాయని ప్రకటించారు. ఈ విచారణపై కవిత ఇంకా స్పందించలేదు.
