వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని .. టీవీకే విజయం సాధిస్తుందని .. సూపర్ స్టార్ విజయ్ చెబుతున్నారు. వేలూరు లో ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీ తమకు డీఎంకేకు మధ్యే జరుగుతోందని చెప్పారు. తద్వారా అన్నాడీఎంకే కూటమి రేసులోలేదని చెప్పే ప్రయత్నాలు చేశారు. సర్వేలు అన్నీ విజయ్ కు మూడో స్థానం ఇస్తున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకేకు ప్రజాకర్షక నేత లేని వైనాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో విజయ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో డీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు సంకేతాలు పంపడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
తమిళనాడులో అన్నాడీఎంకేకు బలమైన ప్రజాకర్షక నేత లేని లోటును తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని విజయ్ అమలు చేస్తున్నారు. సర్వేలు ప్రస్తుతం టీవీకేకు మూడో స్థానాన్ని కట్టబెడుతున్నప్పటికీ, అన్నాడీఎంకే బలహీనపడిన చోట ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే గతంలో కరూర్ తొక్కిసలాట వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అధికార పక్షం తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది తనతోనే సాధ్యమని విజయ్ బలంగా నమ్ముతున్నారు. స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు ప్రతిపక్ష కూటమి రేసులో లేదని చెప్పడం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలను విజయ్ వర్సెస్ స్టాలిన్ మధ్య జరిగే పోరుగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఫలితాలు ఎంత వరకు ఫలిస్తాయన్నదానిపై రాజకీయవర్గాల్లో సందేహాలున్నాయి.
