తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కరూర్ తొక్కిసలాట కేసు టీవీకే అధినేత విజయ్ చుట్టూ తిరుగుతోంది. ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. చార్జిషీట్లో ఆయన పేరు ఉండటం ఖాయంగాకనిపిస్తోంది. ల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం రెండోసారి విచారణకు హాజరైన విజయ్, సుమారు ఏడు గంటల పాటు అధికారుల ప్రశ్నలను ఎదుర్కొన్నారు. తాను పోలీసుల నిబంధనలన్నింటినీ తూచా తప్పకుండా పాటించానని …భద్రతా లోపమే 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమని విజయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. కానీ సీబీఐ అధికారులు పట్టించుకోలేదు.
విజయ్ తప్పిదాలపైనే ఎక్కువగా అధికారుల దృష్టి
సీబీఐ దర్యాప్తులో ప్రధానంగా విజయ్ సభకు ఆలస్యంగా రావడంపై అధికారులు దృష్టి సారించారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ఈ సభకు విజయ్ అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా రావడం వల్ల, అప్పటికే వేచి ఉన్న అభిమానుల మధ్య తోపులాట మొదలైందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, సభలో గందరగోళం మొదలైనప్పటికీ విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా పరిస్థితులను మరింత దిగజార్చిందని సీబీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే విజయ్‌కు తక్షణమే క్లీన్ చిట్ ఇవ్వడానికి దర్యాప్తు సంస్థ సిద్ధంగా లేదు.
వచ్చే నెలలో సీబీఐ చార్జిషీట్
ఈ ఘటనపై అత్యున్నత ధర్మాసనం సీరియస్ అవ్వడంతోనే విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. స్థానిక పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని బాధితుల కుటుంబాలు ఆందోళన చెందడంతో, నిష్పక్షపాత విచారణ అవసరమని సుప్రీంకోర్టు భావించింది. సీబీఐ ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుల పాత్రనే కాకుండా, ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసు అధికారుల వైఫల్యాన్ని కూడా పరిశీలిస్తోంది. ఫిబ్రవరిలో దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. విజయ్ తప్పిదాల దిశగానే సీబీఐ విచారణ జరుపుతూండటం టీవీకే పార్టీ నేతల్ని టెన్షన్‌కు గురి చేస్తోంది.
అభిమానుల సంఘీభావం
విజయ్ ఢిల్లీలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఆయన అభిమానులు సీబీఐ కార్యాలయం వెలుపల భారీగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తమ దళపతి తప్పు లేదని, ఇది కేవలం పోలీసుల వైఫల్యం , గుంపులోకి కొంత మంది కుట్ర చేయడానికి చొరబడటం వల్లే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో విజయ్ను ఇబ్బంది పెట్టేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన మద్దతుదారులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ కేసు విజయ్ రాజకీయ జీవితానికి కూడా అత్యంత కీలకంగా మారింది.
