అందరూ మంచోళ్లు అయితే నడవదు: విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా యూత్ అండ్ అర్బన్ ఆడియన్స్‌కి. మనోడికి ఒక్క సినిమాతో స్టార్‌డ‌మ్‌ వచ్చింది. తమిళంలో సినిమా చేసే అవకాశం తెచ్చింది. హిందీ ప్రేక్షకులకు అతడి పేరు తెలిసేలా చేసింది. అంతటి విజయం తరవాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ‘మహానటి’. మధ్యలో ‘ఏ మంత్రం వేసావె’ వచ్చింది కాని ‘అర్జున్‌రెడ్డి’కి ముందు నటించిన సినిమా కావడంతో అతడు లెక్కలోకి తీసుకోవడం లేదు. ‘మహానటి’లో విజయ్ దేవరకొండ హీరో కాదు. జస్ట్ సపోర్టింగ్ రోల్ చేశాడు. ఈ రోల్, ‘అర్జున్‌రెడ్డి’ తరవాత వచ్చిన స్టార్‌డ‌మ్‌ గురించి విజయ్ దేవరకొండతో తెలుగు360 ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ…

బుధవారం (రేపు) మీ పుట్టినరోజు కదా!

పుట్టినరోజు అని ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ‘మహానటి’ కోసం ఇస్తున్నా. నేను బ‌ర్త్‌డే సెలెబ్రేట్ చేసుకోను. అందుకని సినిమాల గురించి మాట్లాడుకుందామని మీడియా మిత్రులను పిలిచా.

బ‌ర్త్‌డే ఎందుకు ఇష్టం లేదు?

అందరూ ఫోనులు చేసి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ చెప్తారు. నాకు ఏం అనిపిస్తుందంటే… నేను ఏమీ చేయలేదు. పుట్టడం అనేది నా నిర్ణయం కాదు. మా పేరెంట్స్ డిసైడ్ కావడం వల్ల నేను పుట్టా. మంచి సినిమాలు చేశాననో.. మంచి పాత్ర చేశాననో.. అందరూ ఫోనులు చేస్తే ఎంజాయ్ చేస్తా. హ్యాపీగా వుంటా.

‘అర్జున్‌రెడ్డి’కి ముందు విజయ్ దేవరకొండ స్టార్‌డ‌మ్‌ వేరు. ‘అర్జున్‌రెడ్డి’ తరవాత స్టార్‌డ‌మ్‌ వేరు. హీరోగా పక్కన పెడితే వ్యక్తిగా ముందున్నట్టు వున్నారా? మారారా?

మారాను. జీవితంలో ముందునుంచీ మారుతూ వస్తున్నాను. పరిస్థితులకు తగ్గట్టు, చుట్టుపక్కల వ్యక్తులకు తగ్గట్టు, కలిసే వ్యక్తులను బట్టి ప్రతి మనిషి మారుతుంటాడు. నేనూ మారాను. పదో తరగతిలో వున్నట్టు ఇంటర్‌లో లేను. ఇంటర్‌లో వున్నట్టు డిగ్రీలో లేను. డిగ్రీలో వున్నట్టు నటుడిగా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో లేను. హీరో అయ్యాక అంతకు ముందు వున్నట్టు లేను. నాలో కోర్ సేమ్ వుంటుంది. కాని పరిస్థితులకు తగ్గట్టు మారుతుంటాం. అది నాకంటే నా చుట్టుపక్కల వ్యక్తులకు బాగా తెలుస్తుంది. సో.. మీరే చెప్పాలి. మార్పు అయితే వచ్చింది. వస్తూనే వుంది.

అసలు ‘అర్జున్‌రెడ్డి’ అంత సక్సెస్ అవుతుందని వూహించారా?

లేదు. సక్సెస్ అవుతుందని వూహించా. కాని అంత పెద్ద సక్సెస్ అవుతుందని వూహించలేదు.

వూహించని సక్సెస్ నటుడిగా మీలో మార్పును తెచ్చిందా? గర్వం పెరిగిందా?

మనం ఎంపిక చేసుకొనే కథలు మారతాయి. అంతకు ముందు ఒకలా ఆలోచించేవాణ్ణి. ఇప్పుడు మరోలా ఆలోచిస్తున్నా. నటుడిగా, హీరోగా నా స్థాయి పెంచుకోవాలని వుంటుంది. కథల పట్ల నా యాటిట్యూడ్ మారిపోతుంది. మన కెపాసిటీకి మించి డీల్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌… మా క్లాసులో అరవై మంది స్టూడెంట్స్ వుండేవారు. అందులో 25 నుంచి 30మంది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లను డీల్ చేయడం నాకు ఈజీ. ఒక్కసారి హీరోగా ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తరవాత వేలు, లక్షలమందితో డీల్ చేయాలి. సామాన్య మనిషికి అది సాధ్యం కాదు. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితులను అడాప్ట్ చేసుకుంటున్నా.

కాని విజయ్ దేవరకొండ తనకు వచ్చిన స్టార్‌డ‌మ్‌ని తెలివిగా వాడుకుంటున్నాడని చాలామంది అంటున్నారు. మీరు చేసే ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి!

నాకు చెప్పాలనిపించింది నేను చెబుతా. దానికోసం సపరేట్ ప్లానింగ్ ఏం లేదు. నేను సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెడితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా ఆలోచించను. ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారు. ప్రతి మనిషి రియాక్షన్‌ని మనం వూహించలేం. సక్సెస్ వచ్చాక నేను ఈ విధంగా మాట్లాడడం లేదు. అంతకు ముందునుంచీ ఇంతే. నరేంద్రమోడీ డీమానిటైజేషన్ గురించి ప్రకటించినప్పుడు.. ‘థిస్ మ్యాన్ హ్యాజ్ —-‘ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశా. అప్పుడు ఎవరికీ ఇబ్బందిగా అనిపించలేదు. నాకు సక్సెస్ వచ్చాక అలా మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు. నేను అప్పుడు ఎలా వున్నానో… ఇప్పుడూ అలాగే వున్నాను. ఫిలిమ్స్ సక్సెస్ అవ్వడం వల్ల ప్రపంచం నన్ను చూసే విధానం మారింది. దాన్ని నేను మార్చలేను. నేను నటుడిని కాబట్టి మీరు కోరుకున్న విధంగా మాట్లాడలేను.

మిమ్మల్ని ఇంతమంది గమనిస్తున్నప్పుడు బాధ్యతగా వుండాలి కదా!

ఏ విషయంలోనూ నేను బాధ్యతగా వుండాలని అనుకోవడం లేదు. రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. ‘వీడింతే, వీడి అభిప్రాయాలు ఇంతే’ అనుకోండి. మీకది నచ్చకున్నా ఫర్వాలేదు. మన పని మనం చేస్తున్నామంతే అనుకుంటా.

మీకు నచ్చినట్టు మీరుంటే విమర్శలు వస్తాయి. మీకు ఓకేనా?

ఓకే. అభిప్రాయాలు చెప్పడం ఓకే. ‘నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావ్. ఇట్లా మాట్లాడాలి’ అంటే నాకు కాలుతుంది. సచిన్ మీద నా ఒపీనియన్ చెబుతా. కామెంట్స్ చేస్తా. అలాగని సచిన్ వేల్యూ తగ్గదు. కామెంట్స్ చేయడం వరకూ ఓకే. అందుకని నేను రియాక్ట్ కాను. అప్పుడప్పుడూ ఒక్కసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటా. నేను తప్పో ఒప్పో ఆలోచించను. నేను ఏదైనా అంటే, అది సీరియస్ అయితే ఎక్కడో మూలాన దాక్కుని కనిపించకుండా పోను.

‘అర్జున్‌రెడ్డి’లో ఓ పదాన్ని సెన్సార్ వాళ్లు మ్యూట్ చేశారని మీరు విమర్శించారు. ఇప్పుడది బ్యాడ్ వర్డ్, వల్గర్ వర్డ్ అని డిస్కషన్ జరుగుతోంది. మీరు ఏమంటారు?

అది బ్యాడ్ వర్డే. సినిమాలో అది అవసరం. ఇప్పుడు కిల్లింగ్, డ్రింకింగ్, స్మోకింగ్ అన్నీ బ్యాడే. అవి లేకుండా సినిమాలు చేయలేము. మన జీవితంలో బ్యాడ్ అనేది ముఖ్యమైన భాగం అయ్యింది. అందరూ మంచోళ్లు అయితే నడవదు. వయలెన్స్, యాంగర్ నెగిటివ్ ఎమోషన్స్. సరైన సమయంలో వాడితే మంచి ఫలితాలు వస్తాయి. ఏది జరిగినా నేను రియాక్ట్ కకానంటే వర్కవుట్ అవ్వదు. సినిమాలో అర్జున్ రెడ్డి అటువంటి వర్డ్ వాడడం ఇంపార్టెంట్. బయట నాకు ఆలా జరిగితే అదే విధంగా రియాక్ట్ అవుతా. ఒక చెంప మీద కొడితే నేను రెండో చెంప చూపించే రకాన్ని కాదు. అలాగని, అదే రైట్ అని నేను చెప్పను. పూర్వం కోపం వస్తే కత్తులు, కఠారులతో చంపుకునేవారు. తరవాత భాష వచ్చాక తిట్టుకుంటున్నాం. సినిమాలో ఆ పదాన్ని నేను ‘కత్తి’ కింద ఉపయోగించా. ఎవరైనా నన్ను ఎటాక్ చేస్తే.. కత్తితో డిఫెండ్ చేసుకోవచ్చు. దాన్ని డిఫెన్స్ అంటారు. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళను పొడిచేస్తే అంటే టెర్రరిజం అంటారు. సమయం, సందర్భం లేకుండా వాడితే గొడవలు అవుతాయి.

ఇవన్నీ పక్కన పెట్టి.. ‘మహానటి’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?

‘అర్జున్‌రెడ్డి’ తరవాత ఒకరోజు స్వప్న అక్క (స్వప్నదత్) కాల్ చేసి సినిమా గురించి చెప్పింది. (నవ్వుతూ..) వెంటనే ‘అక్కా! నేను సావిత్రి రోల్ చేస్తా. ట్రై చేస్తా. నేను మంచి నటుడిని అని తెలుసు. కాని సావిత్రి రోల్ చేయగలనో లేదో’ అన్నాను. తాను గట్టిగా నవ్వేసి… ‘షటప్. నువ్వు ఈ సినిమాలో చిన్న రోల్ చేయాలి’ అని చెప్పింది. ఇదే టీంతో నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ చేశా. వాళ్లంతా నాకు క్లోజ్. నాగి (దర్శకుడు నాగఅశ్విన్) వ్యక్తిగా నేను పైకి రావడంలో హెల్ప్ చేశాడు. వాళ్లు అడిగారు. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. అందుకని, చిన్న పాత్ర అయినా చేశా. ఇందులో విజయ్ ఆంటోనీగా కనిపిస్తా.

ఒకవేళ నాగఅశ్విన్ దర్శకుడు కాదు.. దత్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ కాదు. ఈ సినిమా చేసేవాళ్లా?

నో. 100% చేసేవాణ్ణి కాదు. పక్కా వాళ్ల కోసమే చేశా.

‘జెమిని’ గణేశన్ పాత్రను మిమ్మల్ని చేయమని అడిగార్ట‌?

దుల్కర్ సల్మాన్ డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటే నాగి ఫోన్ చేసి ఆ పాత్ర చేయమని అడిగాడు. ఒక్కసారి ప్యాక్ అయ్యింది. ‘నో’ చెప్పలేను. ధైర్యం లేదని అనుకుంటారు. అలాగే, చేయాలంటే భయం వేసింది. ఇప్పటివరకు ఒరిజినల్ క్యారెక్టర్స్ చేయలేదు. అందుకని ఆయన నటించిన పాత సినిమాలు చూడడం స్టార్ట్ చేశా. మూడు రోజుల తరవాత నాగి కాల్ చేసి, దుల్కర్ ఒప్పుకున్నాడని చెప్పాడు. ‘హమ్మయ్యా’ అనుకున్నా. నేను ‘నో’ చెప్పలేదు. వాళ్లు మరొకర్ని తీసుకున్నారు.

‘అర్జున్‌రెడ్డి’తో మీపై అంచనాలు పెరిగాయి. ఆ సినిమా తరవాత ‘మహానటి’ చేయడం కరెక్టేనా? ఈ సినిమా ఆ అంచనాలను చేరుకుంటుందా?

‘మహానటి’ నా సినిమా కాదు. సావిత్రిగారి సినిమా. ‘మహానటి’లో ‘అర్జున్‌రెడ్డి’నో, విజయ్ దేవరకొండనో చూద్దామని థియేటర్లకు వస్తే ఫూలిష్‌నెస్‌ అవుతుంది. టైటిల్ చూసే సావిత్రిగారిని చూడాలని వెళ్ళాలి. మంచి కథ కాబట్టి అందులో చిన్న పాత్ర చేశా. సావిత్రిగారి గురించి సమంత రీసెర్చ్ చేస్తుంటే ఆమెకు హెల్ప్ చేసే ప్రియుడిగా కనిపిస్తా. నెక్స్ట్ ‘ట్యాక్సీవాలా’లో విజయ్ దేవరకొండను చూడడం కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాలి.

‘టాక్సీవాలా’ కాకుండా మీరు చేస్తున్న సినిమాలు?

గీతా ఆర్ట్స్ సంస్థలో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’. బిగ్ బెన్ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చేస్తున్నా. బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close