తమిళనాడు రాజకీయాల్లోకి త్తగా ప్రవేశించిన సినీ స్టార్ విజయ్, ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలోని ఒక చర్చిలో మోకాళ్లపై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. చర్చి గుమ్మం నుండి విగ్రహం వరకు ఆయన చేసిన ఈ వినూత్న ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తనను తాను జోసెఫ్ విజయ్ గా బాహాటంగా చెప్పుకుంటున్న ఆయన, మైనారిటీల మద్దతు కూడగట్టేందుకే ఈ స్థాయి భక్తి ప్రదర్శన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక నిర్దిష్ట పరిధిలోకి కుదించుకుంటున్నారా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.
తమిళనాడులో మైనారిటీ ఓట్ల లెక్కలు
తమిళనాడు ఓటర్ల జాబితాలో క్రైస్తవ ఓటర్లు సుమారు 6 నుండి 7 శాతం వరకు ఉంటారు. అయితే, కన్యాకుమారి, తిరునెల్వేలి, తిరుచ్చి వంటి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో ఈ ప్రభావం 20 శాతానికి పైగా ఉంటుంది. దశాబ్దాలుగా ఈ ఓటు బ్యాంకు సంప్రదాయకంగా డీఎంకే , కాంగ్రెస్ కూటమికి అండగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఆ బలమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలని విజయ్ భావిస్తున్నారు. అయితే, గుంపగుత్తగా ఈ ఓట్లు తన ఖాతాలో పడతాయని భావించడం సాహసమే అవుతుంది. ఎందుకంటే, అక్కడ మతపరమైన సమీకరణాల కంటే పార్టీల భావజాలం, వ్యవస్థీకృత నెట్వర్క్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సినీ గ్లామర్ వర్సెస్ మతపరమైన ముద్ర
సినిమా హీరోలకు వర్గాలకు, మతాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. విజయ్ కి ఉన్న మాస్ ఇమేజ్ లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ భాగమే. ఒకప్పుడు ఎంజీఆర్ లేదా జయలలిత వంటి వారు అందరినీ అలరించే నాయకులుగా ఎదిగారు. కానీ, విజయ్ ఇప్పుడు తన మత గుర్తింపును పదేపదే ప్రదర్శించడం వల్ల ఇతర వర్గాల అభిమానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మైనారిటీ ఓట్లపై ఆశతో మెజారిటీ వర్గాలను దూరం చేసుకుంటే, అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమస్యలు వస్తాయి. తమిళ రాజకీయాల్లో ద్రవిడ ముసుగు లేకుండా మతపరమైన కార్డుతో నెగ్గుకురావడం అత్యంత క్లిష్టమైన విషయం.
విజయ్ వ్యూహం ఫలిస్తుందా?
విజయ్ చేస్తున్న ఈ రిలీజియస్ పాలిటిక్స్ డీఎంకే కూటమిలో గుబులు రేపుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే క్రైస్తవ ఓట్లను చీల్చగలిగితే, అది అధికార పక్షానికి నష్టం చేకూరుస్తుంది. అయితే, మరీ ఇంత బహిరంగంగా ఒక చర్చిలో మోకాళ్లపై నడవడాన్ని సామాన్య ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కీలకం. సినిమా భాషలో చెప్పాలంటే.. ఒక హీరో కేవలం ఒక వర్గానికే పరిమితమైతే ఆయన ఇమేజ్ యూనివర్సల్ గా ఉండదు. రాజకీయాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందరివాడిగా గుర్తింపు పొందాల్సిన దశలో, ఒక వర్గం ఓట్ల కోసం పడుతున్న ఈ తాపత్రయం విజయ్ కు లాభం చేకూరుస్తుందో లేక ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తుందో ఎన్నికల ఫలితాలే నిరూపించారు.
