‘ఇదే నా చివరి సినిమా. ఇక నా ప్రయాణం రాజకీయాలతోనే’ అని చెప్పి మరీ.. పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు విజయ్. `జననాయగన్` విజయ్ చివరి సినిమా అన్నప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా పెద్దగా నమ్మలేదు. విజయ్ సీఎం అయితే సినిమాలు మానేయడం గ్యారెంటీ. కానీ విజయ్ సీఎం అవ్వడంపై ఎవ్వరికీ నమ్మకం లేదు. రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి అయిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. విజయ్ కింగ్ మేకర్ అవుతారని, కొంత కాలం గ్యాప్ తరవాత సినిమాలు చేస్తారని అనుకొన్నారు. కానీ.. విజయ్ అంచనానే నిజమైంది. ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ తన మాటపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ మళ్లీ మేకప్ వేసుకోవడం అసాధ్యం. ఇక ఆయన సినిమాలకు దూరం అయినట్టే.
అయితే త్రిష పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆమె చేతి నిండా సినిమాలే. కొత్త కథలూ వింటున్నారామె. విజయ్ కీ, త్రిష కెరీర్‌కీ లింక్ ఏమిటి అని అడిగితే… సమాధానం ఈజీ. విజయ్ లా.. త్రిష కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని, విజయ్ పార్టీలో ఆమె కీలక పాత్ర పోషిస్తారన్నది తమిళ మీడియా మొత్తం గగ్గోలు పెడుతోంది. నిజంగానే… త్రిష రాజకీయాలపై దృష్టి పెడితే, సినిమాలు తగ్గించుకోవాలి. కానీ.. అలా చేయడం లేదు. ఇది వరకటికంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నారామె. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిషని కథానాయికగా ఎంచుకొన్నారన్న వార్తలు వస్తున్నాయి. మలయాళంలోనూ ఓ సినిమా ఒప్పుకొందని టాక్. సినిమాలపై త్రిష పెడుతున్న ఫోకస్ చూస్తుంటే, ఆమెకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదనే అనుకోవాలి. లేదంటే.. అటు సినిమా, ఇటు రాజకీయాలు రెండింటి భారం మోస్తానన్న నమ్మకం అయి ఉండాలి.
కానీ ఓ వర్గం మాత్రం ‘త్రిష రాజకీయాల్లోకి వస్తే విజయ్ దారిలోనే సినిమాలకు గుడ్ బై చెబుతుంది, అలా జరగడం లేదంటే.. త్రిషకు రాజకీయాలపై ఫోకస్ లేనట్టే’ అని తేల్చేస్తున్నారు. అయితే త్రిష మైండ్ లో ఏముందన్న సంగతి ఆమెకే తెలియాలి.
త్రిష విజయ్ పక్షాన ఉండడం, విజయ్ ప్రమాణ స్వీకారం రోజున, ఆ వేడుకలో త్రిష స్పెషలాఫ్ ఎట్రాక్షన్ కావడం.. వీటివల్ల త్రిష కొంత నెగిటివిటీనీ భరించాల్సివస్తోంది. గాయని సుచిత్ర త్రిషని ఉద్దేశించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. త్రిష పరాన్న జీవి అని, విజయ్ కాపురం త్రిష వల్లే కూలిపోయిందన్నట్టు సుచిత్ర చేసిన వ్యాఖ్యలు విజయ్ ప్రత్యర్థులకు ఆయుధంలా మారుతున్నాయి. ఇక మీదట విజయ్‌ని టార్గెట్ చేయాలనుకొనే వాళ్లంతా త్రిషని కూడా కార్నర్ చేస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వరకు సినిమా వార్తల్లోనే త్రిష పేరు వినిపించేది. తాను రాజకీయాల్లోకి రాకపోయినా.. ఇక మీదట తమిళ రాజకీయాల ప్రస్తావనలో త్రిష పేరు గట్టిగా వినిపించడం ఖాయం.
