సీఎం చంద్ర‌బాబుదే త‌ప్పు.. కేంద్రానిది కాద‌ట‌..!

వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అదే ప‌నిలో ఉన్నారు..! అంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం నుంచి సాధించుకునే ప‌నిలో కాదు. ఆంధ్రా అనుభ‌విస్తున్న న‌ష్టాల‌కు కేంద్రం కార‌ణం కాద‌నీ, అంతా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే చేశార‌ని చాటిచెప్పే ప‌నిలో..! ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను భాజ‌పా స‌ర్కారు ఎలా కాల‌రాస్తోందో చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా… త‌ప్పు చంద్ర‌బాబు నాయుడుదే అని చెప్పడమే ప‌నిగా పెట్టుకున్న‌ట్టున్నారు. తాజాగా ఒక జాతీయ మీడియాలో విజ‌యసాయి రెడ్డి సుదీర్ఘ వ్యాసం రాశారు. దీన్లో వాస్త‌వాల‌ను ప్ర‌స్థావిస్తూనే.. ఆంధ్రా అవ‌స్థ‌ల‌కు కార‌ణాల‌ను కేంద్రం కాద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేశారు.

న‌వ్యాంధ్ర‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని నాటి మ‌న్మోహ‌న్ స‌ర్కారు చెప్పింద‌న్నారు. ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ హామీ ఇచ్చార‌నీ, ఆ త‌రువాత దీన్ని అమ‌లు చేయాలంటూ నాటి ప్ర‌ణాళికా సంఘానికి ప్ర‌భుత్వం నిర్దేశించింద‌ని చెప్పారు. అయితే, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్ర‌కారం ప్ర‌త్యేక హోదా ప్ర‌భుత్వం ఇవ్వ‌లేక‌పోతోంద‌ని ఇప్పుడు చెబుతున్నారు అన్నారు. ఇది వాస్త‌వం కాద‌ని ఆ ఆర్థిక సంఘంలోని స‌భ్యులే అభిప్రాయ‌ప‌డ్డార‌నీ చెప్పారు. ఆ సిఫార్సుల‌కూ ప్ర‌త్యేక హోదా అమ‌లుకూ ఎలాంటి సంబంధం లేద‌ని నిపుణులు చెబుతున్నార‌నీ విజ‌యసాయి ప్ర‌స్థావించారు. అయితే, సీఎం చంద్రబాబు సూచ‌న‌లు మేర‌కు రాజీనామా చేసిన కేంద్రమంత్రులు… హోదా అంశం సెంటిమెంట్ గా మారింద‌నీ, ప్ర‌జ‌ల భావోద్వేగాల‌కు అనుగుణంగా తాము న‌డుచుకున్నామ‌ని కారణాలు చెప్పార‌న్నారు. త‌మ హ‌క్కు కోసం ప్ర‌జ‌లు పోరాటానికి దిగారని చెబితే మ‌రింత బాగుండేద‌ని వ్యాఖ్యానించారు. హోదాను ప్యాకేజీ కోసం చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టేశార‌న్నారు. ఇప్పుడు, రాష్ట్రంలో త‌న వైఫ‌ల్యాల‌ను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రంపై పోరాటం అంటున్నార‌ని విమ‌ర్శించారు.

ఇదీ విజ‌య‌సాయి రెడ్డి వ‌రుస‌. ప్ర‌త్యేక హోదా అమలు అంశం ప్ర‌ణాళికా సంఘం వ‌ర‌కూ నాడు వెళ్లింద‌నీ ఆయ‌నే చెప్తారు, 14వ ఆర్థిక సంఘం హోదాకి ప్ర‌తిబంధ‌కం కాద‌నీ ఆయ‌నే అంటారు. అయినా ఎందుకు ఇవ్వ‌లేద‌ని మోడీ స‌ర్కారును విజ‌య‌సాయి ప్ర‌శ్నించ‌రు..? ఆ ప‌ని అధికార పార్టీ టీడీపీ చేస్తుంటే… అది వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చే కార్య‌క్ర‌మం అని ఎద్దేవా చేస్తారు..! గ‌డ‌చిన నాలుగేళ్లుగా కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాక‌పోవ‌డంలో, విభ‌జ‌న హామీలు అమ‌లు కాక‌పోవ‌డంలో భాజ‌పా స‌ర్కారు పాత్ర ఏంట‌నేది మాత్రం విజ‌యసాయి మాట్లాడ‌టం లేదు. ఇవ్వాల్సిన కేంద్రాన్ని ప్ర‌శ్నించాలిగానీ, పోరాడుతున్న రాష్ట్రాన్ని తప్పుబడితే ఎలా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.