ఆయ‌న‌కి ర‌న్నింగ్ కామెంట‌రీ అల‌వాటైపోయింది..!

సాధార‌ణంగా, ఏ పార్టీకి చెందిన నాయ‌కుడైనా… రాష్ట్రంలో జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాల‌పై మాత్ర‌మే స్పందిస్తారు. ఆ స్పంద‌న కూడా ఎలా ఉంటుందంటే… త‌ద్వారా తమ పార్టీకి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందా అనేది చూసుకునే విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లు లాంటివి చేస్తుంటారు. ఏమీ ఉప‌యోగం లేద‌నుకుంటే… కామ్ గా ఉండిపోతారు! కానీ, వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీరు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. రాష్ట్రంలో జ‌రిగే రాజ‌కీయ అంశాలే కాదు, ప్రైవేటు వ్య‌వ‌హారాల‌పైనా, ఆయ‌నకు ఏర‌కంగానూ సంబంధం లేని ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌పైనా నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ, దుమ్మెత్తిపోస్తూ ఉండ‌టం అల‌వాటుగా మారిపోయింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న మ‌రోసారి స్పందిస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

నియోజ‌క వ‌ర్గాల వారీగా జ‌రుగుతున్న స‌మీక్ష‌ల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అర్ధంత‌రంగా ఆపేశారంటూ సెటైర్లు వేశారు. సొంత నాయ‌కులే పార్టీకి ఎక్క‌డిక‌క్క‌డ వెన్నుపోటు పొడిచారంటూ త‌మ్ముళ్లు వాపోతున్నార‌నీ, వారిని ఎలా ఓదార్చాలో తెలియ‌కే స‌మీక్ష స‌మావేశాల‌ను చంద్ర‌బాబు నాయుడు ర‌ద్దు చేసుకున్నార‌న్నారు. ఇది ఇలాగే కొన‌సాగిస్తే.. కౌంటింగ్ లోపే కొంప కొల్లేర‌వుతుంద‌ని చంద్ర‌బాబు తెలుసుకున్నారని చెప్పారు! స‌మీక్ష‌ల్ని ఎందుకు కొన‌సాగించ‌లేక‌పోతున్నార‌న్న‌ది విజ‌య‌సాయి ప్ర‌శ్న‌? అయితే, గ‌త‌వారంలోనే… ఇవే స‌మీక్ష‌ల‌పై ఇంకోలా విమ‌ర్శ‌లు చేశారు వైకాపా నేత‌లు. ఎవ‌రైనా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత స‌మీక్ష‌లు చేసుకుంటారుగానీ, ముందుగానే స‌మీక్ష‌లేంటీ అంటూ త‌ప్పుబ‌ట్టారు. ఇవాళ్ల ఈయ‌నేమో స‌మీక్ష‌లు ఎందుకు కొన‌సాగించ‌డం లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి, ఇది టీడీపీ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం. దీనిపై విమ‌ర్శ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కి ఏముంది..?

మ‌రో ట్వీట్ లో తాజాగా చ‌ర్చ‌నీయం అవుతున్న టీవీ9 ర‌విప్ర‌కాష్ వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు చేశారు. టీవీ9 ర‌విప్ర‌కాష్ ని మీడియా న‌యీం అంటూ విమ‌ర్శిస్తూ… ఆయ‌న్ని ర‌క్షించ‌డానికి ఏ బాబు వ‌స్తాడో చూడాలంటూ… ప‌రోక్షంగా చంద్ర‌బాబు నాయుడు పేరును ప్ర‌స్థావించారు. వాస్త‌వానికి, ఇదో ప్రైవేటు సంస్థ‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. మీడియా వ్య‌వ‌హారం కాబ‌ట్టి కొంత ప‌బ్లిక్ అటెన్ష‌న్ కూడా వ‌చ్చింది. దీనికీ ఏపీ ముఖ్య‌మంత్రికీ లింక్ పెట్టి విమ‌ర్శలు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..? అలాంట‌ప్పుడు, ఏదైనా ఒక ఆధారాన్ని చూపుతూ విమ‌ర్శిస్తే.. కొంత బాగుంటుంది. త‌న‌కు ఏమాత్రం సంబంధం లేక‌పోయినా, దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కూ వారి సొంత రాజ‌కీయ పార్టీకి ఏ ఉప‌యోగం లేని అంశంమైనా స‌రే… దాని గురించి ఏదో ఒక ర‌న్నింగ్ కామెంట‌రీ చేయ‌డం విజ‌య‌సాయి రెడ్డికి దిన‌చ‌ర్య‌గా మారిపోయింద‌ని అనిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com