ఎమ్మెల్యేల బేరసారాలపై ఆధారాలున్నాయట..!

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై నిన్ననే ఐ.ఎ.ఎస్. అధికారుల సంఘం మండిపడిన సంగతి తెలిసిందే. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేను టీడీపీలో చేర్చేందుకు జరిగిన బేరసారాల్లో పలువురు ఉన్నతాధికారుల హస్తం ఉందని, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు గతంలో విజయసాయి ఆరోపించారు. దీనిపై అధికారుల సంఘం సీరియస్ అవుతూ ఒక నోట్ విడుదల చేసింది. ఉన్నతాధికారులను రాజకీయాల్లోకి లాగొద్దంటూ మండిపడింది. అంతేకాదు, ఆధారాలు లేకుండా ఇలాంటి విమర్శలు ఎలా చేస్తారంటూ ఆ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయసాయి రెడ్డి తాజాగా స్పందించారు.

ఐ.ఎ.ఎస్.లపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానన్నారు. సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఐ.జి. వెంకటేశ్వరరావు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదన్నారు. వైకాపా నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకి వెళ్లడం వెనక వీరు కీలకపాత్ర పోషించారని తాజాగా ఆరోపిస్తున్నారు.అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. కానీ, ఇప్పుడు వాటిని బహిర్గతం చేయననీ, సరైన సమయమూ సందర్భం వచ్చినప్పుడు బయటకి తీస్తానని ఆయన అంటున్నారు. అంతేకాదు, జంప్ జిలానీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చట్టంలోని లొసుగుల్ని ఉపయోగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నది కూడా ఈ అధికారులే ఆయన అన్నారు. దీనిపై వారు ఎంతవరకూ వెళ్తే, తాను కూడా అంతవరకూ వెళ్తానంటూ విజయసాయి పట్టుదలతో ఉన్నారు.

మొత్తానికి, ఐ.ఎ.ఎస్. అధికారులతో విజయసాయి రెడ్డి వివాదం ముదిరేట్టుగానే కనిపిస్తోంది. ఆధారాలున్నాయంటూ ఆయన అంత నిక్కచ్చీగా చెబుతున్నప్పుడు, దీనిపై అధికారుల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశంగా మారింది. అయితే, ఒకవేళ తన దగ్గర పక్కా ఆధారాలుంటే రాష్ట్రపతిని కలిసినప్పుడే బహిర్గతం చేస్తే సంచలనమయ్యేది కదా. సరైన సమయం వచ్చినప్పుడు బయటపెడతాను, అధికారుల ఎంతవరకూ వెళ్తే నేనూ అదే స్థాయికి వెళ్తానంటూ వేచి చూడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఇంకోపక్క.. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటే తప్ప అసెంబ్లీకి వచ్చేది లేదంటూ గత సమావేశాలను వైకాపా బహిష్కరించింది. ఈ ఆధారాలేవో అప్పుడే బయటపెట్టేసి ఉంటే ఇప్పటికే టీడీపీ సర్కారు ఇరుకున పడేది కదా. ఫిరాయింపుల్ని ప్రోత్సహించి నీతిబాహ్యమైన రాజకీయాలకు టీడీపీ పాల్పడిందనేది వాస్తవం. సరే, అప్పటికి ఆ ఆధారాలు ఆయన దగ్గర లేవనుకున్నా.. కనీసం ఇప్పుడైనా బయటపెడితే వైకాపాకి రాజకీయంగా కావాల్సినంత మైలేజ్ కూడా వస్తుంది కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.