తమిళనాడులో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతి పత్రాన్ని విజయ్‌కు అందజేశారు.
మెజారిటీ మార్కు 118 కోసం సాగిన ఉత్కంఠ పోరాటంలో వీసీకే , ఐయూఎంఎల్ పార్టీలు బేషరతు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 120కి చేరుకుంది. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జరిగిన నాలుగో భేటీలో ఈ మద్దతు లేఖలను విజయ్ స్వయంగా సమర్పించారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ప్రతినిధులకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావడంతో నిలిచిపోయిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు నెహ్రూ స్టేడియంలో మళ్లీ ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. విజయ్ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఇప్పటికే చెన్నైకి చేరుకుంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వెండితెర దళపతి గా ప్రజల మనసు గెలుచుకున్న విజయ్, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతుండటంతో తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది.
