రివ్యూ: విశ్వ‌రూపం 2

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

అమ్మ‌లు వంటింట్లో టీ, కాఫీ పెట్టేట‌ప్పుడు ఒక్క‌సారి చూడండి. పాల గిన్నె ఖాళీ అయ్యాక‌, అందులో కొన్ని నీళ్లు పోసి, గిర గిర తిప్పి.. ఆ నీటిని మ‌ళ్లీ పాల‌లో క‌లుపుతారు. అవి పాలూ కావు… నీళ్లూ కావు. తెల్ల‌గా ఉంటాయంతే!

విశ్వ‌రూపం 2 కోసం కూడా క‌మ‌ల్ హాస‌న్ అదే చేశాడ‌నిపిస్తుంది. విశ్వ‌రూపం 1 క‌థ రాసేశాక‌…. దానిపై మ‌మ‌కారం చావ‌క‌.. కొన్ని ‘నీటి’లాంటి సీన్ల‌ను క‌లిపి.. ‘పాలు’ అని భ్ర‌మ‌ప‌డి ‘పార్ట్ 2’కి ఒడిగ‌ట్టాడు. దాని ఫ‌లిత‌మే ‘విశ్వ‌రూపం 2’.

* క‌థ‌

వ‌సీమ్ (క‌మ‌ల్‌హాస‌న్‌) ఓ రా ఏజెంట్‌. పాకిస్థాన్‌లో ఉంటూ.. అక్క‌డి ర‌హ‌స్యాల‌ను అమెరికాకి చేర‌వేస్తుంటాడు. లాడెన్ ఆచూకీ సంపాదించ‌డానికి… ఒమ‌ర్ (రాహుల్ బోస్‌) అనే తీవ్ర‌వాదితో స్నేహం న‌టిస్తాడు. వ‌సీస్ ఓ గూఢ‌చారి అనే విష‌యం ఒమ‌ర్‌కి తెలిసిపోతుంది. కానీ ఈలోగానే త‌న ప‌ని పూర్తి చేసేస్తాడు వ‌సీమ్‌. అది పార్ట్ 1.

ఇప్పుడు పార్ట్ 2కి వ‌ద్దాం… పాకిస్థాన్ లో వ‌సీమ్ ఆప‌రేష‌న్ పూర్త‌వుతుంది. త‌న‌ని యూకే పంపిస్తారు. అక్క‌డ మ‌రో ఆప‌రేష‌న్ అప్ప‌గిస్తారు. ఈలోగా యూకేలో ఉన్న వ‌సీమ్‌పై, అత‌ని భార్య నిరుప‌మ (పూజా)పై దాడులు జ‌రుగుతుంటాయి. ఇండియా వ‌చ్చినా ఆ దాడులు కొన‌సాగుతాయి. త‌న‌ని న‌మ్మించి, మోసం చేసిన వ‌సీమ్‌ని శ‌త్రువుగా భావించిన ఒమ‌ర్ ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంటాడు. ఈ పోరు చివ‌రికి ఎలా ముగిసింది? ఎవ‌రు గెలిచారు? అనేదే పార్ట్ 2.

* విశ్లేష‌ణ‌

పార్ట్ 2 వేరు, సీక్వెల్ వేరు. సీక్వెల్ ఎప్పుడైనా ఎలాగైనా తీయొచ్చు. తొలి భాగంలో క‌నిపించిన పాత్ర‌లు సీక్వెల్ లో ఉండొచ్చు, ఉండ‌క‌పోవొచ్చు. అస‌లు ఆ క‌థ‌కీ, ఈ క‌థ‌కీ సంబంధం లేక‌పోయినా ఇబ్బందేం ఉండ‌దు. పార్ట్ 2 అలా కాదు. పాత్ర‌లు రొటేట్ అవ్వాలి. క‌థ కొన‌సాగాలి. అలా జ‌ర‌గాలంటే.. పార్ట్ 2కి వ‌చ్చే ప్రేక్ష‌కుడికి పార్ట్ 1 గురించి క్షుణ్ణంగా తెలిసుండాలి. కానీ ‘విశ్వ‌రూపం 2’ ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. పార్ట్ 1కీ పార్ట్ 2కీ నాలుగేళ్ల విరామం వ‌చ్చేసింది. కాబ‌ట్టి తొలి భాగం చూసిన‌వాళ్లు కూడా దాదాపుగా క‌థ‌ని మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంది. చూడ‌ని వాళ్ల‌కైతే…. అర‌బ్బీ సినిమాని, ఒరియా స‌బ్ టైటిల్స్ తో చూసిన ఫీలింగ్ క‌లుతుంటుంది. అప్ప‌టికీ.. ఫ‌స్ట్ పార్ట్‌లో ఏం జ‌రిగింద‌నేదానికి అక్క‌డ‌క్క‌డ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తూ హింట్స్ ఇచ్చాడు. దాంతో ఆ గంద‌ర‌గోళం కాస్త త‌గ్గింది. తొలి భాగంలో వేసిన చిక్కుముడులు కొన్నున్నాయి. వాటికి స‌మాధానం పార్ట్ 2లో క‌నిపిస్తుంది. ఓ సోల్జ‌ర్ దేశ ద్రోహిగా మారి, శ‌త్రు స్థావ‌రాల్లో అడుగుపెట్టి, అక్క‌డ స్థానం ఎలా సంపాదించుకున్నాడు? దాని వెనుక ఉన్న మిష‌న్ ఏమిటి? అనేదానికి స‌మాధానం పార్ట్ 2లోనే దొరుకుతుంది.

వ‌సీమ్ త‌ల్లి ఎవ‌రు? క‌థ‌క్ ఎలా నేర్చుకున్నాడు? ఒమ‌ర్ కుటుంబానికి వ‌సీమ్ నిజంగానే ద్రోహం చేశాడా, లేదా? అనేదానికీ స‌మాధానం ఇస్తుంది పార్ట్ 2. కాక‌పోతే.. అవేమీ పెద్ద‌గా ఆస‌క్తి క‌లిగించ‌వు. యూకేలో క‌మ‌ల్ పై తొలి ఎటాక్ జ‌రిగేంత వ‌ర‌కూ.. స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. ‘బ‌గ్’ సీన్ తో ఆస‌క్తి క‌లిగించాడు. అక్క‌డ డైలాగులూ బాగున్నాయి. కానీ కాల‌క్ర‌మంలో క‌థ ప‌ట్టు త‌ప్పింది. వ‌సీమ్ తెలివితేట‌ల‌కు, దేశ‌భ‌క్తికీ స‌వాలుగా నిలిచే సంద‌ర్భాలు పార్ట్ 2లో క‌నిపించ‌వు. దాంతో ఉత్కంఠ‌త‌కు దారి ఇవ్వ‌లేక‌పోయారు. విశ్రాంతి ముందు స‌న్నివేశం కూడా థ్రిల్ ఇవ్వ‌దు. సెకండాఫ్ లో మ‌ద‌ర్ సెంటిమెంట్‌కి చోటిచ్చారు. ఆ సీన్ బాగానే ఉన్నా.. క‌థ‌ని అవ‌స‌రం లేనిది. వ‌హిదా రెహ‌మాన్ ని మ‌రోసారి చూడ్డానికి మిన‌హాయిస్తే… పెద్ద‌గా కిక్ ఇవ్వ‌లేదు. చివ‌ర్లో ఒమ‌ర్ ప్ర‌తీకారం త‌ప్ప ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లేక‌పోవ‌డంతో పార్ట్ 2 చ‌ప్ప‌గా మారిపోయింది. ఈ క‌థ‌ని రెండు భాగాలుగా తీయాల‌న్న ఆలోచ‌నే త‌ప్పు అనిపిస్తుంది. రెండో భాగంలో సందేహాల‌కు ప్ర‌శ్న‌లు త‌ప్ప‌, స‌స్పెన్స్ ఉండ‌ద‌నుకున్న‌ప్పుడు… దాన్ని కూడా తొలి భాగంలోనే చేర్చేయాల్సింది. కానీ రెండు భాగాలుగా తీయ‌డంలో ఉన్న ఆర్థిక లాభాల్ని లెక్క‌లేసుకున్న క‌మ‌ల్‌… కేవ‌లం నిర్మాత‌గానే ఆలోచించి త‌న‌లోని క్రియేటివిటికి ద్రోహం చేశాడు.

* న‌టీన‌టులు

క‌మ‌ల్ బాగా చేశాడు.. అని రాస్తే రొటీన్‌గా ఉంటుంది. క‌మ‌ల్ న‌ట‌న విష‌యంలో కొత్త‌గా కితాబులు ఇవ్వాల్సిన ప‌ని లేదు. కాక‌పోతే… న‌టుడిగా త‌న స్థాయిని మ‌రోసారి గుర్తు చేసేంత స‌న్నివేశం, సంద‌ర్భం ఎదురు కాలేదు. ఒక్క వ‌హిదా రెహ‌మాన్‌తో ఉన్న సీన్‌లోనే ఎమోష‌న్స్‌ని చూపించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. క‌మ‌ల్ వ‌య‌సు మీద ప‌డింది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో దూకుడు త‌గ్గింది. అయినా స‌రే… క‌ష్ట‌ప‌డి ఒళ్లు వంచాడు. పూజా పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. క‌మ‌ల్ ప‌క్క‌న కూడా చాలా ఏజ్డ్‌గా క‌నిపించింది. ఆండ్రియా హుషారు ప్ర‌ద‌ర్శించింది. వ‌హిదా రెహ‌మాన్‌ని ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ చూడ‌డం ఆనందంగా అనిపిస్తుంది. ఆమె న‌ట‌న కూడా అత్యంత స‌హ‌జంగా అనిపించింది.

* సాంకేతిక వర్గం

టెక్నిక‌ల్ బ్రిలియ‌న్స్ ఈ సినిమాలో క‌నిపించ‌లేదు. బ‌హుశా టైమ్ లేక‌పోవడంతోనో, బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతోనో రాజీ ప‌డిపోయి ఉంటారు. క‌థ‌న‌లోపం ఈ సినిమాని బాగా ఇబ్బందిపెట్టింది. స‌రైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం, ఉత్కంఠ‌త క‌లిగించేలా స్క్రీన్ ప్లే రాసుకోక‌పోవ‌డంతో బిగి స‌డ‌లింది. ‘పంచ్ డైలాగ్ గుర్తు రాక‌పోతే… ఇంటికెళ్లి ఆలోచించి మెసేజ్ పంపు’ అనే డైలాగ్ థియేట‌ర్లో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. దేశం, మ‌తం, టెర్ర‌రిజంపై కొన్ని డైలాగులు ఉన్నా.. మ‌రీ అంత సీరియ‌స్‌గాచ‌ర్చించుకునేవి కావు. బ‌హుశా.. వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని క‌మ‌ల్ భావించి ఉంటాడు.

* తీర్పు

‘విశ్వ‌రూపం 1’ విడుద‌లైన ఆరు నెల‌ల‌కో, యేడాదికో పార్ట్ 2 కూడా వ‌చ్చేసి ఉంటే… ఆ సినిమాపై ఓ క్రేజ్ ఉండేది. ఈ సినిమాని ఆల‌స్యం చేస్తూ.. చేస్తూ.. ఆ క్రేజ్‌ని బాగా త‌గ్గించేసుకున్నాడు క‌మ‌ల్‌. నిజానికి ‘విశ్వ‌రూపం 2’పై ఇప్పుడు ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలూ లేవు. ‘ఏదో తీసుంటాడులే’ అనుకునే థియేట‌ర్లోకి వెళ్లిన ప్రేక్ష‌కుడ్ని… వాళ్ల అంచ‌నాల‌కు బాగా ద‌గ్గ‌ర‌గా వెళ్లి.. `ఏదో చేతికొచ్చింది తీసేశాడు`.

* ఫైన‌ల్ పంచ్‌: విష‌యం శూన్యం

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com