విశాఖ భూ కుంభ‌కోణంలో చ‌ర్య‌లు వారితో మొద‌లు!

విశాఖ భూ కుంభ‌కోణంపై ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఈ కుంభ‌కోణం విష‌య‌మై వేల సంఖ్య‌లో అర్జీలు స్వీక‌రిస్తోంది. ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు జ‌త‌చేసి పంపాలంటూ రాజ‌కీయ పార్టీల‌ను కూడా కోరిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు కూడా తాను చేసిన కొన్ని ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు జ‌త‌చేసి సిట్ కు అందించిన‌ట్టూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఫిర్యాదులు మాత్ర‌మే స్వీక‌రిస్తున్న‌ట్టు పైపైకి క‌నిపిస్తున్నా… ఈ దందాతో కొంత‌మంది నేత‌ల త‌ల‌రాతలు మార్చే స్థాయి చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం అవుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. గ‌త 20 ఏళ్లుగా ఈ భూముల విష‌య‌మై జారీ అయిన ఎన్‌.ఓ.సీ.ల‌పై సిట్ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. 69 మందికి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తే వారిలో ఇద్ద‌రు త‌ప్ప‌, మిగ‌తా వారంతా మాజీ సైనిక ఉద్యోగులే. అయితే, ఈ భూముల్ని సైనికులు అనుభ‌వించ‌డానికేగానీ, విక్ర‌యించే హ‌క్కు వారికి లేదు. ఇక్క‌డి నుంచే రాజ‌కీయ నేత‌ల రంగ ప్ర‌వేశం జ‌రిగింద‌నీ, పెద్ద‌ల అండ‌తో వంద‌ల ఎక‌రాల భూములు చేతులు మార్పిడి మొద‌లైంద‌ని సిట్ దృష్టికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

ఇక్క‌డి నుంచే అక్ర‌మాల ప‌ర్వం మొద‌లైంద‌నీ, రికార్డుల్లో టాంప‌రింగ్ వంటివి ఈ ద‌శ‌లోనే ప్రారంభ‌మై ఉంటాయ‌నే అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అయితే, ఇదంతా గ‌త ప్ర‌భుత్వాల‌ హ‌యాంలో జ‌రిగింద‌నీ, గ‌తంలో రెవెన్యూ మంత్రులుగా ప‌నిచేసిన ప్ర‌ముఖ నేత‌ల పేర్లు ఈ క్ర‌మంలో వినిపిస్తున్న‌ట్టు క‌థ‌నం! ముందుగా, సిట్ దృష్టి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కుమారుడు మ‌నోహ‌ర్ నాయుడుపై ప‌డ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈయ‌న‌తోపాటు అన‌కాప‌ల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే పి. గోవింద్ పై కూడా సిట్ కి భారీ ఎత్తున ఫిర్యాదులు అందుతున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో ఈయ‌న ఓ సీనియ‌ర్ నేత‌కు బినామీగా ఉండేవారనీ, భూదందాల‌కు సంబంధించి చాలా ఆరోప‌ణ‌లే గ‌తంలోనూ ఉన్నాయ‌నీ, విశాఖ దందాల్లో ఆయ‌న‌కీ భాగ‌స్వామ్యం ఉంద‌నే ఆరోప‌ణ‌లు సిట్ ముందుకు వ‌స్తున్నాయ‌ట‌. ధ‌ర్మాన త‌న‌యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోవింద్ పై ముందుగా చ‌ర్య‌లు ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు, మ‌రో మంత్రి గంటా వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకుని గ‌తంలో ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 19 మ‌రిన్ని ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తా అంటూ అన్న‌య్య ప్ర‌క‌టించారు. అయితే, భూదందాతో త‌న‌కేం సంబంధం లేద‌న్న ధీమాతో గంటా ఉన్నారు. ఏదేమైనా, ఈ దందా వెలుగు చూసింది గంటా నియోజ‌క వ‌ర్గంలోనే కాబ‌ట్టి… సిట్ ముందుకు వ‌చ్చే ఆధారాల సాయంతో ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కూడా టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. భూదందా వ్య‌వ‌హారంలో నిజం నిగ్గు తేలితే సొంత పార్టీ వారైనా ఉపేక్షించ‌బోమ‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముందుగా మాజీ ఎమ్మెల్యేల బండారం త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డే ఛాన్సులు ఉన్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, విశాఖ భూకుంభ‌కోణంపై ఏర్పాటు చేసిన సిట్‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో హీట్‌ను పెంచుతోంద‌ని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com