ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరో భారీ విజయం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు వోల్వో సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఈ ప్రతిపాదిత భారీ తయారీ కేంద్రం కోసం వోల్వో గ్రూప్ సుమారు 250 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఈ ప్లాంట్ ద్వారా వాణిజ్య వాహనాలు , వాటికి సంబంధించిన అధునాతన విడిభాగాల తయారీని చేపట్టాలని వోల్వో యోచిస్తోంది. ఇందుకు అవసరమైన భూమి కేటాయింపులు, సింగిల్ విండో అనుమతులు, మౌలిక వసతుల కల్పనపై ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విభాగం అత్యంత వేగంగా కసరత్తు చేస్తోంది.
ఇటీవలే ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీలోని తడలో రూ. 2,500 కోట్ల పెట్టుబడితో సరికొత్త ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని వెనువెంటనే గ్లోబల్ బ్రాండ్ అయిన వోల్వో కూడా ఏపీ వైపు అడుగులు వేస్తోంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్లో వేగంగా విస్తరిస్తున్న ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి మరో మైలురాయిగా నిలవనుంది.
ఈ భారీ ప్లాంట్ గనుక ఏపీకి వస్తే రాష్ట్రంలో వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, గ్లోబల్ బ్రాండ్స్ ఏపీకి తరలిరావడం వల్ల మరిన్ని అనుబంధ పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విజన్ 2029 పారిశ్రామిక ప్రణాళికలకు వోల్వో ఎంట్రీ మరింత బూస్ట్ ఇవ్వనుంది.
