సీబీఐ చ‌ర్య‌ల్నీ దిగ్విజ‌య్ స్వాగ‌తిస్తున్నారే..!

కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజ‌య్ సింగ్ వ‌రుస‌గా ఇబ్బందుల్లో కూరుకుపోతున్న‌ట్టున్నారు. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ పోలీసుల‌కూ ఐసిస్ ఉగ్ర‌వాదుల‌కు లింక్ పెట్టి వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కామెంట్ పై వెన‌క్కి త‌గ్గేది లేద‌నీ, త‌న ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయని డిగ్గీరాజా చెబుతున్నారు. ష‌బ్బీర్ అలీ లాంటి కొంత‌మంది నేత‌లు కూడా డిగ్గీరాజాకు వ‌త్తాసు ప‌లుకుతున్నారు. దిగ్విజ‌య్ వ్యాఖ్య‌ల‌పై కేసు న‌మోదు కావ‌డం, ఇంకోప‌క్క పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టేయ‌డం కూడా జ‌రిగిపోయింది. ఇదిలా ఉంటే… గ‌తంలో ఎప్పుడో చేసిన కామెంట్ల‌కు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి డిగ్గీరాజాకి ఎదురుకాబోతోంది. సీబీఐ తాజాగా ఆయ‌న‌కి ఒక షాక్ ఇచ్చింది!

వ్యాప‌మ్ స్కామ్‌… ఒక‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన కుంభ‌కోణం. అది వెలుగు చూసిన సంద‌ర్భంలో అప్పుడు కూడా దిగ్విజ‌య్ ఇలానే కొన్ని దూకుడు వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కు వ్య‌తిరేకంగా కొన్ని కామెంట్లు చేశారు. ఆ అస‌త్య కామెంట్ల‌పైనే ఇప్పుడు చ‌ర్య‌లు ఎదుర్కోనున్నారు. వ్యాప‌మ్ కుంభ కోణంలో సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పాత్ర ఉందంటూ తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు చేశారు దిగ్విజ‌య్‌. ఈ కామెంట్స్ పెద్ద దుమార‌మే లేపాయి. దీంతో శివరాజ్ సింగ్ స‌ర్కారు కోర్టును ఆశ్ర‌యించారు. దిగ్విజ‌య్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్యాప్తు చేసింది. వ్యాప‌మ్ కు సంబంధించిన ప‌త్రాల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపింది. అయితే, ఆ డాక్యుమెంట్లు ఎలాంటి టాంప‌రింగ్ కూ గురి కాలేద‌ని హైద‌రాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది. దీంతో దిగ్విజ‌య్ పై చ‌ర్య‌ల‌కు సీబీఐ సిద్ధ‌మైందని స‌మాచారం.

త‌న‌పై చ‌ర్య‌లు సీబీఐ చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్టు వార్త‌లు రాగానే దీన్ని కూడా దిగ్విజ‌య్ స్వాగ‌తించారు. అదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ… త‌న పోరాటం ఆగ‌ద‌ని అన్నారు. ఇంకోప్క‌, తెలంగాణ పోలీసులుపై చేసిన కామెంట్ల‌పై కూడా ద‌ర్యాప్తు మొద‌లైపోయింది. ఇది కూడా స్వాగ‌తించ‌ద‌గ్గ‌దే అని చెప్పారు. ఆయ‌న ద‌గ్గ‌ర ఏ ఆధారాలు ఉన్నాయో ఏమో ఇంకా బ‌య‌ట‌పెట్టలేదు. వ్యాప‌మ్ స్కామ్ నేప‌థ్యంలో దిగ్విజ‌య్ చేసిన కామెంట్లు నిజం కాద‌ని తేలింది క‌దా. అదే రీతిలో తెలంగాణ పోలీసులు న‌మోదు చేసిన కేసు విష‌యంలోనూ జ‌రుగుతుందా అనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఇంత‌కీ, దిగ్విజ‌య్ ద‌గ్గ‌ర నిజంగానే ఆధారాలున్నాయా..? అవేవో తొంద‌ర‌గా బ‌య‌ట‌పెడితేనే మంచిది. లేదంటే, ఇది కూడా వ్యాప‌మ్ వ్య‌వ‌హారంగా మారితే మ‌రో త‌ల‌నొప్పి కోరి తెచ్చుకున్న‌ట్టు అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.