ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆంధ్ర‌జ్యోతి వార్ మొద‌లైంది..!

గ‌త కొద్దిరోజులుగా మీడియాపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ దుమ్మెత్తిపోస్తున్న సంగ‌తి తెలిసిందే. ట్విట‌ర్ వేదిక‌గా అదే ప‌ని పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని ఛానెల్స్ తోపాటు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిని కూడా ఆయ‌న టార్గెట్ చేసుకున్నారు. ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కూడా చాలా ఆరోప‌ణ‌లు చేశారు. ఎద్దేవా పూర్వ‌కంగా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, త‌ననూ త‌న సంస్థ‌నూ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే ట్విట్ట‌ర్ నుంచి తొల‌గించాల‌నీ, బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నీ, లేని ప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్తాన‌ని కూడా హెచ్చ‌రించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ, ఈ మేర‌కు లీగ‌ల్ నోటీసులు కూడా ప‌వ‌న్ కి ఆయ‌న పంపించారు. త‌న వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ లోపాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే విచ్చ‌ల‌విడిగా ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్నార‌నీ, ఆ వ్యాఖ్య‌ల్లో వాస్త‌వాలు లేవ‌నీ, అన్నీ ఊహాజ‌నితాలే అని అన్నారు. మీడియాపై చుల‌క‌న‌గా వ్యాఖ్యానాలు చేయ‌డం ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కుల‌కు అల‌వాటైపోయింద‌న్నారు. ప‌వ‌న్ ట్వీట్లు వారి అభిమానుల్లో అస‌హ‌నానికి కార‌ణమౌతున్నాయ‌నీ, దీంతో అభిమానులు త‌మ రిపోర్ట‌ర్ల‌పైనా, త‌మ వాహ‌నాల‌పైనా దాడి చేశార‌ని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్ర‌జ్యోతిపై ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌లకు ఆధారాలు లేనివ‌నీ, ఆయ‌న‌తోపాటు కొంత‌మంది క‌లిసి చేస్తున్న కుట్ర‌లో భాగమే ఈ దాడులు అంటూ ఆర్కే ఆరోపించారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ట్విట‌ర్ లో వ్యాఖ్య‌లు తొల‌గించ‌క‌పోతే తాను వేయబోయే సివిల్‌, క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావాను ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి…? త‌న త‌ల్లిని శ్రీ‌రెడ్డి దుర్భాష‌లాడుతుంటే ప్ర‌సారం చేశార‌ని మీడియాపై ప‌వన్ మండిప‌డ్డారు. కానీ, మీడియా ప్ర‌సారం చేసిన క‌థ‌నాల్లో బీప్ సౌండ్లు వేశాక‌నే ఆ ఆరోప‌ణ‌లు ప్ర‌సార‌మ‌య్యాయ‌ని జ‌ర్న‌లిస్టుల సంఘం ఆ ప్ర‌సార ఫుటేజీల‌ను ప‌రిశీలించి మ‌రీ తేల్చింది. ఇప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా… ఎలాంటి బీప్ సౌండ్లు లేకుండా కొన్ని సంస్థ‌ల‌పైనా, మీడియా ప్ర‌ముఖుల‌పైనా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప‌వ‌న్‌ రాసేశారు. మీడియా బీప్ సౌండ్ వేసి ప్ర‌సారం చేస్తేనే త‌ప్ప‌న్నారు… ఎలాంటి సెన్సార్ లేకుండా ప‌వ‌న్ రాసిన రాత‌ల‌ను ఏమ‌నాలి..? మొత్తానికి, వీరావేశంలో ట్వీట్లు పెడుతూ, కావాల్సిన‌న్ని ఆధారాల‌ను ఆయ‌నే సొంతంగా అందిస్తున్న‌ట్టుగా ఉంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com