తెలంగాణ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. చారిత్రక నగరం వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌లో విమానశ్రయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరో మూడు నెలల్లోనే వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగనున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఉత్తర తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటమే కాకుండా, పారిశ్రామికంగా కూడా ఆ ప్రాంతం ఎంతో వృద్ధి చెందే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో కూడా కేంద్రం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ విమానాశ్రయం వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నందున, రక్షణ శాఖ , పౌర విమానయాన శాఖ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయనున్నాయి. దీనికోసం సుమారు 360 ఎకరాల రక్షణ శాఖ భూమి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 450 ఎకరాల భూమి అవసరమవుతాయి. రక్షణ శాఖ వ్యూహాత్మక జోన్‌ను నిర్మిస్తుండగా, పౌర విమానయాన శాఖ ప్రయాణికుల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను అభివృద్ధి చేయనుంది.
ప్రాజెక్ట్ పురోగతిలో భాగంగా అత్యంత కీలకమైన అబ్స్టాకల్ లిమిటేషన్ సర్ఫేస్ సర్వేను ఈ నెల ఏప్రిల్ 17ననిర్వహించనున్నారు. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే కట్టడాలు, చెట్లు లేదా ఇతర అవరోధాలను గుర్తించడానికి ఈ సర్వే ఎంతో కీలకం. ఈ సర్వే నివేదిక ఆధారంగానే విమానాశ్రయ మాస్టర్ ప్లాన్‌ను తుది రూపు ఇస్తారు. దీనివల్ల రన్‌వే విస్తరణ , భద్రతా ప్రమాణాలపై పూర్తి స్పష్టత రానుంది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, తెలంగాణలోని టైర్-2 నగరాలకు విమాన సౌకర్యం కల్పించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం ఇప్పుడు కార్యాచరణ రూపం దాల్చుతోంది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పర్యాటక రంగం, ఐటీ విస్తరణ , వాణిజ్య కార్యకలాపాలు సరికొత్త పుంతలు తొక్కడం ఖాయం.


