పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి పెను మార్పు సంభవించబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ఈసారి బీజేపీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
భారీ పోలింగ్.. మార్పుకు సంకేతమా?
బెంగాల్లో ఈసారి రికార్డు స్థాయిలో 93 శాతం వరకు పోలింగ్ నమోదు కావడం అయింది. సాధారణంగా బెంగాల్లో భారీ పోలింగ్ అధికార పక్షానికి అనుకూలమని భావిస్తారు, కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యేలా ఉందని పలు సర్వే సంస్థలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ 150 నుండి 170 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని, తద్వారా బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈ సంస్థలు జోస్యం చెప్పాయి. అదే జరిగితే, బీజేపీ జాతీయ రాజకీయాల్లో మరో మెట్టు ఎక్కడం ఖాయం.
దీదీ విమర్శలు.. నమ్మకం కోల్పోయారా?
రెండో దశ పోలింగ్ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల నిర్వహణపై, ముఖ్యంగా కేంద్ర బలగాల మోహరింపుపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.. పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు, అంతా సీఆర్పీఎఫ్ మయమైంది అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమెలో ఓటమి భయం మొదలైందనే ప్రచారానికి ఆజ్యం పోసింది. దీదీ కేడర్లో కూడా ఈసారి మునుపటి ఉత్సాహం కనిపించడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతమవ్వడం తృణమూల్ కాంగ్రెస్కు ప్రతిబంధకంగా మారిందని భావిస్తున్నారు.
బీజేపీ వర్సెస్ టీఎంసీ: నువ్వా-నేనా?
అన్ని సర్వేలు బీజేపీకే పట్టం కట్టడం లేదు. కొన్ని సంస్థలు దీదీకి ఇంకా తిరుగులేదని, టీఎంసీ 178 నుండి 187 స్థానాలతో క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేయడం వేస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు , సంక్షేమ పథకాల లబ్ధిదారులు మమత వైపు ఉన్నారని ఈ సంస్థలు నమ్ముతున్నాయి. ఈ భిన్నమైన అంచనాలు బెంగాల్ ఓటరు నాడిని పట్టుకోవడం ఎంత కష్టమో మరోసారి నిరూపించాయి. దక్షిణ బెంగాల్లో టీఎంసీ పట్టు కోల్పోతే మాత్రం అధికారం బీజేపీ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని స్పష్టమవుతోంది.
మే 4న వెలువడే ఫలితాలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమై బీజేపీ అధికారంలోకి వస్తే, అది భారత రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా మారుతుంది.
