ఆ విశాఖ నేతలకు చంద్రబాబు ఏ సందేశం పంపుతున్నారు..?

విశాఖపట్నం జిల్లాలో.. తెలుగుదేశం పార్టీకి వింత పరిస్థితి ఉంది. ఓ వైపు… ఖాళీగా ఉన్న కీలక నేతలకు… అటు వైసీపీ, ఇటు జనసేన ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపుతున్నా.. ఆ ముగ్గురు నేతలు మాత్రం.. టీడీపీ పైనే గురి పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఆ పిలుపేదో త్వరగా వస్తే.. కార్యాచరణ ప్రారంభించుకుంటామని ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారో మాత్రం వాళ్లకి క్లారిటీ రావడం లేదు.

విశాఖ జిల్లాలో దిగ్గజాలనదగ్గ నేతలు కొణాతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, సబ్బం హరి. కొణతాల, సబ్బం కాంగ్రెస్ పార్టీ నుంచి… వైఎస్ నాయకత్వంలో ఎదిగారు. కానీ.. వైఎస్ మరణం తర్వాత వారికి… జగన్ తో పొసగలేదు. సబ్బం అసలు పార్టీలోనే చేరకపోగా.. కొణతాల మాత్రం పార్టీలో చేరి… తట్టుకోలేక బయటకు వచ్చేశారు. ఇక దాడి వీరభద్రరావుకు మొదటి నుంచి టీడీపీ రక్తం. కానీ గత ఎన్నికలకు ముందు… తన ఎమ్మెల్సీ సీటు పొడిగింపునివ్వలేదన్న కారణం చూపి.. చంచల్ గూడ జైలుకెళ్లి జగన్‌తో ములాఖత్ అయి.. పొలిటికల్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత జగన్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు వీరు ముగ్గురూ టీడీపీలో చేరాలనుకుంటున్నారు. ఈ మేరకు టీడీపీ అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. దాడి వీరభద్రరావు అయితే.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఎప్పుడు చంద్రబాబు నుంచి పిలుపు వస్తే అప్పుడు చేరుదామనుకుంటున్నారు. ఇక సబ్బం హరి అయితే.. టీడీపీని… ఆ పార్టీ నేతలు కూడా సమర్థించనంతగా… టీవీ చానళ్లలో సమర్థిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు నుంచి భరోసా లభించిందని చెబుతున్నారు. ఇక కొణతాల రామకృష్ణ కూడా.. టీడీపీ వైపే ఉన్నారు. కొద్ది రోజులుగా.. చంద్రబాబు ఉత్తరాంధ్రకు మేలు చేస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారు.

అయితే చంద్రబాబు వీరిని పార్టీలో చేర్చుకోవడానికి కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఆగర్భ శత్రువులు. అలాగే… వీరు ముగ్గరూ వస్తే.. ప్రస్తుతం పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు ఇబ్బంది పడతారు. అందుకే తరచూ.. గంటా, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్లు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీరందర్నీ సమన్వయం చేసి.. చంద్రబాబు వారిని పార్టీలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే… కొణతాల, దాడి, సబ్బంలు పార్టీలోకి వస్తే చేర్చుకుని కోరుకున్న సీటు ఇవ్వడానికి.. వైసీపీ, జనసేనలు రెడీగా ఉన్నాయి. రాయబారాలు కూడా పంపుతున్నారు. కానీ వాళ్లు మాత్రం.. టీడీపీ వైపే చూస్తున్నారు. వంద స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తానని చెబుతున్న చంద్రబాబు..ఈ నేతల విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో మరి…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.