పొత్తు దగ్గరకి వ‌చ్చేస‌రికే ‘ఎన్టీఆర్ ఆత్మ’ గుర్తొస్తోందా..?

‘తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మ ఘోషిస్తోంది’… ఈ మ‌ధ్య వైకాపా, భాజ‌పా, తెరాస నేత‌లు కొంత‌మంది ఇదే అంశాన్ని ప్రస్థావిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిన్న‌నే… భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో ప‌ర్య‌టించిన భాజ‌పా నాయ‌కురాలు, మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి ఇదే మాట‌న్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు పొత్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల దివంగ‌త ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంద‌ని ఆమె అన్నారు. భావ‌సారూప్యం లేని పార్టీల మ‌ధ్య పొత్తు ఎలా కొన‌సాగుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఓ నాలుగు రోజుల కింద‌ట కూక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో మంత్రి కేటీఆర్ కూడా ఇదే టాపిక్ తెచ్చారు. కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో క‌లపాలంటూ టీడీపీని ఎన్టీఆర్ స్థాపించార‌నీ, కానీ తెలుగుదేశాన్ని కాంగ్రెస్ కి తోక పార్టీ చేసేశార‌ని విమ‌ర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ… రాహుల్ కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ తో దోస్తీ చేసిన చంద్రబాబుకి, ఎన్టీఆర్ పేరెత్తే అర్హ‌త లేద‌న్నారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌కు ముసుగులు వేసెయ్యాల‌న్నారు. ఇక‌, ల‌క్ష్మీ పార్వ‌తి విష‌య‌మైతే చెప్పాల్సిన ప‌నేలేదు. ఎన్టీఆర్ ఆత్మ ఘోషించేలా పార్టీ సిద్దాంతాల‌ను కాంగ్రెస్ కి చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టేశార‌ని ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర ఆమె నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా కొద్దిరోజుల కింద‌ట ఓ ట్వీట్ చేస్తూ…. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపిస్తే… కుటిల రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం 2018లో తెలుగుదేశాన్ని చంద్ర‌బాబు నాయుడు భూస్థాపితం చేశార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, వైకాపా నేత‌ల విమ‌ర్శ‌ల్లోనూ ‘ఎన్టీఆర్ ఆత్మ‌క్షోభ‌’ అనేది బాగానే వినిపిస్తున్న సంగ‌తీ తెలిసిందే.

గ‌డ‌చిన కొద్దిరోజులుగా… ‘తెలుగువారి ఆత్మ గౌర‌వం దెబ్బ‌తింద‌ని.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది’ అనే అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకుని టీడీపీ-కాంగ్రెస్ ల పొత్తుపై ఇత‌ర పార్టీల ప్ర‌ముఖులంతా బాగానే విమ‌ర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీల మ‌ధ్య స్నేహాన్ని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలుస్తాయి. ఆ విష‌యం కాసేపు ప‌క్క‌నపెడితే… కేవ‌లం టీడీపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య పొత్తు అంశం తెర‌మీదికి వ‌చ్చేసరికే.. ఈ నాయకులంద‌రికీ ఆత్మ‌గౌర‌వం, ఎన్టీఆర్ ఆత్మ‌క్షోభ గుర్తొచ్చేశాయే! మ‌రి, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం తీవ్రంగా దెబ్బ‌తీస్తుంటే… అది ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్యగా వీరికి క‌నిపించ‌లేదా..? ఆ అంశంలో కూడా ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంద‌ని వీరికి అనిపించ‌లేదా..? కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవ‌లం టీడీపీకి సంబంధించిన ఒక రాజ‌కీయ అంశం మాత్రమే. కానీ, ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీలు, కేంద్ర కేటాయింపులు… ఇవ‌న్నీ సువిశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాంశాలు కాదా..? విభ‌జ‌న త‌రువాత రాష్ట్రాన్ని భాజ‌పా దెబ్బ‌తీస్తుంటే… అది ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య కాదా..?

ఆరోజు.. అంటే, టీడీపీ వ్య‌వ‌స్థాప‌న జ‌రిగిన రోజున కేంద్రంలోని అధికార పార్టీ తెలుగువారి ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసింది. అప్పుడు తెలుగువారి ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింది. ఈరోజున విభజిత రాష్ట్రానికి కేంద్రం సాయం చేయ‌డం లేదు. ఇదెందుకు ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య‌గా ఈ సో కాల్డ్ విమర్శలు చేస్తున్న నాయ‌కుల‌కు అనిపించ‌డం లేదు..? విమ‌ర్శ‌లు చేయ‌డంలో ప్ర‌ద‌ర్శిస్తున్నఈ భావ‌సారూప్య‌త‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేయ‌డంలో ఎందుకు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com