టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… కాంగ్రెస్సేతర, బీజేపీయేర పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ రోజు విశాఖ వెళ్తున్నారు. తర్వాత బెంగాల‌్ వెళ్తారు. కొంత మంది ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో …కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు.. అటు కాంగ్రెస్ తోనో.. ఇటు బీజేపీతోనో ఉంటున్నాయి కానీ… సొంతంగా కూటమి కట్టే ప్రయత్నం చేయలేదు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తూంటే ఎందుకు మాట్లాడలేదు..?

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఢిల్లీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తానమంటున్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి… ఢిల్లీని శాసిస్తామంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఫెడరల్ ఫ్రంట్ విషయంలో… ఫెడరల్ భావజాలన్ని వ్యక్తం చేసిన పార్టీ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా లేదు. కేంద్రంపై పోరాడి… తమ హక్కులు సాధించుకునేదుకు.. ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత వరకూ.. గట్టి విధానాన్ని ప్రకటించలేదు. ఇలాంటి విధానాన్ని ప్రకటించి ఉంటే.. ఈ ఫ్రంట్‌కు ఒక రాజకీయ ప్రాధాన్యత ఉండేది. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన అనేక నిర్ణయాలకు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఉదాహరణకు.. జీఎస్టీ. ఇది పూర్తిగా.. రాష్ట్రాల హక్కులను హరించే నిర్ణయం. ఈ జీఎస్టీ కారణంగా.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రంలో.. ఎలాంటి పన్నులు విధించలేరు. పన్నులు విధించడం పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి పోయింది. పన్నులు విధించడం అనేది ఆయా రాష్ట్రాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కేరళలో కొబ్బరి పంట ఎక్కువ కాబట్టి.. అక్కడి రైతులకు ప్రొత్సాహం కల్పించడానికి.. వినియోగం పెంచడానికి… కొబ్బరి ఉత్పత్తులకు పన్ను తగ్గించాలనుకోవచ్చు. అయితే..జీఎస్టీలో ఈ అవకాశం లేదు. ఏ పన్ను నిర్ణయం అయినా జీఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు.. తమ తమ రాష్ట్రాల్లో ఉండే.. గ్రానైట్ పరిశ్రమపై పన్ను తక్కువగా ఉండాలని… కోరాయి. కానీ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించడం లేదు. అంటే.. తమ నిర్ణయాధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టి.. ఇప్పుడు… ఇబ్బంది పడుతున్నాయి. అయినప్పటికీ.. ఈ జీఎస్టీకి… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంంపూర్ణంగా మద్దతు పలికాయి.

పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాలపై కేసీఆర్ ఎందుకు పోరాడలేదు..?

పదిహేనో అర్థిక సంఘం విషయంలో… ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. కొత్తగా..నియమించిన ఆర్థిక సంఘం సిఫార్సుల్లోనే తేడా ఉంది. నూతన భారతదేశ నిర్మాణ బాధ్యత కేంద్రంపై ఉంది కాబట్టి… దాన్ని దృష్టిలో పెట్టుకుని పన్నుల ఆదాయం పంపిణీ చేయండి..అని ఆర్థిక సంఘానికి కేంద్రం చేసిన విధివిధానాల్లో ఉంది. అంటే అర్థం ఏమిటి..? కేంద్రానికి అనుకూలంగా.. సిఫార్సులు ఉండేలా చూడమని..నేరుగా చెప్పినట్లే. అయినా దీనిపై ప్రాంతీయ పార్టీలు.. టీఆర్ఎస్ కానీ.. బీజేడీ కానీ నోరు మెదపలేదు. చివరికి దక్షిణాది రాష్ట్రాలకు … ఆర్థిక సంఘానికి చెసిన విధివిధానాల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని తేలిపిన తర్వాత.. ఆయా రాష్ట్రాలన్నీ పోరుబాట పట్టాయి. ప్రత్యేకంగా సమావేశాల్ని పెట్టుకుని.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. అయినా.. దక్షిణాదిలో భాగంగా ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ ఆ సమావేశాల్లో పాల్గొనలేదు. మరి టీఆర్ఎస్ ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉంటుంది..?

రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం లాక్కుంటున్నా ఎందుకు మాట్లాడలేదు..?

కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఈ పథకాలన్నీ రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందే. ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల్లో.. కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రభుత్వాలు కూడా వాటా భరించాల్సిందే. ఇయితే.. గతంలో కేంద్రం వాటా 70 శాతం.. రాష్ట్రాల వాటా 30 శాతం ఉండేది. కానీ రాను రాను.. దీన్ని కేంద్రం తగ్గిస్తూ పోతోంది. ఇంకా తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రయత్నాలను… ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకుంటున్న కేసీఆర్ కానీ… ఢిల్లీ పెత్తనాన్ని ఎదిరిస్తామంటున్న ఇతర పార్టీలు కానీ.. ఎప్పుడూ ప్రశ్నించలేదు. పెట్రోల ఉత్పత్తులు జీఎస్టీలు లేవు. జీఎస్టీలో లేకపోవడంలో… కేంద్ర, రాష్ట్రాలు పన్నులేయవచ్చు. కేంద్రం ఇత్యధిక పన్నులు వేసింది. అంతేకాదు.. సెస్ వేస్తోంది. సెస్ లు వేయడం వల్ల రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పని లేదు. దీనిపైనా .. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలు ఎక్కడైనా ప్రశ్నించాయా..?. ఇలా.. రాష్ట్రాల ప్రయోజానాలు హరించేటప్పుడు.. సైలెంట్‌గా ఉండి… ఇప్పుడు.. సమాఖ్య స్ఫూర్తి అంటూ.. రాజకీయం చేస్తే.. అది రాజకీయ అవసరాలకే తప్ప.. నిజంగా ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తి కోస కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.