తెలంగాణ‌లో భాజ‌పా స్టార్ కేంపెయిన‌ర్ ఎవ‌రు?

ఆప‌రేష‌న్ సెవెన్ స్టేట్స్ గురించి వినే ఉంటారు! అదేనండీ భారతీయ జనతా పార్టీ ఆప‌రేష‌న్ ఇది! బెంగాల్ నుంచీ త‌మిళ‌నాడు వ‌ర‌కూ అన్ని రాష్ట్రాలనూ కాషాయ‌మ‌యం చేయాల‌న్న‌ది ఆ పార్టీ ల‌క్ష్యంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. మిగ‌తా రాష్ట్రాల విష‌యంలో కాస్తోకూస్తో వ్యూహాత్మ‌కంగానే భాజ‌పా ముందుకు వెళ్ల‌గ‌లుగుతోంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితే… అర్థం కాన‌ట్టుగా మారింది. ఆంధ్రాలో భాజ‌పా సోలోగా ఎదిగే ఛాన్స్ లేదు. అందుకు, చంద్ర‌బాబు అడ్డంకి అని తెలిసినా… కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు అభ‌య‌హ‌స్తం ఆయ‌న‌కు ఉంది కాబ‌ట్టి, ఎవ్వ‌రూ నోరెత్త‌లేని ప‌రిస్థితి. తెలంగాణ విష‌యానికొస్తే… భాజ‌పాకి స‌రైన నాయ‌కుడు కావాల్సిన త‌రుణ‌మిది. మోడీ హ‌వా ఎంతున్నా కూడా రాష్ట్ర స్థాయిలో కొంత‌మంది కీల‌క నేత‌లు కావాలి క‌దా! లోక‌ల్ ఫేస్ ఒక‌టి ఉండాలి క‌దా.

అందుకే, భాజపా చూపు రేవంత్ రెడ్డిపై ఉందంటూ ఆ మ‌ధ్య కొన్ని క‌థ‌నాలు వినిపించాయి. ఇప్ప‌టికీ రేవంతుడితో భాజ‌పా కీల‌క నేత‌లు కొంత‌మంది టచ్ లో ఉన్న‌ట్టు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇది నిజం కాద‌ని ఆయ‌న ఖండించ లేక‌పోవ‌డం ఇక్కడ గ‌మ‌నార్హం. రేవంత్ రెడ్డికి వ్య‌క్తిగ‌తంగా మంచి క‌రిజ్మా ఉంది. మాంచి మాట‌కారి. పైగా టీడీపీలో ఏక్ నిరంజ‌న్ గా కాలం వెళ్ల‌దీస్తున్నారు. సో.. ఆయ‌న్ని ఆక‌ర్షించ‌గ‌లిగితే భాజ‌పాకి మేలే. ఇంకోప‌క్క‌.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా కాషాయం కండువా వైపు చూస్తున్న‌ట్టు కూడా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దీన్లో నిజం ఎంతో తెలీదుగానీ.. వీరితో కూడా భాజ‌పా నేత‌లు ట‌చ్ లో ఉన్నార‌ట‌.

వీళ్ల‌ను చేర్చుకోవ‌డ‌మో లేదా వ‌ద్ద‌నుకోవ‌డ‌మో అనేది ఏదీ భాజ‌పా తేల్చులేక‌పోతోందట‌. తెలంగాణ విష‌యంలో ఢిల్లీలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. రేవంత్ లాంటి స్టార్ కేంపెయిన‌ర్ తెలంగాణ‌లో పార్టీకి అవ‌స‌రం. కానీ, ఇప్ప‌టికే పార్టీలో ఉన్న నాగం జ‌నార్థ‌న్ రెడ్డిలాంటి వారి ప‌రిస్థితేంటీ..? రాష్ట్రంలో ఉన్న కొంత‌మంది భాజ‌పా నేత‌లు కాస్త అసంతృప్తితోనే ఉంటున్నారు. వారితో మంత‌నాలు జ‌రిపి, అసంతృప్తుల‌ను త‌గ్గించే చ‌ర్య‌లేవీ అధిష్టానం చేప‌ట్ట‌డం లేదు.

రేవంత్ ను చేర్చుకుంటే టీడీపీతో త‌క‌రారు ఖాయం! సో.. ఆ విష‌యంలో ఎటూ తేల్చులేక‌పోతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే, కోమ‌డిరెడ్డి సోద‌రులు వంటి కాంగ్రెస్ లీడ‌ర్ల‌ను చేర్చుకుంటే… తెలంగాణ‌లో ఇప్ప‌టికే భాజ‌పా నేత‌ల‌తో ఇబ్బందులు త‌లెత్తొచ్చు. అలాగ‌ని, భాజ‌పాకి తెలంగాణ‌లో ఒక బ‌ల‌మైన, జ‌నాక‌ర్ష‌క నాయ‌కుడి అవ‌స‌రం క‌చ్చితంగా ఉంది. ఉన్న అవ‌స‌రాన్ని తీర్చుకునేందుగానీ… ఉన్న స‌మ‌స్య‌ల్ని చ‌క్క‌బెట్టుకునేందుకుగానీ భాజ‌పా చొర‌వ‌గా ముందుకు వెళ్ల‌లేక‌పోతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. మ‌రి, ఈ ట్విస్టులు ఎలా వీడుతాయో.. అమిత్ షా వ్యూహం ఏంటో ఇంకా తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.