తుని ఘటనకు కారణం జగనా – చంద్రబాబా?

హైదరాబాద్: నిన్న తునిలో జరిగిన విధ్వంసంలో ప్రాణనష్టం జరగకపోయినా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించింది. ప్రయాణీకులను, అనేక వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టింది… స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీనికి కారణం మీరంటే మీరంటూ ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీయే దీని వెనక ఉందని ప్రభుత్వ పెద్దలూ, ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. అయితే నిఘా వైఫల్యమే అసలు కారణమని ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి.

వాస్తవానికి తునిలో ముద్రగడ ఇలాంటి ఆకస్మిక నిర్ణయం తీసుకుంటారని ఆ సభకు హాజరైన సీనియర్ కాపు రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ, కన్నాలక్ష్మీనారాయణ, పళ్ళంరాజు, సి.రామచంద్రయ్యలతో సహా ఎవ్వరికీ తెలియదు. చివరివరకు తన నిర్ణయాన్ని రహస్యంగా ఉంచిన ముద్రగడ ఒక్కసారిగా ఆ నిర్ణయాన్ని ప్రకటించి సభావేదికపైనున్నవారిని, సభకు హాజరైనవారివరకు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు క్షమాపణ కోరి, వేదికపైనుంచి దిగి రోడ్డుపైకి వెళ్ళిపోయారు. గుజ్జర్ల ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత – ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చేవరకు ఇళ్ళకు వెళ్ళొద్దని, తాను, తన కుటుంబంకూడా రోడ్లపైనే ఉంటామని ముద్రగడ పిలుపునిచ్చారు. లక్షల సంఖ్యలో హాజరైన కాపు కార్యకర్తలు రోడ్లపై, పక్కనే ఉన్న పట్టాలపై బైఠాయించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆందోళన ఉన్నట్లుండి హింసాత్మక రూపు దాల్చింది. తుని స్టేషన్‌లో ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కొందరు నిప్పుపెట్టారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు… రైల్వే సిబ్బందిని కూడా కొట్టారు. ప్రభుత్వం స్పందించేవరకు ఇళ్ళకు వెళ్ళేది లేదన్న ముద్రగడ, ఆందోళన తప్పుదోవ పట్టిందని అర్థం చేసుకుని రైల్ రోకో విరమించుకున్నారు.

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుబాటులో ఉన్న అధికారులు, మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మీడియా ముందుకొచ్చారు. జగన్ పేరు చెప్పకుండా వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. తుని ఘటనలకు ఒక నేరస్థుడే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో రౌడీ మూకలను తీసుకొచ్చి, పోలీసులను కొట్టి, విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. అతని తండ్రి కూడా అధికారంకోసం హైదరాబాద్‌లో ఇలాంటి పనులే చేశాడంటూ మండిపడ్డారు. రాజకీయం కోసం, పదవులకోసం ఇలాంటి దుర్మార్గాలు చేయాలా, ఇదే మార్గమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు ఇలాంటి పనులు చేయరని, గోదావరి జిల్లాల కాపుల గురించి తనకు బాగా తెలుసని, వారి సౌమ్యులని అన్నారు. కాపు రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కావాలంటే రేపే జీఓ ఇస్తానని, అయితే చెల్లకపోతే ఎవరు బాధ్యులని అడిగారు. మొత్తం మీద బాబు మాటలను చూస్తే జగనే ఇది చేయించాడన్నట్లుగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ముద్రగడ రైల్ రోకో, రోడ్ రోకో నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నది. కాబట్టి కాపు ఆందోళనకారులు దీనిని పక్కాగా ప్లాన్ చేసుకోవటానికి అవకాశమేలేదు. పోలీసులు నిన్న చిత్రీకరించిన వీడియో దృశ్యాలనుబట్టి, కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళికతోనే రైలుకు నిప్పు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దుండగులు పెట్రోల్ క్యాన్లతో వచ్చి సీట్లపై దానిని జల్లి నిప్పు పెట్టారని పోలీసులు చెప్పటాన్నిబట్టి పక్కా ప్రణాళిక వాదనలో వాస్తవం ఉన్నట్లు అర్థమవుతోంది.

అయితే మరోవైపు ప్రభుత్వంపైపు కూడా లోపం స్పష్టంగానే కనబడుతోంది. నిఘాపైఫల్యమే కారణమన్న ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం లేకపోలేదు. దానికితోడు ఇవాళ నార్త్ కోస్టల్ డీజీ విశ్వజిత్ వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఆరోపణను బలపరిచేవిగా ఉన్నాయి. తుని సభకు భారీసంఖ్యలో ఆందోళనకారులు వస్తారని, ఉద్రిక్తత తలెత్తుతుందని అంచనా వేయలేకపోయామని విశ్వజిత్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యవసానాలను అంచనా వేయగలిగేది రాజకీయ నాయకులేగానీ అధికారులు కాదు. తుని సభకు భారీగా జనం హాజరవబోతున్నారని అందరికీ తెలిసిన విషయమే. పదిలక్షలపైనే వస్తారని నిర్వాహకులు చెప్పారు. దానికి తగ్గట్లు వారు ఏర్పాట్లుకూడా చేసుకున్నారు. ఇంత భారీసంఖ్యలో జనం వచ్చేటపుడు దానిలో అల్లరి మూకలు కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ భారీ సభకు తగ్గట్టుగా పోలీసు బలగాలను మోహరించకపోవటం ప్రభుత్వ పరంగా లోపమనే చెప్పాలి. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా ఇదే తప్పు జరిగిన సంగతి తెలిసిందే. నాడు ప్రమాదం జరిగిన తర్వాత ఇంతమంది వస్తారని అంచనా వేయలేకపోయామని అన్నట్లే ఇవాళ విశ్వజిత్ కూడా విచారం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల నేతలు ఈ విషయంలో మరో ఆరోపణ కూడా చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలో ప్రజాదరణ ఉన్న నాయకుడని తెలిసికూడా ఆయన రాసిన లేఖలకు స్పందించటంగానీ, ఆయనను చర్చలకు పిలవటంగానీ చేయకపోవటం చంద్రబాబు తప్పేనంటున్నారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీడియా ముందుకొచ్చి పవిత్రమైన మనిషిలాగా బాబు సూక్తులు వల్లిస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. నాదెళ్ళ భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు, పరిటాల రవి హత్య జరిగినపుడు దగ్గరుండి బస్సులు, రైళ్ళు తగలబెట్టిచ్చిన విషయాన్ని జనం మరిచిపోలేదంటూ గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనా నిన్నటి ఘటనలో ప్రాణనష్టం జరగకపోవటం అదృష్టమనే చెప్పాలి. పరిస్థితి చేజారుతోందని తెలిసి తన పట్టు వీడి రోడ్ రోకో, రైల్ రోకోలను నిలిపేయటంద్వారా ముద్రగడ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అయితే ఇంత భారీసంఖ్యలో వచ్చే జనాన్ని అదుపు చేయలేనప్పుడు ఇలాంటి ఆందోళనలకు పిలుపునివ్వటం ఎంతవరకు సమంజసమో కూడా ఆయన ఆలోచించుకోవాలి. ప్రభుత్వంకూడా తాత్సారం చేయకుండా, మిగిలిన కులాలకు ఇబ్బంది కలగని విధంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close