ప్రొ.నాగేశ్వర్ : తెలంగాణ లోక్‌సభ సీట్లు ఎవరికి ఎన్ని..?

తెలంగాణలో ఇప్పుడు.. మళ్లీ రాజకీయ వేడి పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికలపై.. గెలిచిన వాళ్లు సంబరాలు.. ఓడిన వాళ్లు సమీక్షలు పూర్తి చేసుకోక ముందే.. పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. తామే అత్యధిక స్థానాలు గెలుస్తామంటూ… అటు టీఆర్ఎస్ .. ఇటు కాంగ్రెస్ నేతలు పోటీ పడి ప్రకటనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అయితే.. ఎంఐఎం సీటు మినహా మిగతా చోట్ల అన్నింటిలో విజయం సాధిస్తామంటున్నారు.

అసెంబ్లీ ఓటింగ్ ప్రకారం టీఆర్ఎస్‌కు 14 సీట్లొస్తాయా..?

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఈ లోపు రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో చెప్పలేము. కానీ… అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్లే ఓటింగ్ జరిగితే.. తెలంగాణ రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ ఉంటుంది. అత్యధిక సీట్లు గెలుచుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎం, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో… కాంగ్రెస్ పార్టీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. కాబట్టి… అసెంబ్లీ ఎన్నికల ప్రకారం ఓటింగ్ జరిగితే…. ఈ మూడు సీట్లు మినహా.. మిగిలిన సీట్లన్నింటినీ టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 సీట్లు ఉన్నా.. తెలగాణలో.. పదిహేడు మాత్రం పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో మూడు తప్ప.. 14 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది.

కేసీఆర్ కూడా పార్లమెంట్‌కు పోటీ చేస్తారా..?

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల వారీగా పరిశీలిస్తే.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కలిపి.. ప్రజాకూటమికి 50 వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. మహబూబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో.. ప్రజాకూటమి అభ్యర్థులకు అంతా కలిపి… ఓ పది వేల మెజార్టీ వచ్చి ఉంటుది. కానీ.. మిగతా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో.. టీఆర్ఎస్‌ కు లక్ష నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ కనిపించింది. మహబూబ్‌నగర్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనూ ఇలానే ఉంది. అందుకే టీఆర్ఎస్‌ తాము పదిహేను సీట్లు గెలుచుకుంటామని.. పదహారో సీటును కూడా తమ ఖాతాలో వేసుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఏం జరిగినా.. తమ ఓటింగ్ ఇంత కంటే తగ్గదని టీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి.. మెదక్ సహా నల్లగొండ నియోజకవర్గాలన్నీ సేఫ్ సీట్లే.

ఓటర్లంతా గతంలో ఓటేసిన వాళ్లకు ఓటేస్తారన్న గ్యారంటీ ఉందా..?

అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్లంతా… పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేస్తారా.. అంటే… చెప్పడం కష్టం. జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా… 77 శాతం ఓటర్లు మాత్రమే ఒకే పార్టీకి ఓటేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ… 154 స్థానాలు గెలుచుకుంది. అదే లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ బాగా పెరిగింది. ఆ ప్రకారం చూస్తే… 180 కిపైగా సీట్లు రావాలి. అంటే… లోక్ సభకు.. అసెంబ్లీకి ఓట్లు వేసే టప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. 2019ఎన్నికలు వచ్చే సరికి.. ప్రధాని ఎవరు..? అన్న అంశంపై ఓటింగ్ జరుగుతుంది. మోడీని మళ్లీ ప్రధానిని చేయాలా.. వద్దా అన్న అంశంపై ఓటింగ్ జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు జరిగినా… లోక్ సభకు… అసెంబ్లీలకు వేర్వేరు పార్టీలకు ఓట్లు వేసిన ప్రజలు.. ఐదు నెలల గ్యాప్‌తో పోలింగ్ జరిగితే.. గతంలో వేసిన పార్టీకే ఎందుకు వేస్తారు..?. అసలు ఈ భయంతోనే… కేసీఆర్ ముందస్తుకు వెళ్లారనేది.. కాంగ్రెస్ పార్టీ అంచనా. మోడీని ఓడించాలనే నినాదాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే కచ్చితంగా ఓట్లు పెరుగుతాయి. లేదు.. మనం పదిహేను సీట్లు గెల్చుకుంటనే ఢిల్లీలో చక్రం తిప్పగలమనే నినాదాన్ని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.