సీబీఐ మాజీ జేడీని టీడీపీ ఎందుకు ఆహ్వానించడం లేదు..?

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ప్రకటించారు. అయితే వేరే పార్టీల్లో చేరాలా.. లేక సొంత పార్టీ పెట్టుకోవాలా అన్న ఆప్షన్స్ పై తాను ఇంకా పరిశీలన చేస్తున్నానని చెబుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందంటున్నారు. అయితే సీబీఐ మాజీ జేడీని.. తమ పార్టీలోకి ఆహ్వానించడానికి మొదట బీజేపీ చాన్స్ తీసుకుంది. ఆ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఆహ్వానించింది. తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందన్నారు. ఆ ఆపర్లపై తటస్థంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఇంత వరకూ బాగానే ఉన్నా సీబీఐ మాజీ జేడీకి ఉన్న క్లీన్ ఇమేజ్‌ను ఉపయోగించుకునేందుకు పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ ఎందుకు ప్రయత్నించడం లేదన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది. ఆయన ఐపీఎస్ పోస్టుకి స్వచ్చంద పదవి విరమణ చేసినప్పుడు.. అనేక ఊహాగానాలు వచ్చాయి. అందులో టీడీపీ లో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో ఓ సారి.. ఆయన గత ఎన్నికల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని.. లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచన చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ.. ఈ సారి నిజంగా రాజకీయ ప్రవేశం దగ్గరకు వచ్చే సరికి.. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన రావడం లేదు. కొద్ది రోజుల క్రితం.. టిట్లి తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన లక్ష్మినారాయణ తాను గమనించిన అంశాలతో.. ముఖ్యమంత్రికి ఓ వినతి పత్రం అందించారు. ఇక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి తాను రూపొందించిన పీపుల్స్ మ్యానిఫెస్టోను అందించి ఆచరణలో పెట్టాలని.. కోరేందుకు మరోసారి కలిసే అవకాశం ఉంది.

అయినా.. మాజీ జేడీ లక్ష్మినారయణ.. టీడీపీ వైపు చూస్తున్నారని కానీ… టీడీపీ ఆయనను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న… ప్రచారం కూడా జరగడం లేదు. దీనికి కారణమేమిటన్నదానిపై.. టీడీపీ వర్గాల్లో విస్త్రత చర్చ జరుగుతోంది. జగన్ కేసులు విచారణ జరుగుతున్న కారణంగా… ఆ కేసులను విచారించిన అధికారి గా.. లక్ష్మినారాయణ టీడీపీలో చేరితే.. కేసులపై ఆ ప్రభావం ఉంటుందన్న ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందని.. అది మంచి కాదన్న భావనలో ఉన్నారని భావిస్తున్నారు. అదే సమయంలో.. లక్ష్మినారాయణ బీజేపీతో.. ఓ అండర్ స్టాండింగ్‌కు వచ్చే.. తన రాజకీయ పయనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా టీడీపీ అగ్రనేతల్లో ఉన్నాయి. దీంతో తాము పిలిచినా…. మన్నించకపోవచ్చన్న అంచనాల్లో ఉన్నారు. మరి ఇప్పటికైతే టీడీపీ ఎలాంటి ఆహ్వానం పలేదు. ఏదైతే అదయింది.. లక్ష్మినారాయణ లాంటి వ్యక్తి తమ పార్టీలో ఉండాలని టీడీపీ ఆహ్వానిస్తే… మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com