చైతన్య : లేని అధికారాలతో ఏపీపై మోడీ పెత్తనం..! ఇదేనా సమాఖ్య స్ఫూర్తి..!

(This article is part of Telugu360 Contributor Network and hasn't been edited by our team. If you have any questions or want to contribute, reach out to krishna@telugu360.com)

భారత రాజ్యాంగంలో పటిష్టమైన సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐక్యత, సమన్వయం, సర్దుబాటు ఉన్నప్పుడే దేశం ఉన్నతంగా ఉంటుందని రాజ్యాంగం భావించింది. దీనికి అనుగుణంగా స్పష్టమైన విధి, విధానాలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన; శాసన, పరిపాలన, ఆర్థికపరమైన సంబంధాలను స్పష్టంగా నిర్వహించించారు. కానీ.. లేని అధికారాలను.. ఎప్పటికప్పుడు… కొత్త కొత్త భాష్యాలతో నిర్వచించుకుటూ.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని.. కేంద్రం రాష్ట్రాల అధికారాలపై దురాక్రమణ చేస్తోంది. ఫలితంగా.. కేంద్ర, రాష్ట్రాల మధ్య.. ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి.

ఏ రాజ్యాంగ నిబంధనల ప్రకారం మోడీ లెక్కలడుగుతున్నారు..?

కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో రాసుకొన్న మన రాజ్యాంగం, డెబ్బై సంవత్సరాల తర్వాత మోడీ లాంటి రాజకీయ నేతల తీరుతో.. కొత్త ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం ద్వారా తమకు సంక్రమించిన అధికారాలను వాడుకొని, ప్రాంతీయ పార్టీలనూ అవి నడిపే రాష్ట్రాలనూ ఆర్థికంగా, వివిధ వ్యవస్థల ద్వారా దెబ్బ తీయడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపి.. రాజకీయంగా బలపడాలనుకునేతల వల్ల దేశం క్లిష్టపరిస్థితుల్లో పడుతోంది. ఇప్పుడు… నరేంద్రమోడీ లాంటి నేతలు.. సొమ్మేదో తమ జేబుల్లో నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగా.. ఆయా రాష్ట్రాల గడ్డ పై నుంచే లెక్కలు చెప్పాలని హూంకరిస్తున్నారు. కానీ రాజ్యాంగంలో… కేంద్రమే.. లెక్కలు చెప్పాలన్నట్లుగా.. ఉంది. ఎందుకంటే.. కేంద్రానికి ఆదాయం.. రాష్ట్రాల నుంచే వస్తోంది. కేంద్రానికి ఆదాయం కోసం.. పెట్రోలియం, సీజీఎస్టీ వంటి కొన్ని అంశాలు ఉంచారు. అవి కూడా.. రాష్ట్రాల ప్రజల నుంచి వసూలు చేసేవే. కొత్తగా ఏమీ కేంద్రం పుట్టించదు. ఆ సొమ్మును కేంద్రం మళ్లీ రాష్ట్రాలకు పంచాలి. ఎలా పంచాలన్నది.. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడే ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. దీనికి కూడా లేని పోని నిబంధనలు పెట్టి.. ఉత్తరాదికి ఎక్కువ నిధులు వెళ్లేలా చేస్తూ.. దేశంలో.. ఓ విభజన వాదాన్ని తీసుకు వచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మంట గలుపుతున్నారు. రాజ్యాంగంలోని.. ఏ సెక్షన్ కూడా.. కేంద్రానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు చెప్పాలన్న క్లాజ్ లేదు. మరి మోడీ ఏ రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నారు..? ఆయన సొంత రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తారా..?

వ్యవస్థలతో రాష్ట్రాలపై పెత్తనం చేయమని రాజ్యాంగం చెప్పిందా..?

ఒకరాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కేంద్రం చెల్లించకపోతే ఆ రాష్ట్రం ఏంచెయ్యాలి? ఒక రాష్ట్రానికి సహాయంగా, పార్లమెంటు ఆమోదించిన బిల్లులను, తదుపరి వచ్చిన కేంద్ర ప్రభుత్వం పాటించకపోతే, ఆ రాష్ట్రం ఏం చెయ్యాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిదిలోని పలు వ్యాపార సంస్థలపై, అదేపనిగా కేంద్ర ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతుంటే, ఆ రాష్ట్రం ఏమి చెయ్యాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు సంస్థలపై కేంద్రపరిశోధనా సంస్థ ప్రతీకార దాడులకు ప్రణాళిక వేస్తుంటే, ఆ రాష్ట్రం ఏంచెయ్యాలి? రిజర్వ్ బ్యాంకులో వున్న సంస్థాగత నిధులను కూడా కేంద్రం తీసుకోవాలని ప్రణాళికలు వేస్తుంటే, రాష్ట్రాలు ఏమి చెయ్యాలి? రిజర్వ్ బ్యాంక్ ప్రమాదంలో పడితే, అది దేశ ఆర్ధిక సమగ్రతకి భంగకరం కదా? మరి దేశమంటే రాష్ట్రాల సమాహారమే కదా? ఈ విషయంలో రాష్ట్రాలు ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యగలవు?. ఇన్ని ప్రశ్నలు రావడానికి .. వ్యవస్థలన్నీ.. నిర్వీర్యం అవడానికి మోడీ నాలుగున్నరేళ్లలో చేసిన రాజ్యాంగ విధ్వంసం కారణం కాదా..?

లా అండ్ ఆర్డర్‌ను కూడా లాగేసుకునే ప్రయత్నాలా..?

రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాల్లో… కానిస్టేబుల్‌ను కూడా.. బదిలీ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. లా అండ్ ఆర్డర్‌కు సంబంధించి.. పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. కానీ.. ఏపీలో.. ఆ అధికారాన్ని కూడా లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. విశాఖలో జరిగిన కోడికత్తి కేసులో…విమానాశ్రయంలో జరిగిందనే సాకు చూపించి.. ఏకంగా ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించారు. అంటే.. లా అండ్ ఆర్డర్‌ను కూడా లాగేసుకునే మొదటి ప్రయత్నం. దీన్ని అలా వదిలిస్తే.. రేపు… ప్రతీ విషయంలోనూ వేలు పెడతారు. అది సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. కానీ మోడీ మాత్రం.. దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

రాష్ట్రాలు మిధ్య అనే పరిస్థితి తీసుకొస్తున్నారా..?

రాజ్యాంగం ప్రకారం.. కేంద్రం అధికారాలు చాలా పరిమితం. కానీ.. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రాబల్యం వున్న పార్టీలు తమకు పట్టు లేని రాష్ట్రాల్లో ఉనికి కోసం, కేంద్రంలో అధికారంలో ఉండడం ద్వారా తమకు సంక్రమించిన అధికారాలను వాడుకొని, ప్రాంతీయ పార్టీలనూ అవి నడిపే రాష్ట్రాలనూ ఆర్థికంగా, వివిధ వ్యవస్థల ద్వారా దెబ్బ తీసి… రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నారు. ఈ విషయం వారికీ కూడా తెలుసు. అందుకే బీజేపీ నేతలు తరచూ.. రాజ్యాంగం మీద దాడి చేస్తూంటారు. రాజ్యాంగాన్ని తిరగరాస్తామని చెబుతూ ఉంటారు. వారిని ఏ ఒక్కరూ వారించరు. అధికారం శాశ్వతం అనుకునే నేతల వల్లే ఈ సమస్య వస్తుంది. దేశాన్ని ఇప్పుడు అదే సమస్య పట్టి పీడిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com