సూర్య‌, భ‌ర‌త్‌ల గొడ‌వ‌లో లాభ‌ప‌డింది ఎవ‌రు?

భ‌ర‌త్ అనే నేను, నా పేరు సూర్య గొడ‌వ సుఖాంత‌మైంది. మ‌హేష్ సినిమా వారం రోజులు ముందుకీ (అంటే ఏప్రిల్ 20కీ), బ‌న్నీ సినిమా వారం రోజులు వెన‌క్కి (అంటే మే 4)కీ వెళ్లిపోయాయి. నిర్మాత‌లంతా క‌లిసి ఓ మీటింగ్ పెట్టుకుని `రెండు సినిమాలూ ఒకే రోజున విడుద‌ల కావ‌డం మంచిది కాదు.. ప‌రిశ్ర‌మ‌లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొల్ప‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం` అంటూ భుజాలు భుజాలు క‌లుపుకుంటూ ఫొటోల‌కు పోజులిచ్చారు. దాంతో ఈ ఇష్యూకి శుభం కార్డు ప‌డింది.

అయితే వీళ్ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు, రెండు నెల‌ల నుంచీ జ‌రుగుతూనే ఉంది. మ‌ధ్య‌లో చాలా సార్లు నిర్మాత‌ల మ‌ధ్య ఇలాంటి మీటింగులు జ‌రిగాయి. కానీ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. డేట్ మార్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. నువ్వా? నేనా? అంటూనే ఎత్తులు వేశారు. అప్పుడు గుర్తుకు రాని ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం.. ఇప్పుడెందుకు గుర్తొచ్చిన‌ట్టు?? అనే అనుమానాలు క‌ల‌గ‌డం స‌హ‌జం. దీనంత‌టికీ కార‌ణం… ర‌జ‌నీకాంత్ `కాలా` అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ సినిమా కూడా ఏప్రిల్ 27నే గురి పెట్టింది. ర‌జ‌నీ సినిమా ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. మ‌ధ్య‌లో ఎన్ని లింకులు, లిటికేష‌న్లు పెట్టినా… ర‌జ‌నీ ఏప్రిల్ 27న రావ‌డం ఖాయం. ర‌జ‌నీ సినిమాతో పోటీ ప‌డే స‌త్తా.. అటు మ‌హేష్‌కీ ఇటు బ‌న్నీకి ఉన్నాయి. కానీ.. ఎవ్వ‌రికీ రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేదు. మ‌హేష్‌తో పోటీ ప‌డ‌డం బ‌న్నీకి, బ‌న్నీతో స‌వాల్ విసిరి బ‌రిలోకి దిగ‌డం మ‌హేష్‌కీ ఇష్టం లేదు. కానీ వెనుక‌డుగు వేయ‌డానికి మాత్రం జంకారు. ఒక‌వేళ వెనుక‌డుగు వేస్తే… త‌గ్గిన‌ట్టు అవుతుంద‌ని ఎవ‌రికి వాళ్లు ఫీలైపోయి, ఈ వ్య‌వ‌హారం ఇంత వ‌ర‌కూ తీసుకొచ్చారు.

రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల అవ్వ‌డం కుద‌ర‌ని ప‌ని అని ఇప్పుడు మీటింగ్ లో కూర్చున్న ఈ నిర్మాత‌ల‌కు తెలీదా? ఎప్పుడో తెలుసు. ఒక్క‌రు మాత్ర‌మే ప్ర‌యాణం చేయ‌గ‌ల ప‌డ‌వ కోసం.. ఇద్ద‌రు కొట్టుకున్నారు. త‌మ‌లో ఒక‌రు త‌గ్గుతార‌ని గ్యారెంటీగా తెలుసు. కానీ మ‌ధ్య‌లో… ఆ ప‌డ‌వ వేసుకెళ్లిపోవ‌డానికి ‘ర‌జ‌నీ’ వ‌స్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. నిర్మాత‌ల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డానికి, రిలీజ్ డేట్లు మార‌డానికి చాలా కార‌ణాలు ఉండొచ్చు. కానీ అందులో బ‌ల‌మైన కార‌ణం.. ర‌జ‌నీ సినిమానే. ఇప్పుడు ఈ హీరోలిద్ద‌రూ త‌మ‌లో ఎవ‌రికి దారిచ్చారో తెలీదుగానీ… ర‌జ‌నీ సింగిల్‌గా రావ‌డానికి మాత్రం ఇతోదికంగా స‌హాయం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.