సన్నద్ధత కారణం చెప్పడం చిన్నతనంగా అనిపించలేదా జనసేనాని..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడవు ముగిసిన తర్వాత ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తాయని… ముందస్తుగా ఊహించలేపోయినందున.. పోటీ చేయడం కష్టమని… తేల్చేసుకుని ఎన్నికల బరి నుంచి తప్పించుకున్నారట.. సారీ వైదొలిగారట. సిద్ధంగా లేమని ఓ రాజకీయ పార్టీ కారణంగా చెప్పిందంటే.. దాని అర్థం యుద్దం నుంచి పారిపోవడమే. ఇక ఏ రకంగానూ.. ఏ విధమైన యుద్ధాల్లో పాల్గొనే… నైతిక హక్కు కోల్పోయినట్లే…!

ఐదేళ్లలో ఒక్క ఎన్నికకూ సిద్ధం కాలేకపోయారా…?

గత సార్వతిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించారు. “అత్తారింటికి దారేదీ” సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్‌తో.. ఆయన రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికి దాదాపు ఐదేళ్లయింది. ఒక్కటంటే.. ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లోనూ… జనసేన పోటీ చేయలేదు. పార్టీ ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. బేషరతుగా.. టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించేశారు. అలా మద్దతు ప్రకటించడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సరే ఎన్నికల ముందే పార్టీ పెట్టారు.. రాజకీయాలకు కొత్త.. బీఫామ్‌లు ఇవ్వలేక అలా చేశారేమో అనుకున్నా… ఆ తర్వాత ఎన్ని ఎన్నికలు వచ్చాయి..? తెలంగాణలో మూడు నాలుగు ఉన్న ఎన్నికలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఏపీలో నంద్యాల ఉపఎన్నిక వచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. వేటీలోనూ.. ఎందుకు పోటీ చేయలేకపోయారు. అంతే.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడూ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగారు.

ఎన్నికల నుంచి పారిపోవడం రాజకీయ పార్టీకి తగునా..?

భారత ప్రజాస్వామ్యంలో.. రాజకీయ పార్టీలకు విలువ… వచ్చేది.. అది జనంలో తనకు ఉన్న పలుకుబడిని నిరూపించుకున్నప్పుడే. చాలా మంది స్టార్లు పార్టీలు పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్లందరూ పోటీ చేసి.. తమ బలం ఏమిటో చూపించారు. వారిలో విజయం సాధించిన వాళ్లు.. ఓడిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ… ఎన్నికల్లో పోటీ చేయకుండా… నా తఢాకా చూపిస్తానని … జబ్బలు చరిచేవాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఒక్క జనసేనాని తప్ప. ఐదేళ్ల వరకూ వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు కానీ.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్లు మాత్రం అసువుగా చేసేస్తూంటారు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు చావోరేవో అన్నట్లు తలపడుతున్నా… తెలంగాణ అంటే ఇష్టమని.. అక్కడి ప్రజల్ని అలా వదిలేయనని చెప్పి .. ఇప్పుడు.. రెడీ కాలేదని… చెప్పి తప్పించుకోవడం.. ఏ తరహా రాజకీయం..!

సన్నద్ధత ఏపీ ఎన్నికల నాటికైనా ఉంటుందా..?

అసలు పవన్ కల్యాణ్ సన్నద్ధం కాలేదంటారు… ! ఏ తరహా సన్నద్ధత కాలేకపోయారు. పార్టీ కోసం… వ్యవస్థను నిర్మించుకోలేకపోయారా..? కార్యకర్తలను గుర్తించకపోయారా..? క్యాండిడేట్లను.. ఎంపిక చేసుకోలేకపోయారా.. ? ఆర్థిక వనసరుల్ని సమకూర్చుకోలేకపోయారా..?. బహుశా ఇవి అన్నీ అయి ఉండవచ్చు. మరి ఇక నాలుగైదు నెలల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి వీటన్నింటిలో అప్పటికి సన్నద్ధత పూర్తవుతుందా..? లేక… ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి.. మేము ఇంకా రెడీ కాలేకపోయామని.. మతతత్వ పార్టీ కాదని..నోరారా సర్టిఫికెట్ ఇచ్చి..మోడీకి అత్యంత గౌరవంగా.. మద్దతు ప్రకటిస్తారా..?

ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థ పార్టీ జనసేన ఒక్కటే..!

పార్టీని స్థాపించి ఐదేళ్లయినా.. ఎన్నికలకు సిద్ధం కాలేనంత అసమర్థ పార్టీ.. జనసేన తప్ప.. ఇంకోటీ ఈ దేశంలో ఉండదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చారు. కానీ పవర్ స్టార్ మాత్రం ఐదేళ్లవుతున్నా… ఒక్క ఎన్నికలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయారు. కానీ మాటలు మాత్రం కోటలు దాటి పోతూంటాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ.. ఆయన ఏడాదిన్నర కిందటే ట్వీట్ పెట్టారు. అప్పుడు ఎన్నికలంటే… ఇంత తతంగం ఉంటుందని తెలియదా..? తర్వాత రాజ్యంగంలో చదవి తెలుసుకున్నారా..?

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]