ప్ర‌త్యేక హోదా పోరాటంలో జ‌గ‌న్ వైఫ‌ల్యం సంపూర్ణం!

గ‌డ‌చిన కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌యోజ‌నాల అంశ‌మై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేతగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోషించిన పాత్ర ఏంట‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా ఆంధ్రాకి వ‌చ్చారు, ఆ త‌రువాత ప్ర‌ధాని మోడీ గుంటూరులో సభ పెట్టి ఏపీ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్రాకి ఎంతో చేశామ‌ని చెప్పుకుని వెళ్లిపోయారు! ఈ స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కావాలంటూ వైకాపా నుంచి డిమాండ్ వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓప‌క్క ఢిల్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దీక్ష చేస్తున్న రోజున కూడా.. అనంత‌పురంలో జ‌రిగిన స‌మ‌ర శంఖారావ స‌భ‌లో కేవ‌లం రాజ‌కీయ అంశాల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమిత‌మ‌య్యారు. ఒక్క ఓట‌ర్ల జాబితా అంశాన్ని మాత్ర‌మే ప్ర‌స్థావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కూడా కేంద్రాన్ని నిర్భ‌యంగా విమ‌ర్శించ‌లేక‌పోతున్నారు.

ఇవాళ్టితో ప్ర‌త్యేక హోదా పోరాటంలో వైకాపా వైఫ‌ల్యం ప‌రిపూర్ణ‌మైంద‌ని చెప్పుకోవ‌చ్చు. ఎలా అంటే, నాలుగున్న‌రేళ్లుగా హోదా అంశాన్ని తామే స‌జీవంగా ఉంచామ‌ని చెప్పుకున్నారు. ఢిల్లీలో దీక్ష‌లు చేశారు, రాష్ట్రంలో దీక్ష‌లు చేశారు, చివ‌రికి ఎంపీల‌తో రాజీనామాలు కూడా జ‌గ‌న్ చేయించారు! అయితే, ఇవ‌న్నీ హోదా సాధించాల‌న్న చిత్త‌శుద్ధితోనే చేశామ‌ని చెప్పుకుంటున్న‌ప్పుడు… ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రానికి వ‌స్తే ఎందుకు నిల‌దీయ‌లేక‌పోయారు..? 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే పోరాడి హోదా తెస్తామ‌ని జ‌గ‌న్ చెబుతారు క‌దా, ఆ పోరాట స్ఫూర్తి త‌మ‌కి ఉంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మే విధంగా జ‌గ‌న్ ఇప్పుడు వ్య‌వ‌హ‌రించాలి క‌దా..? ఇప్పుడు పార్టీల‌కు అతీతంగా జాతీయస్థాయిలో ఏపీ ప్ర‌యోజ‌నాల సాధ‌న‌కు జ‌రిగే పోరాటానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన దీక్ష చ‌ర్చ‌నీయాంశం అయింది. క‌నీసం ఈ సంద‌ర్భంలోనైనా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం అనుకుంటే… కాసేపు రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టేవారు. ఆ ప‌నీ జ‌గ‌న్ చేయ‌డం లేదు!

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… ప్ర‌త్యేక హోదాపై వైకాపా సాగించామ‌ని చెప్పుకుంటూ వ‌చ్చిన పోరాటానికి పొలిటిక‌ల్ మైలేజ్ ఇక త‌గ్గిపోయిన‌ట్టే. ఎందుకంటే, ఢిల్లీలో సీఎం చంద్ర‌బాబు చేసిన పోరాటం రాష్ట్ర ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌రోసా నింపుతుంది అన‌డంలో సందేహం లేదు. హోదా సాధ‌న కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేయాల‌నుకుంటే… అది ఎవ‌రితో సాధ్య‌మౌతుంద‌నేది ఇప్పుడు మ‌రోసారి సుస్ప‌ష్ట‌మైంది. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌గ‌లిగేది చంద్ర‌బాబు మాత్ర‌మే అనేది మ‌రోసారి నిరూప‌ణ అయింది. ఇదే సందర్భంలో… హోదా విషయంలో సొంత రాజకీయాలను దాటి జగన్ పోరాటం చెయ్యలేకపోయారనేది కూడా స్పష్టమౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com