ఓటుకి నోటు కేసులో వైకాపా అత్యుత్సాహం..కొంప ముంచుతుందేమో?

ఓటుకి నోటు కేసులో వైకాపా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే అది మళ్ళీ దాని కొంప ముంచుతుందేమో? అనిపిస్తోంది. గతంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని గంటలో కూల్చగలనని గొప్పగా చెప్పుకొన్నందుకు ఏకంగా 20మంది వైకాపా ఎమ్మెల్యేలని పోగొట్టుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వైకాపాకి సంబంధం లేని ఓటుకి నోటు కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తెదేపాని రెచ్చగొడుతున్నారు.

ఆ కేసు విచారణపై హైకోర్టు 8 వారాలు స్టే విదించడంతో మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో దానిని సవాలు చేశారు. ఈరోజు దానిని విచారించిన సుప్రీంకోర్టు, రాజకీయ ఉదేశ్యంతో ఇటువంటి కేసులు వేయడం తగదని సున్నితంగా చివాట్లు పెట్టి, ఈ కేసులో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ పై నెలరోజుల్లో నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి సూచించింది. హైకోర్టు తీర్పు చెప్పిన తరువాత అప్పుడు కావాలనుకొంటే రామకృష్ణా రెడ్డి తమ దగ్గరకి రావచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.

వైకాపాకి ఈ ఓటుకి నోటు కేసుతో ఎటువంటి సంబంధమూ లేకపోయినా, ముఖ్యమంత్రికి దీనితో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. రాంకి కేసులో జగన్, విజయ సాయి రెడ్డిలకి ఈడి కోర్టు నుంచి విచారణకి కమ్మని ఆదేశిస్తూ నోటీసులు జారీ అవడం యాదృచ్చికమేనా లేక టిట్-ఫర్-టాట్ గా జరిగిన ప్రతిక్రియా అనేది తెలియవలసి ఉంది. చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు కూనిరాగం తీసినంత తేలికగా చేస్తుంటారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మరి వైకాపా ఏమి చేస్తోందిప్పుడు? ఓటుకి నోటు కేసుతో అసలు దానికి సంబంధం ఏమిటి? తెదేపాని రెచ్చగొడితే తామే నష్టపోతామని ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత కూడా ఇంకా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది? “హైకోర్టు ఆ కేసు నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి కల్పించలేదు. కేవలం 8 వారాలు గడువు మాత్రమే ఇచ్చింది. ఆ తరువాత ఆయనని ఏసిబి విచారించక మానదు,” అని వాదిస్తున్న వైకాపా మరి అంతవరకు ఎందుకు ఆగలేకపోయింది? అంటే అదే కారణం. రాజకీయ విద్వేషం. ఆ విద్వేషంతో చివరికి అదే నష్టపోతుందేమో? రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు కూడా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటాయి. కానీ వైకాపాలాగ వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత స్థాయిలో ద్వేషించడం లేదు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పార్టీ సిద్దాంతంగా చేసుకొని సాగుతున్నారు. అటువంటి సిద్దాంతాలతో ఏ పార్టీ కూడా ఎంతో కాలం మానుగడ సాగించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]