‘అర‌వింద‌’ కోసం బాల‌య్య ఎందుకొస్తాడు?

ఇటీవ‌ల ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి అభిమానులు ఆ వీడియోని తెగ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ భోజ‌నం చేస్తుంటే.. బాల‌య్య వ‌చ్చి మాట్లాడుతున్న దృశ్యాలవి. హ‌రికృష్ణ మ‌ర‌ణాంత‌రం చోటు చేసుకున్న ఈ ప‌రిణామం బాల‌య్య – ఎన్టీఆర్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న కోల్డ్‌వార్‌కి ముగింపు ప‌లికింద‌ని, ఇక నంద‌మూరి హీరోలంతా ఒక్క‌టే అని జ‌నాలు మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న `అర‌వింద స‌మేత‌` ఆడియో ఫంక్ష‌న్‌కి బాల‌య్య ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని ప్ర‌చారం కూడా ముమ్మ‌రం చేశారు.

ఈనెల 20న హైద‌రాబాద్‌లో `అర‌వింద స‌మేత‌` ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల దృష్ట్యా.. బాల‌య్య‌, తార‌క్‌లు క‌ల‌సి పోయార‌ని, అందుకు సాక్ష్యంగా ఈనెల 20న జ‌ర‌బోయే ఆడియో ఫంక్ష‌న్‌కి బాల‌య్య వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది, అయితే ఈ ఫంక్ష‌న్‌కి బాల‌య్య రావ‌డం లేదు. నిజానికి అస‌లు ఆడియో వేడుక‌ను ఘ‌నంగా చేసుకోవ‌డం కూడా ఎన్టీఆర్‌కి ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందానికి స్ప‌ష్టం చేశారు కూడా. కాక‌పోతే… అర‌వింద స‌మేత‌కు సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా జ‌ర‌గ‌లేదు. ఆడియో ఫంక్ష‌న్‌తోనే ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టాలి కాబ‌ట్టి.. అవి త‌ప్ప‌డం లేదు. కాక‌పోతే రెగ్యుల‌ర్ ఆడియో ఫంక్ష‌న్‌లా డాన్సులు, పాట‌లూ అంటూ హోరెత్తించ‌కుండా… సాదా సీదాగా కానిచ్చేయాల‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అలాంట‌ప్పుడు ఈ ఫంక్ష‌న్‌ని బాల‌య్య‌ని ఎందుకు ఆహ్వానిస్తారు..? బాల‌య్య – ఎన్టీఆర్ ల మ‌ధ్య అడ్డుగోడ‌లు కూలిపోతే సంతోష‌మే. కాకపోతే అది ఒక్క‌సారిగా జ‌రిగే ప‌రిణామం కూడా కాదు. ఎన్టీఆర్ వేడుక‌లో బాల‌య్య‌ని, బాల‌య్య ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్‌నీ చూడాల‌ని నంద‌మూరి అభిమానులంద‌రికీ ఉంది. కాక‌పోతే దానికి ఇంకొంచెం టైమ్ ప‌డుతుంది. అర‌వింద స‌మేత ఆడియో ఫంక్ష‌న్‌లో అన్నాద‌మ్ములిద్ద‌రినీ చూడొచ్చు. బాబాయ్ కూడా రావాలంటే… ఇంకొంత కాలం ఎదురు చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com