రాబోయే 50 ఏళ్ల అధికారం బీజేపీదేనట..!

అరవై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేనంత అధికార వ్యతిరేకతను.. బీజేపీ నాలుగంటే నాలుగేళ్లలో ఎదుర్కొంటోంది. అటు పాలనా పరమైన వైఫల్యాలే కాదు.. రాజకీయ పరమైన దిగజారుడుతో ప్రజలతో కాంగ్రెస్సే బెటర్ అనిపించుకునేలా చేశారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను.. దిగజార్చే నిర్ణయాలను అడ్డగోలుగా అమలు చేశారు. ఓ ఆలోచన లేదు.. ఓ విశ్లేషణ లేదు.. ప్రజలపై ఎలాంటి భారం పడుతుందనే ఆందోళన కూడా లేదు.. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకూ.. అలా అమలు చేసేశారంతే. భరించేది ప్రజలేగా అన్నట్లుగా ఉంది.. కేంద్రం తీరు. ఇంత చేసిన కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు.. అమిత్ షా.. వచ్చే యాభై ఏళ్లు బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే 50 ఏళ్ల వరకు బీజేపీని ఎవరు ఓడించలేరని అమిత్‌ షా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తేల్చి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను తన నేతృత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినందున… అమిత్ షా అంత ఆత్మవిశ్వాసం చూపించారో.. లేక.. తమకు మాత్రమే తెలిసిన… విజయానికి దగ్గర దారులు ఏమైనా కనిపెట్టారో కానీ… ఇంకా ఎనిమిది నెలలే అని రోజులు లెక్క పెట్టుకుటున్న ప్రజలకు.. అమిత్ షా చెప్పిన.. యాభై ఏళ్ల లెక్క పీడకలలు తెస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నినాదం “అజేయ భారత్‌-అటల్‌ బీజేపీ” అని ప్రధానమంత్రి మోడీ అదే వేదిక నుంచి ప్రకటించారు. ఏ విషయంలో భారత్‌ను అజేయంగా నిలిపారో మరి..!?

జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ ఏర్పడని మహాకూటమిపై మోడీ, అమిత్ షా ఇద్దరూ విమర్శలు చేశారు. మహా కూటమికి నాయకత్వం ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఒకరి పక్కన ఒకరు నిలబడని పార్టీల నాయకులు.. ఇప్పుడు చేతులు కలుపుతున్నారని విమర్శించారు. నిజం చెప్పాలంటే.. విపక్షాలన్నీ ఏకమయ్యే పరిస్థితిని తెచ్చిందెవరు..? ఒకరి పొడ ఒకరికి గిట్టని పార్టీలన్నీ.. ఇప్పుడు చేతులు కలపాల్సిన పరిస్థితి తెచ్చిందెవరు..? నియంతృత్వంతో.. తమను మించిన వారు లేరనే విర్రవీగడం వల్లే కదా.. మహాకూటమికి అంకురార్పణ జరుగోతంది. యాభై ఏళ్ల ఏళ్ల అధికారం సంగతేమోకానీ… ఈవీఎంలు మ్యాచ్ రిఫరీ పాత్ర పోషిస్తే తప్ప… 2019లో బీజేపీ గట్టెక్కడం కష్టమని.. ఇప్పటికే ప్రజలకు క్లారిటీ వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com