కొర‌టాల‌.. ఆ గండం గ‌ట్టెక్కేనా?

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌.. మూడూ ఒక‌దాన్ని మించి మ‌రోటి ఆడేశాయి. మాస్‌నీ క్లాస్‌నీ క‌ల‌గ‌లిపి మెప్పించాయి. ఈ హ్యాట్రిక్ విజ‌యాల‌తో కొర‌టాల శివ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న ద‌ర్శ‌కుల జాబితా వేస్తే.. అందులో కొర‌టాల పేరు కూడా ఉంటుంది. ఓ మంచి పాయింట్‌కి క‌మ‌ర్షియ‌ల్ కోటింగు ఇవ్వ‌డం కొర‌టాల‌కు బాగా తెలుసు. అయితే… త‌న‌లో ఓ లోపం కూడా ఉంది. క్లైమాక్స్‌లు స‌రిగా రాసుకోలేడ‌ని… అక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చి – సినిమా ఏదో అయ్యింద‌నిపిస్తాడు. క్లైమాక్స్ తేలిపోయిందేంటి? అంటూ ప్రేక్ష‌కుడు కాస్త నిరాశ‌గా థియేట‌ర్ల‌నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న టెంపోని.. చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగించ‌క‌పోవ‌డం మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌ల‌లో క‌నిపించింది. ఇప్పుడు `భ‌ర‌త్ అనే నేను`లో త‌న త‌ప్పుని స‌వ‌రించుకున్నాడా, క్లైమాక్స్‌లోనూ త‌న ప‌ట్టు చూపిస్తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

పాలిటిక్స్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. భ‌ర‌త్ అనే ముఖ్య‌మంత్రి ప్ర‌యాణం ఈ సినిమా. రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే క‌థ ఎలా ఉంటాయో… ఒకే ఒక్క‌డు, లీడ‌ర్ సినిమాలు చూస్తే అర్థ‌మైపోతాయి. దాదాపుగా భ‌ర‌త్ అనే నేను కూడా అదే దారిలో వెళ్లే క‌థ‌. ఇలాంటి క‌థ‌ల‌కు ట్రీట్‌మెంట్ చాలా అవ‌స‌రం. ముగింపు అర్థ‌వంతంగా ఉండాలి. కొత్త‌గా ఏదో చెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాల్లోలా హ‌డావుడిగా క్లైమాక్స్ వేసేస్తే కుద‌ర‌దు. క్లైమాక్స్ బ‌లంగా ఉంటే త‌ప్ప సినిమా ఇంపాక్ట్ చూపించ‌లేదు. మ‌రి అంత‌టి కీల‌క‌మైన క్లైమాక్స్‌లో కొర‌టాల ఏం చేశాడ‌న్న పాయింట్‌పై మ‌హేష్ అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. ”అవును నా క్లైమాక్స్‌లు వీక్‌గా ఉంటాయి… ఈసారి ఆ త‌ప్పు జ‌ర‌గ‌నివ్వ‌ను” అని జ‌న‌తా గ్యారేజ్ టైమ్‌లోనే చెప్పాడు కొర‌టాల‌. మ‌రి ఆ త‌ప్పు స‌రిదిద్దుకున్నాడో్ లేదో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.