రాష్ట్రప‌తి అభ్య‌ర్థిపై ప్ర‌తిపక్షాలు మెలిక పెడ‌తాయా..!

ఎన్టీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును అనూహ్యంగా తెర‌మీదికి తీసుకొచ్చింది భాజ‌పా! అయితే, ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికే విష‌య‌మై ప్ర‌తిప‌క్షాల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. కొన్ని పార్టీలు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే, మ‌రికొన్ని పార్టీలు ఇంకా ఆలోచ‌లోనే ఉన్నాయి. అయితే, రామ్ నాథ్ ద‌ళిత నేత కావ‌డంతో ఏ పార్టీ నేరుగా త‌మ వ్య‌తిరేక‌త తెలుప‌లేని ప‌రిస్థితి! ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై స్పందించేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ నిరాక‌రించ‌డం విశేషం. ఈ నెల 22 జ‌రిగే ప్ర‌తిప‌క్షాల స‌మావేశం త‌రువాతే స్పంద‌న ఉంటుంద‌ని పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ చెప్పారు. ఎన్డీయే అభ్య‌ర్థి విష‌యంలో తాము ప్ర‌స్తుతం ఎలాంటి కామెంట్స్ చేయ‌ద‌ల్చుకోలేద‌ని అన్నారు. అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న విష‌యంలో ముందుగా ఎన్డీయే త‌మ‌ని సంప్ర‌దించి ఉంటే బాగుండేద‌న్నారు.

సీపీఎం స్పంద‌న కూడా ఇలానే ఉంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ద‌ళిత నేత‌ను ఎంపిక చేయ‌డం క‌చ్చితంగా రాజ‌కీయ‌మే అని సీతారాం ఏచూరి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏదైనా ద‌ళితుడు కాబ‌ట్టి మ‌ద్ద‌తు ఇస్తున్నామంటూ బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి. అయితే, ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌తిప‌క్షాల‌ను కూడా సంప్ర‌దించి ఉంటే బాగుండేది అన్నారు. ఇక‌, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీయేకి ప‌రిపూర్ణ మ‌ద్ద‌తు ల‌భించింది. కేసీఆర్ కు మోడీ ఫోన్ చేశార‌నీ, మ‌ద్ద‌తు కోరారంటూ ఆ పార్టీ ఎంపీ క‌విత అన్నారు. అంతేకాదు, రాష్ట్రప‌తిగా ద‌ళితుడికి అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌తంలో కేసీఆర్ సూచించార‌నీ, ఆ విష‌యాన్ని మోడీ కూడా కేసీఆర్ కు ఇప్పుడు గుర్తు చేశార‌ని ఆమె చెప్పారు.

అయితే, ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల వ్యూహం ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 22న సోనియా గాంధీ అధ్య‌క్ష‌తన జ‌ర‌గ‌బోతున్న స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నాయ‌నే దానిపై అంద‌రి దృష్టీ మ‌ళ్లింది. ద‌ళిత అభ్య‌ర్థి కాబ‌ట్టి, ఏ పార్టీలూ కాద‌న‌లేని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని భాజ‌పా వ‌ర్గాలు ధీమాగా ఉన్నాయి. మోడీని వ్య‌తిరేకించే వారంద‌రూ ఈ నిర్ణ‌యానికి స‌పోర్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని వారు విశ్లేషించుకుంటారు. అయితే, ఈ విశ్లేష‌ణ‌ల‌కు విరుద్ధంగా మ‌రో ద‌ళ‌త అభ్య‌ర్థిని ప్ర‌తిప‌క్షాలు పోటీకి దించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మౌతోంది. అదే జ‌రిగితే ప‌రిస్థితి మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

నిజానికి, రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో ఈ మ‌ధ్య చాలాపేర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అద్వానీకి అవ‌కాశం క‌ల్పించి మోడీ త‌న గురు ద‌క్షిణ తీర్చుకుంటార‌ని అనుకున్నారు. కానీ, బాబ్రీ కేసు నేప‌థ్యంలో ఆయ‌న పేరు రేసు నుంచీ ప‌క్క‌కు వెళ్లింది. ఆర్.ఎస్‌.ఎస్‌. ఛీఫ్ మోహన్ భ‌గ‌వ‌త్ పేరును శివ‌సేన ప్ర‌తిపాదించింది. కానీ, ప‌ద‌వుల‌కు తాను దూరం అంటూ ఆయ‌న సైడ్ అయ్యారు. సుష్మా, సుమిత్రా మ‌హాజ‌న్ పేర్లూ వినిపించాయి. అయితే, ఇప్ప‌టికే వారు ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో వారి పేర్లూ ప‌క్క‌కు వెళ్లాయి. త‌రువాత‌, ద్రౌప‌తీ మ‌ర్ము పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఒడిశాకు చెందిన ద‌ళిత నేత‌కు అవ‌కాశం ఇస్తున్నారంటూ భారీ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ పేరూ ప‌క్క‌కెళ్లిపోయింది. అయితే, అన్ని పార్టీల స‌ల‌హా మేర‌కే ద‌ళిత నేత‌ను ఎన్డీయేకి తెర‌మీదికి తెచ్చిందని చెబుతున్నారు. త్రిస‌భ్య క‌మిటీ సూచ‌న‌ల మేర‌కే రామ్ నాథ్ పేరు తెర‌మీదికి తెచ్చామ‌ని భాజ‌పా నేత‌లు అంటున్నారు. అయితే, ప్ర‌తిప‌క్షాల స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్రప‌తి ఎన్నిక ఏక‌గ్రీవం అవుందా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com