ప్ర‌భాస్‌తో సినిమా అయ్యే ప‌నేనా?

ఇదిగో పులి… అంటే అదిగో తోక అనేస్తున్నారు సినీ జ‌నాలు. ఓ ద‌ర్శ‌కుడు, ఓ హీరో క‌ల‌సి క‌నిపిస్తే చాలు… వాళ్ల నుంచి ఓ సినిమా వ‌చ్చేస్తోంద‌న్న పుకారు మొద‌లైపోతుంటుంది. ఆలూ లేదు.. సూలూ లేదు – అల్లుడి పేరు సోమ‌లింగం అన్న‌ట్టు.. క‌థ‌, నిర్మాత లేకుండానే టైటిళ్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. ప్ర‌భాస్ – ప్ర‌భుదేవా విష‌యంలో కూడా మీడియా కాస్త అతికి పోతోందేమో అనిపిస్తోంది. ”ప్ర‌భాస్‌తో మ‌ళ్లీ సినిమా చేస్తారా” అని మీడియావాళ్లు అడిగితే… ఏ ద‌ర్శ‌కుడైనా ‘చేస్తా..’ అంటాడు.. గానీ ‘లేదండీ నాకా ఉద్దేశ్య‌మే లేదు’ అంటాడా?? ప్రభుదేవాని కూడా ఇదే ప్ర‌శ్న అడిగారు ముంబై మీడియా వాళ్లు. ”త‌ప్ప‌కుండా చేస్తా.. కానీ స‌రైన క‌థ దొర‌కాలి క‌దా” అన్నాడు. అంతే.. ప్ర‌భాస్ – ప్ర‌భుదేవాల‌తో సినిమా అంటూ పెద్ద పెద్ద హెడ్డింగుల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ మొద‌లైపోయింది.

నిజానికి ప్ర‌భాస్ కాల్షీట్లు ఇప్ప‌ట్లో దొరికే ఛాన్స్ లేదు. సాహో పూర్త‌య్యే స‌రికి 2018 లో స‌గం రోజులు గ‌డిచిపోతాయి. ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ పెళ్లి హ‌డావుడి మొద‌ల‌వుతుంది. సాహో త‌ర‌వాత‌. జిల్ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు ప్ర‌భాస్. దానికి మ‌రో యేడాది. అంటే. 2019లో త‌ప్ప ప్ర‌భాస్ దొర‌క‌డు. ఈలోగా… ఇంకెంత‌మంది ద‌ర్శ‌కులు ప్ర‌భాస్‌కి క‌థ‌లు వినిపిస్తారో. అయినా పౌర్ణ‌మి లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత ప్ర‌భుదేవాకి ప్ర‌భాస్ మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తాడంటారా?? ఆ మాత్రం లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడేస్తారో మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com