మూడు సినిమాల్లో అప్ప‌ర్ హ్యాండ్ ఎవ‌రిది?

ముగ్గురు స్టార్లు.. మూడు సినిమాలు
నెల రోజుల వ్య‌వ‌ధిలో క్యూ క‌ట్ట‌బోతున్నాయి
మ‌రి పై చేయి ఎవ‌రిది?
ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంది?

****

రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో ‘రంగ‌స్థ‌లం’ రెడీ అవుతోంది. చ‌ర‌ణ్ ధృవ‌తో హిట్టు కొట్టాడు. సుకుమార్ కూడా నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో రేసులోకి వ‌చ్చాడు. పైగా వీరిద్ద‌రిదీ కొత్త కాంబో. టెక్నిక‌ల్‌గా ఈ సినిమాకి బాగా స‌పోర్ట్ ఉంది. దేవిశ్రీ‌, ర‌త్న‌వేలు, రామ‌కృష్ణ లాంటి ఉద్దండులు ఈ సినిమాకి ప‌నిచేశారు. స‌మంత గ్లామ‌ర్ ఉండ‌నే ఉంది. టీజ‌ర్లు, పాట‌లు హోరెత్తిస్తున్నాయి. కానీ ఎక్క‌డో లోటు. సుకుమార్‌ని గుడ్డిగా న‌మ్మ‌లేం. త‌న మ్యాజిక్కులు, లాజిక్కులు ఎక్క‌డ ఎలా వ‌ర్క‌వుట్ అవుతాయో చెప్ప‌లేం. అయితే హిట్టు, లేదంటే ఫ‌ట్లూ అన్న‌ట్టుంటుంది ప‌రిస్థితి. పైగా త‌న సినిమాలెప్పుడూ డివైడ్ టాక్‌తో మొద‌ల‌వుతుంటాయి. ‘ఆర్య‌’, ‘100 %ల‌వ్‌’, ‘నాన్న‌కు ప్రేమ‌తో’ ఈసినిమాల‌న్నీ డివైడ్ టాక్‌తో మొద‌లై.. మెల్ల మెల్ల‌గా హిట్ట‌య్యాయి. అందుకే బ‌య్య‌ర్లు కాస్త భ‌య‌ప‌డుతుంటారు. అన్నింటికంటే మించి ఈ సినిమాకి రిపేర్లు ఎక్కువ జ‌రిగిన‌ట్టు వార్త‌లు చుట్టు ముట్టిన నేప‌థ్యంలో ఈ సినిమా ఫ‌లితం కాస్త అటూ ఇటూ అవుతుందేమో అనే భ‌యంలో ఉన్నారు బ‌య్య‌ర్లు.

జై జ‌వాన్ అనే కాన్సెప్టుతో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. అల్లు అర్జున్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. స‌రైనోడుతో మాస్‌ని ఆక‌ట్టుకున్నాడు. డీజే కూడా ఓకే అనిపించుకుంది. టీజ‌ర్లు చూస్తుంటే.. బ‌న్నీ ప‌డిన క‌ష్టం అర్థ‌మ‌వుతూనే ఉంది. కానీ… జ‌నాల భ‌యం ఒక్క‌టే. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. అత‌ను క‌థ‌కుడిగా హిట్టు. కానీ ద‌ర్శ‌కుడిగా ఏం చేస్తాడో ఇప్పుడే చెప్ప‌లేం. ఇది కూడా ఏసీ, డీసీ అటే. అయితే హిట్టూ, లేదంటే ఫ‌ట్టూ. ద‌ర్శ‌కులుగా మారిన ర‌చ‌యిత‌లంతా త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ‌లా షైన్ అవుతార‌ని చెప్ప‌లేం. రైటింగ్ విష‌యంలో మెరిసిన వాళ్లు టేకింగ్ ప‌రంగా ఘోరంగా విఫ‌ల‌మైన సంద‌ర్భాలున్నాయి. కాబ‌ట్టి ఈ సినిమాపై అంత‌గా న‌మ్మ‌కాలు పెట్టుకోలేం. దానికి తోడు.. బ‌న్నీ య‌మ సీరియ‌స్ లుక్కులో క‌నిపిస్తున్నాడు. దేశ‌భ‌క్తి నేప‌థ్యం అనేది క‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ పాయింటే. కానీ దాన్ని మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించ‌క‌పోతే మాత్రం… అభాసు పాల‌వుతారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఏం చేశాడ‌న్న‌ది చూడాలి.

ఈ రెండు సినిమాల‌తో పోలిస్తే… కాస్త అప్ప‌ర్ హ్యాండ్ ‘భ‌ర‌త్ అనే నేను’కే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే ‘శ్రీ‌మంతుడు’ త‌ర‌వాత వ‌స్తున్న కాంబో ఇది. ద‌ర్శ‌కుడిగా కొర‌టాల శివ రికార్డు అమోఘంగా ఉంది. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌.. ఇలా హ్యాట్రిక్ కొట్టాడు. ‘భ‌ర‌త్ అనే నేను’ టీజ‌ర్ చూశాక‌… అత‌నిపై న‌మ్మ‌కం, గౌర‌వం మ‌రింత పెరిగాయి. రెండు అట్ట‌ర్ ఫ్లాప్స్ త‌ర‌వాత మ‌హేష్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. అయినా స‌రే… దీనికి క్రేజ్ త‌గ్గ‌లేదు. దానికి కార‌ణం… క‌చ్చితంగా కొర‌టాల శివ‌.. అత‌ని ట్రాక్ రికార్డే. క‌థ ప‌రంగా ఎలాంటి త‌ప్పు చేయ‌డ‌న్న న‌మ్మ‌క‌మే… భ‌ర‌త్‌ని అప్ప‌ర్ హ్యాండ్‌లో ఉంచింది. అదే గ‌క‌ను.. స్పైడ‌ర్ హిట్ట‌యి మ‌హేష్ రేజులో ఉంటేనా… ఈ సినిమా అంచ‌నాలు మ‌రో స్థాయిలో ఉండేవి. మొత్తానికి మహేష్ – కొర‌టాల శివ కాంబో ప్ర‌త్యేక‌త మ‌రోసారి బాక్సాఫీసుకి అర్థ‌మైంది. ఈ మూడు సినిమాల విడుద‌ల‌కు ముందు.. క‌చ్చితంగా మ‌హేష్‌దే పై చేయి. కానీ అంచ‌నాలు వేరు, నిజాలు వేరు. న‌మ్మ‌కాలు వేరు.. వాస్త‌వాలు వేరు. బొమ్మ ప‌డ్డాక ఈ జాత‌కాల‌న్నీ తారుమారు అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.