యాదాద్రి సైకో..! ఆ మృగం కంట్లో పడిన బాలికలు బావిలో తేలాల్సిందే..!

హత్యలు చేసి పొలంలో.. బావిలో పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్లు తిరిగేవాళ్లను సాధారణంగా సినిమాల్లోనే చూస్తూంటాం. మన మధ్యే తిరుగుతూ అమాయకంగా నటిస్తూంటారు. ఊళ్లలో జరిగే వరుస హత్యలు ఎవరు చేశారో మిస్టరీ వీడిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఎవరిపై అనుమానం రాదో.. వాళ్లే ఆ హత్యలు చేసి ఉంటారు. ఇలాంటి ఘటన నల్గగొండ జిల్లాలో బయటపడింది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసుకుని… అత్యాచారం, హత్యలకు పాల్పడటమే కాదు..ఆధారాలు దొరకకుండా బావిలో పాతిపెట్టి… అమాయకంగా అదే ఊళ్లో జీవిస్తున్న వ్యక్తి వ్యవహారం వెలుగుచూసింది.

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో హాజీపూర్‌ అనే గ్రామం ఉంది. నెల రోజుల క్రితం.. మనీషా అనే అమ్మాయి అదృశ్యమయింది. ఆ తర్వాత వారం రోజుల కిందట.. శ్రావణి అనే మరో అమ్మాయి కూడా అదే తరహాలో అదృశ్యమయింది. అయితే మనీషా తల్లిదండ్రులు.. పరువు పోతుందని కేసు పెట్టలేదు. కానీ శ్రావణి తల్లిదండ్రులు మాత్రం కేసు పెట్టారు. రెండు రోజులు ఆలస్యంగా పోలీసులు దృష్టి పెట్టడంతో… శ్రావణిని కనిపెట్టారు. సమీపంలోని బావిలోనే ఆమెను చంపి పాతి పెట్టారు. అంతకు ముందు అత్యాచారం చేశారు. పోలీసులు అనుమానంతో మరిన్ని తవ్వకాలు చేయగా.. మరో మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డారు. అక్కడ దొరికిన పుస్తకాలు.. ఇతర ఆధారాలతో… ఆ మృతదేహం మనీషాదిగా గుర్తించారు.

ఆ వ్యవసాయబావి… శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినది. అతను లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తూంటాడు. పోలీసులు అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడప్పుడూ.. సైకోలా ప్రవర్తించే శ్రీనివాస్ రెడ్డిని ఎవరూ పెద్దగా అనుమానించలేదు. కానీ… పోలీసులు తీగలాగే సరికి.. మొత్తం బయటకు వచ్చింది. కాలేజీల కోసం… కీసరకు వెళ్లే విద్యార్థులు.. మళ్లీ గ్రామానికి రావాలంటే… కొంత దూరం ఆటో.. మరికొంత నడక సాగించాల్సి ఉంటుంది. దీంతో… శ్రీనివాస్ రెడ్డి తనకు ఉన్న పల్సర్ వాహనంతో.. మాటు వేసేవాడు. గ్రామంలోని అమ్మాయిలకు నమ్మకంగా మాటలు చెప్పి… బండి మీద డ్రాప్ చేసేవారు. అలా నమ్మకం కుదిరిన తర్వాత అనుమానం రాకుండా.. రాత్రి పూట… డ్రాప్ చేయాలనుకున్నప్పుడు.. బావి దగ్గరకు తీసుకుపోయి అత్యాచారం చేసి.. హత్య చేసేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా… బావిలోనే పాతి పెట్టేవాడు. హంతకుడు ఎంత తెలివిగా ఉన్నాడంటే… తన వాహనాన్ని ఎవరైనా గుర్తు పడతారేమోనని… దాన్ని కూడా బావిలోనే పూడ్చి పెట్టారు.

పోలీసులు అతని నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఓ హత్య కేసు ఉంది. మరో వైపు… బొమ్మల రామారం చుట్టుపక్కల మిస్సింగ్ కేసులను బయటకు తీసి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇంకెంత మంది అమ్మాయిల్ని శ్రీనివాస్ రెడ్డి.. హతమార్చాడో బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com