అమిత్ షా రాలేదు… జైట్లీ పాత పాట పాడారు..!

అత్యంత కీల‌కం అనుకున్న ఆ భేటీ కాస్తా తుస్సుమ‌ని గాలి తీసేసిన‌ట్టుగా అయిపోయింది..! విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చాలా ముఖ్యమైన భేటీ జ‌రుగుతుంద‌నీ, దీని కోసం ఏపీ స‌ర్కారు రావాలంటూ భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ స‌మావేశానికి కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రితోపాటు, రాష్ట్ర ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ఎంపీ రామ్మోహ‌న నాయుడు, ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావుల‌తో కూడిన బృందం ఢిల్లీకి వెళ్లింది. ప‌గ‌లంతా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ఏపీ అంశ‌మే అట్టుడికింది. దీంతో సాయంత్రం జ‌రుగుతున్న ఈ కీల‌క భేటీలో ఏదైనా కీల‌క‌మైన నిర్ణ‌యాలూ ప్ర‌క‌ట‌న‌లు లాంటివి ఉంటాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలాంటిదేదీ ఇక్క‌డ జ‌ర‌గ‌లేదు. పైగా, కీల‌కం అనుకున్న ఈ స‌మావేశానికి అమిత్ షా హాజ‌రు కాలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం..!

కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ కార్యాల‌యంలో ఈ భేటీ జ‌రిగింది. అనంత‌రం ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే ఆంధ్రాకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే డిమాండ్ ని జైట్లీ ముందుంచామ‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇస్తున్న‌ప్పుడు, ఆంధ్రాకి కూడా ఇవ్వాల‌ని కోరామ‌నీ, రెవెన్యూ లోటు భ‌ర్తీ చేయాల‌ని కూడా అడిగిన‌ట్టు చెప్పారు. ఏపీకి ఉన్న న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కులను అమ‌లు చేయాల‌ని అడిగామ‌నీ, దీనిపై అరుణ్ జైట్లీ స్పందించి… ఇత‌ర కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చిస్తామ‌న్నార‌నీ, మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించార‌ని య‌న‌మ‌ల చెప్పారు.

ఇదీ కేంద్రం వ‌రుస‌. ‘స‌మావేశానికి రండీ’ అని పిలిచిన అమిత్ షా భేటీకి హాజ‌రు కాలేదు. సమావేశం నిర్వహించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఏదో కొత్త సమస్యపై విన‌తి ప‌త్రం స్వీక‌రిస్తున్న‌ట్టుగా… ‘చూస్తాం, చేస్తాం, చ‌ర్చిస్తాం, మ‌ళ్లీ క‌లుద్దాం’ అనేసి మ‌మ అనిపించేశారు. ఇంత‌కీ ఈ భేటీ ద్వారా ఏం సాధించిన‌ట్టు..? కేంద్రం ఏర‌క‌మైన స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టు..? ఎందుకు పిలిచినట్టు.? తెలిసిన విష‌యాలే మ‌ళ్లీ తెలుసుకున్నారా..? ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలీ, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలీ, రెవెన్యూ లోటు తీర్చాలీ.. ఇవేమైనా కొత్త అంశాలా, జైట్లీకి తెలియ‌ని స‌మ‌స్య‌లా..? పైగా, వీటిపై ఇత‌ర మంత్రుల‌తో చ‌ర్చిస్తాన‌ని జైట్లీ ముక్తాయించ‌డం మ‌రీ విడ్డూరం..! రానురానూ ప‌రిస్థితి ఎలా త‌యారౌతోందంటే… ఆంధ్రా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిద్దామ‌ని కేంద్రం పిలిచినా, అక్క‌డేం జ‌ర‌గ‌దు అనే ఒక స్థాయి న‌మ్మ‌కాన్ని క‌లిగించేలా కేంద్ర పెద్ద‌లే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.