గ‌వ‌ర్న‌ర్ మీద వైకాపా కూడా ఓ రాయి వేసింది..!

అంద‌రూ అంటున్నారు..! అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఆంధ్రాలో భాజ‌పా నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌నం మాత్రం ఎందుకు త‌గ్గ‌డం, ఓ మాట అనేస్తే పడుంటుంది క‌దా… అన్న‌ట్టుగా ఉంది వైకాపా తీరు! అదేనండీ… గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పై విమ‌ర్శ‌ల విష‌యం గురించే ప్ర‌స్థావిస్తున్న‌ది! నాలా బిల్లుపై నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు కాబ‌ట్టి, ఏపీ భాజ‌పా నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు క‌దా! అచ్చంగా ఇలాంటి బిల్లే తెలంగాణ స‌ర్కారు పంపిస్తే వెంట‌నే స్టాంప్ వేశార‌నీ, ఆంధ్రా నుంచి పంపితే కొర్రీలు పెట్టారనీ భాజ‌పా నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌, తెరాస స‌ర్కారుపై ఫిర్యాదులు చేయ‌డానికి వెళ్తే.. కేసీఆర్ సాబ్ ను వెన‌కేసుకొస్తున్న‌ట్టుగా న‌ర‌సింహ‌న్ వైఖ‌రి ఉంద‌నేది ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల వాద‌న క‌దా! ఆ రెండు పార్టీలకూ గ‌వ‌ర్న‌ర్ ను విమ‌ర్శించేందుకు కావాల్సిన బ‌లమైన పాయింట్లు ఉన్నాయి. త‌గుదున‌మ్మా అంటూ వైకాపా కూడా ఫిరాయింపుల పాయింట్ ప‌ట్టుకుని గ‌వ‌ర్న‌ర్ మీద విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును గ‌వ‌ర్న‌ర్ వెన‌కేసుకొస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు ఆరోపించారు. చంద్ర‌బాబు నాయుడు రోజుకి 25 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నార‌నీ, వారానికి 8 రోజులు ప‌నిచేస్తున్నారంటూ గ‌వ‌ర్న‌ర్ చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్నారు. రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించాల్సిన గ‌వ‌ర్న‌ర్‌.. రాజ్యాంగాన్ని ఉల్ల‌ఘించే ప‌రిస్థితులు రాష్ట్రంలో ఉంటే దాని గురించి స్పందించ‌డం లేద‌న్నారు. ఈ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దూ, మార్చండీ అంటూ సాక్షాత్తూ ఏపీ భాజ‌పా నేత‌లే డిమాండ్ చేస్తున్నార‌న్నారు. ఫిరాయింపుల‌పై టీడీపీ చేస్తున్న‌ది త‌ప్పూ అని మిత్ర‌ప‌క్ష‌మైన భాజ‌పా వ్యాఖ్యానిస్తున్నా అధికార పార్టీలో స్పంద‌న లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. టీడీపీని పొగిడే కార్య‌క్ర‌మం త‌గ్గించుకుని.. ఫిరాయింపుదారులపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ అంబ‌టి డిమాండ్ చేశారు.

ఫిరాయింపుల‌పై వైకాపా పోరాటం చేస్తుందంటూ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించారు క‌దా! ఇంత‌వ‌ర‌కూ ఆ పోరాటం ఎలా చేశారో తెలీదు. కానీ, ఇప్పుడు సంద‌ర్బం వ‌చ్చింది కాబ‌ట్టి… ఎలాగూ గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ పై అటు తెలంగాణ‌లో ఇటు ఏపీలో భాజ‌పా నుంచి కొన్ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి కాబ‌ట్టి… తామూ ఓ మాట అనేద్దాం అన్న‌ట్టుగా అంబ‌టి స్పంద‌న ఉంది. అంతేగానీ.. ఇది ఫిరాయింపుల‌పై వైకాపా పోరాటం అన్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

మ‌రో పాయింట్ ఏంటంటే… గ‌వ‌ర్న‌ర్ ను మార్చే ప‌రిస్థితి ఉంద‌నీ, కాబ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు ద్వారా కేంద్రంలో కొంత లాబీయింగ్ చేసుకుని, ప‌ద‌విని కొన‌సాగించుకునే ప్ర‌య‌త్నంలో నరసింహన్ ఉన్నార‌ని అంబ‌టి వ్యాఖ్యానించారు. ఆయ‌న మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే… గ‌వ‌ర్న‌ర్ ను మార్చ‌మంటున్న‌ది ఎవ‌రూ, భాజ‌పా నేత‌లే క‌దా! అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ద్వారా న‌ర‌సింహ‌న్ లాబీయింగ్ చేస్తే కేంద్రంలోని భాజ‌పా నిర్ణ‌యం మార‌దు క‌దా! పైగా, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌ధాని మోడీకి మొద‌ట్నుంచీ సన్నిహితంగా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌ట్నుంచే న‌ర‌సింహ‌న్ కు కొంత సాన్నిహిత్యం ఉంది. ప్ర‌స్తుతం కేంద్రంలో అత్యంత కీలక పోషిస్తున్న అజిత్ ధోవ‌ల్ వంటివారి స్నేహం న‌ర‌సింహ‌న్ కు పుష్కలంగా ఉంది. కావాలంటే, ఆ స్థాయిలో న‌ర‌సింహ‌న్ లాబీయింగ్ చేసుకుంటారుగానీ… చంద్ర‌బాబును ఎందుకు ఆశ్ర‌యిస్తారు చెప్పండీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.