జగన్ మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి తనపై జరుగుతున్న సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వివిధ వేదికలపై తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వస్తున్న అసత్య కథనాలు, మార్ఫింగ్ పోస్టులపై ఆమె న్యాయపోరాటానికి దిగారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా, ఎక్స్ , యూట్యూబ్ సంస్థలకు ఆమె తరఫు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు.
తమ నోటీసులలో వైఎస్ భారతీ రెడ్డి తరఫు న్యాయవాది ప్రద్యుమన్ కీలక డిమాండ్లను ఉంచారు. భారతీ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న అన్ని తప్పుడు కథనాలు, అసభ్యకరమైన పోస్టులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. కేవలం పోస్టులను తొలగించడమే కాకుండా, ఇలాంటి విషపూరిత ప్రచారాన్ని నిరంతరం వ్యాప్తి చేస్తున్న నిర్దిష్ట అకౌంట్లను గుర్తించి వాటిని శాశ్వతంగా బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన వేదికలుగా ఉండాల్సిన సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి దుష్ప్రచారానికి తావు ఇవ్వడంపై నోటీసుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఈ తప్పుడు పోస్టుల వల్ల జరిగిన నష్టానికి సదరు సంస్థలు, ఆయా అకౌంట్ల నిర్వాహకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక మహిళా ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా సమాజంలో ఉన్నత గౌరవం కలిగిన వ్యక్తిపై రాజకీయ కక్షతో చేస్తున్న ఇటువంటి పోస్టులు ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. జగన్ పాతికేళ్ల కిందట చేసిన ఓ ఘోరమైన పని తెలుసుని తన జోలికి వస్తే దాన్ని బయటపెడతానని హెచ్చరించారు. దాంతో పలువురు సోషల్ మీడియాలో అది ఏమైనా ఉంటుందా అని అనేక రకాల ఊహాగానాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాతికేళ్ల కిందట జగన్పై గృహహింస కేసు పెట్టారన్న ప్రచారం ప్రారంభమయింది. ఇది ఆమె దృష్టికి రావడంతో లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు.


