ఇంతకీ బ్రాహ్మణులకు జగన్ ఎలాంటి మేలు చేస్తామన్నారు..?

Courtesy : Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో… అప్పుడప్పుడు కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం బ్రాహ్మణులతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఐవైఆర్ సహా చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్లంతా.. ఏం చర్చించారు..? ఎజెండా ఏమిటి..? అని సభ జరిగిన తీరు చూస్తే.. అందరి ఎజెండా ఒకటే.. చంద్రబాబు అని అనిపించక మానదు. చంద్రబాబును తిట్టడమే బ్రాహ్మణులకు జగన్ ఇచ్చిన భరోసా. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. విశాఖలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఎజెండా చంద్రబాబును తిట్టడమే అన్నట్లుగా సాగింది. సుదీర్ఘంగా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి … చంద్రబాబు బాహ్మణను మోసం చేశారని.. ఆలయాల భూముల నుంచి రమణదీక్షితుల వరకూ అనేక అంశాలపై బాధపడ్డారు కానీ… కనీసం తాను వస్తే.. బ్రాహ్మణులకు ఎలాంటి మేలు చేస్తారో కూడా చెప్పలేదు. ఈ సమావేశం మొత్తానికి హైలెట్ ఏమిటంటే..” చంద్రబాబుకు దేవుడంటే భయం..భక్తి లేవని” జగన్ తేల్చడం.. దాన్నే జగన్ పత్రిక బ్యానర్‌గా ప్రచురించుకుంది.

వచ్చిన వాళ్లందరూ… … వైఎస్ హయాంలో అంటే… పదిహేనేళ్ల కిందట.. తమకు డబ్బులొచ్చాయి.. ఇప్పుడు రావడం లేదని చెప్పడం… చంద్రబాబును విమర్శించడం… జగన్ వస్తేనే మళ్లీ మాకు మంచి జరుగుతుందని అటూ ఇటూ మార్చి చెప్పడమే తప్ప .. చంద్రబాబు ఏం అన్యాయం చేశారు..? ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసింది..? బ్రాహ్మణుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలున్నాయో చెప్పలేదు. చివరికి మల్లాది విష్ణు అనే నేత కూడా.. వైఎస్ హయాంలో బ్రాహ్మణులకు రూ. వెయ్యి కోట్లిచ్చారన్నారు. ఎలా ఇచ్చారో మాత్రం చెప్పలేదు. వైఎస్ హయాంలో బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి సాయం చేశారో చెప్పలేదు. ఐవైఆర్ కృష్ణారావు.. తాను టీటీడీ ఈవోగా ఉన్నప్పుడే .. అర్చకులకు రూ. 50వేల జీతాలు ఇప్పించేందుకు జీవో ప్రిపేర్ చేయించారట. అది మధ్యలో ఆగిపోయిందని ఇప్పుడు బాధపడ్డారు. ఇంకో విశేషం ఏమిటంటే.. చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్‌తో తాను బ్రాహ్మణులకు ఎంతో మేలు చేశానని ఐవైఆర్ చెప్పుకోవడం. మరి ఆ మేలు ఎవరి వల్ల జరిగిది..?

అవడానికి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశమే కానీ.. అంతా చంద్రబాబు జపమే చేశారు. తమ సంక్షేమం కోసం.. జగన్ ఏం చేయదల్చుకున్నారో ఒక్కరూ ప్రశ్నించలేదు. ఆయన చెప్పలేదు కూడా. చంద్రబాబును విమర్శిస్తేనే తమకు సంక్షేమం అన్నట్లుగా వచ్చిన వాళ్లంతా మాట్లాడేశారు. జగన్ కూడా వారినేమీ నిరాశపర్చలేదు. తన రేంజ్‌లో చంద్రబాబును తిట్టారు. ఓ సందర్భంలో.. బ్రాహ్మణలకు కొత్త అర్థం చెప్పారు. అదేమిటంటే.. బ్రాహ్మణులంటే.. పాస్టర్లు, మౌజమ్‌ల లాంటి వాళ్లట. బ్రాహ్మణులంటే.. ఒక్క అర్చకులేననుకుంటున్న జగన్ విజ్ఞానానికి అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోకుడా ఎలా ఉంటారు..?. కొసమెరుపేమిటంటే.. దాదాపుగా రెండు నెలలు క్రితం.. బ్రాహ్మణసంఘాలన్నీ రాజమండ్రి సమీపంలో ఓ బహిరంగసభ పెట్టాయి. వెళ్లి జగన్‌ను ఆహ్వానించారు. జగన్ వస్తానని చెప్పారు. కానీ చివరి క్షణంలో హ్యాండిచ్చారు. అప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ జగన్‌ను శపించాయి. ఇప్పుడు జగన్ పెట్టిన ఆత్మీయసభకు మాత్రం బ్రాహ్మణ సంఘాల పేరుతో కొంత మంది వచ్చి.. జగన్ ను సంతృప్తి పరిచేలా చంద్రబాబును ఆశీర్వదించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]