జ‌గ‌న్ నంద్యాల‌లో కొన్నాళ్లు ఉంటార‌ట‌!

నంద్యాల ఎన్నిక‌పై అధికార ప్ర‌తిప‌క్షాలు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. ఎన్నిక జ‌రిగే లోపు ఆయ‌న వీలైన‌న్నిసార్లు నంద్యాల‌కు వ‌చ్చి, ప్ర‌చారం చేస్తార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక‌, ఇప్ప‌టికే 12 మంది ఎమ్మెల్యేల‌కు అధికార పార్టీ గెలుపు బాధ్య‌త‌ల్ని చంద్ర‌బాబు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. దీనికి ధీటుగా వైకాపా కూడా వార్డుకు ఇద్ద‌రు చొప్పున ఇంఛార్జ్ ల‌ను నియ‌మించింది. రాయ‌ల‌సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు నంద్యాల ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని అప్ప‌గించింది. రెండు పార్టీలూ నేత‌ల్ని త‌మ‌వైపు ఆక‌ర్షించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. దీన్లో భాగంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి శుక్ర‌వారం నాడు వైకాపాలో చేరారు. ఆయ‌న కుమారుడు, కొంద‌రు అనుచ‌ర నాయ‌కులు కూడా ప్ర‌తిప‌క్ష పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నిక‌ స‌మీపిస్తున్న ఈ త‌రుణంలో సంజీవ‌రెడ్డి పార్టీని వీడి వెళ్ల‌డం టీడీపీకి కాస్త ఇబ్బందిక‌రమైన‌ ప‌రిస్థితే అని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండుసార్లు నంద్యాల‌కు వ‌చ్చి, ప్ర‌చారం చేశారు. విప‌క్ష నేత జ‌గ‌న్ కూడా ఇందుకు ధీటుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన త‌రువాతే నంద్యాల‌లో ప్ర‌చారం చేసేందుకు వ‌స్తార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. నంద్యాల‌లోనే ఓ ప‌దిహేను రోజులు మకాం వేసి, ప్ర‌చారాన్ని హోరెత్తించాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్నార‌ని వైకాపా వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంద‌ర్భంగా మ‌రికొంది టీడీపీ నేత‌ల్ని వైకాపాలోకి చేర్చుకునే కార్య‌క్ర‌మం ఉండేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టూ తెలుస్తోంది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన త‌రువాత జ‌గ‌న్ ఓ రెండు భారీ రోడ్ షోలు నిర్వ‌హిస్తే స‌రిపోతుంద‌ని వైకాపాలో కొంద‌రు నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండుసార్లు వ‌చ్చార‌నీ, అధికారం వారి చేతిలో ఉండ‌టంతో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌థ‌కాల పేరుతో ప‌నులు చేయిస్తున్నార‌నీ… వారి ప్ర‌చారాన్ని త‌ట్టుకోవాలంటే జ‌గ‌న్ కొన్నాళ్ల‌పాటు నంద్యాల‌లో మ‌కాం వేయ‌డ‌మే క‌రెక్ట్ అని మ‌రికొంత‌మంది నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్ మ‌కాం వేయాల‌నుకుంటున్న నిర్ణ‌యం వెన‌క మ‌రో కార‌ణం ఉంద‌నీ ప్ర‌చారం జ‌రుగుతోంది! నంద్యాల‌ క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న పార్టీ ప్ర‌చారంపై జ‌గ‌న్ లో కాస్త అసంతృప్తి ఉంద‌నీ, అందుకే ఆయ‌నే స్వ‌యంగా కొన్నాళ్లు స్థానికంగా ఉంటూ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించాల‌నుకుంటున్నార‌నీ చెబుతున్నారు. ఏదేమైనా, 15 రోజుల‌పాటు నంద్యాల‌లో జ‌గ‌న్ మ‌కాం వేస్తే.. దానికి ధీటుగా టీడీపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తికరంగా మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.