పార్టీ నేత‌ల్ని జ‌గ‌న్ న‌మ్మ‌లేక‌పోతున్నారా..?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురించి ఈ విమ‌ర్శ చాలాకాలం నుంచీ ఉన్న‌దే! ఆయ‌న అంత ఈజీగా ఎవ్వ‌రినీ న‌మ్మ‌ర‌నీ, కీల‌క నిర్ణ‌యాల తీసుకునేటప్పుడు కూడా ఇత‌రుల స‌ల‌హాలు నామ మాత్రంగానే తీసుకుంటార‌నీ, సొంత నాయ‌కుల్ని కూడా ఆయ‌న కొన్నిసార్లు న‌మ్మ‌రు అనేవి త‌ర‌చూ వినిపిస్తుండే వ్యాఖ్యానాలే. పాద‌యాత్ర మొద‌లుపెట్టిన త‌రువాత ఇది నిజ‌మేనేమో అనిపించే కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం విశేషం! ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స‌మ‌యంలోనే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతుంటే… ఫిరాయింపు నేత‌ల‌పై చ‌ర్య‌లు పేరుతో వాటిని బ‌హిష్క‌రించారు. తాను లేన‌ప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఏం చేస్తార‌నేది జ‌గ‌న్ మ‌నోగ‌తం అంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, నాయ‌కుల‌పై ఆయ‌న‌కు న‌మ్మ‌కం త‌క్కువ, అందుకే తన గైర్హాజ‌రీలో ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి వెళ్లొద్ద‌న్నార‌నే విమ‌ర్శలు కూడా వినిపించాయి. ఈ విమ‌ర్శ‌కు బ‌లం చేకూర్చే మ‌రో ఘ‌ట‌న కూడా తాజాగా చోటు చేసుకుంది.

పార్టీకి రాజ‌కీయ స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిషోర్ ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర‌లో పీకే టీమ్ బాగానే హ‌డావుడి చేస్తోంది. యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో ప్ర‌జాభిప్రాయాల‌ను సేక‌రించ‌డం, జ‌గ‌న్ ప్రసంగాల‌పై ఫీడ్ బ్యాక్ తీసుకోవ‌డం, ఇస్తున్న హామీల‌పై ప్ర‌జా స్పంద‌న ఏంట‌నేది తెలుసుకోవ‌డం… ఇవ‌న్నీ చేస్తున్నారు. అయితే, ఇలా సేక‌రించిన స‌మాచారం పీకే టీమ్ ఎవ‌రికి అందిస్తారంటే.. ఇద్ద‌రికేన‌ట‌! ఒక‌రూ జ‌గ‌న్‌, మరొక‌రు జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి. త‌న‌కూ త‌న భార్య‌కు త‌ప్ప, సేక‌రించిన వివ‌రాలు ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ఆదేశించార‌ట‌. ఇలా చెబితే కొంత‌మంది మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా ఎలా ఉంటాయి చెప్పండీ..! అదే జ‌రిగింద‌నే గుస‌గుస‌లు పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ త‌రువాత పార్టీని న‌డిపిస్తున్న‌ది మేమే అనుకుని ప‌నిచేసేవారు కొంత‌మంది ఉన్నారు. క‌నీసం అలాంటివారికైనా ఈ రిపోర్టులు అందితే బాగుండేది. దీంతో జ‌గ‌న్ ఎవ్వ‌ర్నీ న‌మ్మరు భావ‌న ఆ పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మౌతోంది.

తాజాగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి వ్య‌వ‌హారంలోనూ ఇదే వైఖ‌రి అనుస‌రించార‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీ వీడేందుకు సిద్ధ‌మైంద‌ని తెలియగానే.. త‌న భార్య భార‌తితో ఈశ్వ‌రికి జ‌గ‌న్ ఫోన్ చేయించారు. ఆ విష‌యం స్వ‌యంగా ఈశ్వ‌రి బ‌య‌ట‌పెట్టారు. నిజానికి, ఈశ్వరిని బుజ్జ‌గించే బాధ్య‌త‌ను పార్టీలో ఇత‌ర నేత‌ల‌కు అప్ప‌గించి ఉన్నా కొంత ఫ‌లితం ఉండేద‌నేవారూ లేక‌పోలేదు! పార్టీ వ్య‌వ‌హారాల్లో భార‌తికి ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం వ‌ర‌కూ బాగానే అనిపిస్తోందిగానీ, ఇదే క్ర‌మంలో ఇత‌రుల‌ను న‌మ్మే ప‌రిస్థితిలో జ‌గ‌న్ లేర‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మౌతోంది. తాము ఎంత చేసినా జ‌గ‌న్ త‌మ‌ను విశ్వ‌సించ‌రు అనే అభిప్రాయం నేత‌ల్లో పాతుకుపోతే కాస్త ఇబ్బందే. అయితే, వైకాపా నుంచి ఎవ‌రు ఎప్పుడు బ‌య‌ట‌కి వెళ్లిపోతారో తెలియని వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప్రస్తుత తరుణంలో… ఎవ‌రిపైన అయినా తాను ఎందుకు ఆధార‌ప‌డాలీ అనేది జ‌గ‌న్ అభిప్రాయం కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.