హోదా కోసం జ‌గ‌న్ పోరాటం కూడా ఇంతింతే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా… ఇది కేవ‌లం ఒక చ‌ర్చ‌నీయాంశంగా మాత్ర‌మే మిగిలిపోయింది! అంద‌రూ హోదా కోసం పోరాటం చేస్తున్నామ‌ని చెప్తున్న‌వారే. కానీ, ఆ పోరాట‌మేంటో దాని రూపురేఖ‌లు ఎలా ఉంటాయో ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. ఈ విష‌యంలో అధికార ప్ర‌తిప‌క్షాలు దొందూ దొందే! కేంద్ర సాయంపై అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్తామ‌ని మొన్న‌నే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ఇదే అంశంపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా స్పందించ‌డం విశేషం! కొత్త‌గా ఏం చెప్ప‌లేదు, కొన్నాళ్లుగా చేస్తున్న విమ‌ర్శ‌లే మ‌ళ్లీ చేశారు.

త‌న స్వార్థం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాను కేంద్రం ద‌గ్గ‌ర చంద్ర‌బాబు నాయుడు తాక‌ట్టు పెట్టార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోసం ఇప్పుడు కోర్టుకు వెళ్తామ‌ని ముఖ్య‌మంత్రి మాట్లాడుతుండ‌టం హాస్యాస్ప‌దంగా ఉందంటూ కాళ‌హ‌స్తిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వంలో టీడీపీ వారు మంత్రులుగా ఉన్నార‌నీ, భాజ‌పాకి భాగ‌స్వామ్య ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, అలాంట‌ప్పుడు ఎవ‌రిపై కోర్టుకు వెళ్తార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి కాబ‌ట్టి, ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వేస్తున్న కొత్త ఎత్తుగ‌డ ఇది అని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం తెలుగుదేశం స‌ర్కారు ఏం చేసింద‌నేది ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన రెండు లేదా మూడు అంశాల‌పై… అవ‌స‌ర‌మైతే న్యాయ‌ పోరాటం గురించి ఆలోచిస్తామ‌ని చంద్రబాబు చెప్పారు. ‘ప్ర‌త్యేక హోదాపైనే పోరాటం చేస్తామ‌’ని చంద్ర‌బాబు నోక్కి చెప్పిన‌ట్టు మీడియాలో కూడా క‌థ‌నాలు రాలేదు! మ‌రో విష‌యం.. ప్ర‌త్యేక హోదా అనే చ‌ర్చ కేంద్రం ద‌గ్గ‌ర లేద‌నీ, ఎందుకంటే దానికి బ‌దులుగా ప్యాకేజీని కేంద్రం ఎప్పుడో ప్ర‌క‌టించిందని ఈ మ‌ధ్యనే రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు కూడా చెప్పారు. ప్యాకేజీ ప్ర‌కారం రావాల్సిన నిధుల గురించే కేంద్రంపై ఒత్తిడి పెంచుతామ‌ని టీడీపీ ఎంపీలు కూడా చెబుతున్నారు. సాంకేతికంగా, ప్ర‌త్యేక హోదా అనే టాపిక్ లేనే లేదు.

అయినాస‌రే, జ‌గ‌న్ మాత్రం ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌నీ, ఆంధ్రాకు అదే సంజీవ‌ని అంటూ పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చుకుంటూ వ‌స్తున్నారు. దాన్లో భాగంగానే ఇప్పుడిలా విమ‌ర్శ‌లు చేశారు అనుకోవ‌చ్చు. ఇంత‌కీ… ప్ర‌త్యేక హోదా కోసం వైకాపా చేసిన పోరాటమేదీ..? క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌గ‌న్ చెబుతారుగానీ, కార్య‌రూపంలో ఆ క‌ట్టుబాటు ఏంటో ఇప్ప‌టికీ క‌నిపించ‌డం లేదు! హోదా ఇవ్వ‌క‌పోతే మా ఎంపీలు రాజీనామా చేస్తార‌ని కొన్నేళ్ల కింద‌ట చెప్పారు. ఆ ప్ర‌స్థావ‌న ఎప్పుడు వ‌చ్చినా… చివ‌రి అస్త్రంగా రాజీనామాలు ఉంటాయంటారు! చివ‌రి అస్త్రం ప్ర‌యోగ‌మంటే.. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజులు ముందు అనుకోవ‌చ్చా..! ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో హోదాపై చంద్ర‌బాబు న్యాయ పోరాటానికి వెళ్ల‌డం ఓట్ల కోస‌మే అయితే… అదే ఎన్నిక‌ల ముందు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తే.. అది కూడా ఓట్ల కోస‌మే అవుతుంది క‌దా! హోదా సాధ‌న కోసం వైకాపా చేసిన పోరాటం ఎక్క‌డుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.