పార్టీ నేతలందరితో రేపు జగన్ భేటీ..! తీసుకోబోయే నిర్ణయాలేంటి..?

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా ఆదివారం పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. దీనికి ఎప్పుడూ లేని విధంగా పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అందర్నీ ఆహ్వానించారు. జగన్ ఒక్కసారిగా.. పార్టీలోని చిన్నాపెద్ద నేతంలదరితో… ఏం చర్చిస్తారనే ఆసక్తి… ఆ పార్టీ నేతల్లోనే ప్రారంభమయింది. కానీ ఎజెండా ఏమిటో..? దేని కోసమో.? అన్నదానిపై క్లారిటీ లేదు.

వైసీపీ మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ కు ఎంపీలు రాజీనామాలు చేయడం.. అసెంబ్లీని బహిష్కరించడం జగన్ చేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్స్ గా ప్రజల్లోకి వెళ్లాయి. చట్టసభలను వదిలేసి వెళ్లడం అనేది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఎంపీల రాజీనామాలు ఎలాగూ వెనక్కి తీసుకోలేరు కాబట్టి.. అసెంబ్లీకి వెళ్లడం మంచిదని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన కూడా వైసీపీ చేస్తోందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలు జగన్ తీసుకునే అవకాశం ఉంది.

అసెంబ్లీకి వెళ్తే పాదయాత్ర నిలిపి వేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏడు నెలలలుగా పాదయాత్ర చేస్తున్నారు. కొద్ది రోజులుగా రోజుకు ఐదు కిలోమీటర్లు కూడా నడవలేకపోతున్నారు. ఎలాగూ.. మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలనుకుంటున్నాం కాబట్టి.. వంద నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో.. జగ్గంపేటలోనే దాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా జగ్గం పేట నిలిచింది. ఈ నియోజకవర్గంలో పాదయత్ర పూర్తి చేసి.. ఆ తర్వాత బస్సుయాత్రను ప్రారంభించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ రెండు నిర్ణయాలకు జగ్గంపేటలోని పార్టీ నేతల సమావేశంలో ఆమోదముద్ర వేయించుకుని దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కడే తీసుకున్నా…తర్వాత అందర్నీ భాగస్వాముల్ని చేసి యూటర్న్ తీసుకుంటే… పార్టీలో వ్యతిరేకత రాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవాలేమిటో ఆదివారం తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com