తెలంగాణ‌లోని అభిమానులకు జ‌గ‌న్‌, ప‌వ‌న్ ఏం చెబుతారు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడో చెప్పేశారు. ఎందుకంటే, తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని తాము అనుకోలేద‌నీ, అందుకే సంసిద్ధం కాలేక‌పోయామ‌ని నిన్న‌నే చెన్నైలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. సాధార‌ణ షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే కొన్ని చోట్ల పోటీ చేయాల‌నే ఆలోచ‌న త‌మ‌కు ఉంద‌న్నారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ అంశ‌మై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌ట్నుంచీ పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. 2014 ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే తెలంగాణ‌పై వైకాపా ఆశ‌లు వ‌దిలేసుకుంద‌ని చెప్పొచ్చు. తెరాస అసెంబ్లీ ర‌ద్దు చేశాక… పోటీ గురించిగానీ, ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల గురించిగానీ ఇంత‌వ‌ర‌కూ జ‌గ‌న్ మాట్లాడిందే లేదు.

కార‌ణాలేవైనా ఈ రెండు పార్టీలూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో లేవు. కానీ, ఆయా పార్టీల‌కు ఇక్క‌డ కూడా అభిమానులున్నారు క‌దా. తెలంగాణ‌లో ప్ర‌తీ గ్రామంలో త‌మ జెండా మోస్తున్న‌వారు ఉన్నారంటూ ఏపీలో యాత్ర సంద‌ర్భంగా గ‌త‌వార‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. మ‌రి, ఆ అభిమానుల‌కు జ‌న‌సేన ఇస్తున్న పిలుపు ఏంటి..? త‌మ పార్టీ పోటీలో లేదు కాబ‌ట్టి… బ‌రిలో ఉన్న పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప‌వ‌న్ సూచిస్తారా లేదా అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానులు కూడా ఆయ‌న దిశా నిర్దేశం ఏంట‌నేది వేచి చూస్తారు క‌దా. ఎవ‌రికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించానే స్ప‌ష్టత‌ను కోరుకుంటారు. కానీ, ఇంత‌వ‌ర‌కూ ప‌వ‌న్ నుంచి అలాంటి ప్ర‌క‌ట‌న‌లేవీ లేవు. ఏ ప్ర‌క‌న‌టనా చేయ‌కుండా త‌ట‌స్థంగా ప‌వ‌న్ ఉండిపోవ‌డ‌మూ స‌రైంది కాద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

తెలంగాణ‌లో దివంగత వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులు ఇప్ప‌టికీ చాలామంది ఉన్నారంటూ వైకాపా నేత‌లు కూడా అంటుంటారు. తాజా ఎన్నికల సంద‌ర్భంగా ఆ అభిమానుల‌కు జ‌గ‌న్ కూడా ఎలాంటి దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. స‌రే, తెలంగాణలో రాజ‌కీయాల‌పై వైకాపా ఇప్ప‌ట్లో శ్ర‌ద్ధ పెట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదన్న‌ది వాస్త‌వం. ఆంధ్రాలో ఒక‌సారి అధికారంలోకి రావాలి.. ఆ త‌రువాతే, తెలంగాణ గురించి జ‌గ‌న్ ఆలోచించే అవ‌కాశం ఉంది. కానీ, అభిమానులు అంటూ తెలంగాణ‌లో ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు కాబ‌ట్టి… ఈ ఎన్నిక‌ల్లో వారికి ఏదో ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవ‌స‌రం ఇప్పుడైతే ఈ రెండు పార్టీలకీ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.