దూకుడే త‌ప్ప దూర‌దృష్టి లేని జ‌గ‌న్ విజ‌న్‌..!

మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చేస్తాయ‌న్నారు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా విశాఖ స‌మీపంలోని ఆనంద‌పురంలో ఆయ‌న మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ పెద్ద మ‌నిషి హాయాంలో ఉద్యోగాలు లేవ‌నీ, నిరుద్యోగ భృతి కూడా యువ‌త‌కు అంద‌లేద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకి పునాది ప‌నులు కూడా పూర్తి కాలేద‌నీ, కానీ ఈ పెద్ద మనిషి గ్యాల‌రీ వాక్ అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోసం నాలుగున్న‌రేళ్ల కింద‌టే పోరాటం చేసి ఉంటే, కేంద్ర ప్ర‌భుత్వానికి అల్టిమేట‌మ్ ఇచ్చి ఉంటే ఈపాటికి వ‌చ్చేసేద‌నీ, ఇన్నాళ్లూ ఏమీ చెయ్య‌కుండా ఇప్పుడు ధ‌ర్మ పోరాటాలంటే ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అన్నారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌లేద‌నీ, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డిపోయాయ‌నీ, రాష్ట్రంలో ఎక్క‌డా ఏ ఒక్క ప‌నీ జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు.

మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ప‌రిస్థితి అంతా మారిపోతుంద‌నీ, న‌వ‌ర‌త్నాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల స‌దుపాయాలూ క‌ల్పిస్తామ‌న్నారు. మ‌న పాల‌న రాగానే రాజ‌కీయాల్లోకి విశ్వ‌స‌నీయ‌త వ‌స్తుంద‌న్నారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంటు, పెన్ష‌న్లు… ఇలా ఆయ‌న రొటీన్ గా చెప్పేవ‌న్నీ చెప్పారు. ఇవ‌న్నీ స‌రే… జ‌గ‌న్ చెప్తున్న ఈ మాట‌లు వింటున్న‌ప్పుడు సామాన్యుడికి వ‌చ్చే ఒక అనుమానం ఏంటంటే…. చేతికి ఎముక లేద‌న్న‌ట్టుగా ఇచ్చేస్తున్న ఈ హామీల‌ను జ‌గ‌న్ ఎలా అమ‌లు చేస్తారూ అనేది! ఎందుకంటే, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌జ‌ల‌కు తెలుసు. కేంద్రం నుంచి సాయం అంద‌డం లేద‌నీ తెలుసు. అయినాస‌రే, రాష్ట్రాన్ని వెన‌క‌బ‌డ‌నీయ‌కుండా సీఎం చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌నీ తెలుసు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి, ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయి, కేంద్రం నుంచి ప్రోత్సాహం ల‌భించి ఉంటే అభివృద్ధి మ‌రింత వేగ‌వంతం అయ్యేద‌నీ ప్ర‌జ‌ల‌కు తెలుసు!

అయితే, తాము అధికారంలోకి రాగానే విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చేస్తాయ‌ని జ‌గ‌న్ ఎలా చెబుతున్నారు అనేదే ప్ర‌జ‌ల అనుమానం..? ఒక్క న‌వ‌ర‌త్నాలే స‌రిపోతాయా..? ప‌్రాజెక్టులు, ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర దీర్ఘ కాలిక అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌రిస్థితి ఏంటి..? నిధులెలా తెస్తారు, ఆదాయాన్ని ఎలా పెంచుతారు..? నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఇంత‌గా శ్ర‌మిస్తుంటేనే ప‌నులు న‌త్త న‌డ‌క‌న సాగుతున్నాయే… మ‌రి, జ‌గ‌న్ రాగానే విప్ల‌వాత్మ‌క మార్పులు ఎలా సాధ్య‌మౌతాయి..? కేంద్రంతో వ్యూహాత్మకంగా పోరాడేంత అనుభవం జగన్ లో ఉందా..? జ‌గ‌న్ లో దూకుడే త‌ప్ప‌… విజ‌న్ ఎక్క‌డ క‌నిపిస్తోంది..? అందుకు ఉదాహ‌ర‌ణే… నాలుగున్న‌రేళ్ల ముందే కేంద్రం పోరాటం చేసి ఉంటే హోదా వ‌చ్చేసి ఉండేద‌ని అన‌డం. జ‌గ‌న్ చెప్తున్న‌ట్టుగా కేంద్రానికి అల్టిమేటం అప్పుడే ఇచ్చి ఉంటే… ఈమాత్రం సాయం కూడా వ‌చ్చేది కాదు. ఇప్పుడు ఆంధ్రాకి కావాల్సింది దూకుడుతో వ్య‌వ‌హ‌రించే, లేదా భావోద్వేగాలకు లోన‌య్యే నాయ‌కత్వం కాదు. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల ప్ర‌ణాళిక‌తో, వ్యూహాత్మ‌కంగా రాష్ట్ర హ‌క్కుల్ని సాధించుకోగ‌లిగే నాయ‌క‌త్వం అవసరం. ఈ విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఈ ల‌క్ష‌ణం త‌న‌లో ఉందని జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కూ ఎస్టాబ్లిష్ చేసుకున్న‌దీ లేదు. కేవ‌లం సీఎం చంద్రబాబు మీద విమ‌ర్శ‌లూ, ఆరోప‌ణ‌లూ, తిట్లూ, శాప‌నార్థాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ఏదో ఒకసారి అంటే ఓకేగానీ, రోజూ అదేప‌నిగా విమ‌ర్శిస్తూ పోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటే వినేవారికి వెగ‌టు అనిపిస్తోంది. విమర్శల కంటే విజన్ మీద జగన్ ద్రుష్టి పెడితే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com